అదానీ ముడుపులపై జగన్ నోరు విప్పాలంటున్న షర్మిల
x
YS Sharmila (file photo)

అదానీ ముడుపులపై జగన్ నోరు విప్పాలంటున్న షర్మిల

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంస్థల నుంచి వైఎస్ జగన్ ముడుపులు తీసుకుని రాష్ట్రం పరువు తీశారని ఆయన సోదరి షర్మిల ఆరోపించారు.


ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన సోదరి వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ నుంచి లంచం తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. నవంబర్ 22న ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆమె ఈ సందర్భంగా ఏమన్నారంటే..
"ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారు. అమెరికా ఏజెన్సీలు గౌతమ్‌ అదానీ, మరికొందరిపై అభియోగాలు చేశాయి. భారత్‌లో అదానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడైంది. రూ.2,100కోట్లు చెల్లించినట్లు అమెరికా దర్యాప్తు ఏజెన్సీ తేల్చింది. రూ 1,750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు స్పష్టంగా వెల్లడైంది. ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్లు ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయి. గౌతమ్‌ అదానీపై విచారణ జరిపితే ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికా ఏజెన్సీలు బయటపెట్టే వరకు ఇది బయటకు రాలేదు’’ అని షర్మిల అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయమై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీ డిస్కం లకు ముట్టిన ముడుపులు ఎన్నో జగన్ చెబితే మంచిదన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ అసలు ఏమి జరిగిందో ప్రజల ముందుంచాలని కోరారు.
Read More
Next Story