జగనన్నా, కాపురంలో చిచ్చు పెట్టిందే నువ్వుకదన్నా!! మోసం చేశావు కదన్నా!!
అన్నా చెల్లెళ్ల సవాల్.. ఇంతకాలం నివురుకప్పిన నిప్పులా ఉన్న వైఎస్ కుటుంబ గుట్టు ఇప్పుడు రట్టయింది. కాపురాన్ని చీల్చింది నువ్వంటే నువ్వనుకుంటున్నారు..
ఇంతకాలం గుట్టుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఇప్పుడు బజారున పడినట్టే. నిన్న మొన్నటి వరకు బాబాయ్, అబ్బాయ్ అనుకుంటే ఇప్పుడు స్వయానా అన్నా చెల్లెళ్లే సవాళ్లు విసురుకుంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత పొడచూపిన విభేదాలు ఎక్కడెక్కడికో వెళ్లి ఎక్కడెక్కడో ఆగుతున్నాయి. వైఎస్సార్ స్వయానా తమ్ముడైన వివేకానందరెడ్డి కూతురు సునీత.. ఆమధ్య మా నాన్న హత్యకు కుట్ర చేసిందెవరో మా కుటుంబంలో కొందరికి తెలుసు అని పరోక్షంగా వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసిన సొంత చెల్లెలు... వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం జగనన్నే అంటున్నారు.
వైఎస్ షర్మిల ఏమన్నారంటే...
ఏపీసీసీ అధ్యక్షురాలైన తర్వాత వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చేశారు. అక్కడ తన మనసులోని వేదననంతా వెళ్లగక్కారు. ఇలా ఆమె తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి కారణం లేకపోలేదు. నిన్న తిరుపతిలో ఏపీ సీఎం జగన్ ఓ మీడియా ప్రతినిధి రాజ్దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ కారణమంటూ వ్యాఖ్యానించారు. దాన్ని జగన్ చెల్లెలు షర్మిల తిప్పికొట్టారు.
జగన్ చేజేతులా చేసుకున్నదే...
‘‘వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య, నా తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు. పార్టీ కోసం నెలల తరబడి 3,200కి.మీ పాదయాత్ర చేశా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా. సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించా. నా ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి ఎండ, వానల్లో రోడ్ల మీదే ఉన్నా. ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపునకు అండగా నిలబడి ప్రచారం చేశా. సీఎం అయిన రోజు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా ఫర్వాలేదు.. రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా“ అని షర్మిల పబ్లిక్ మీటింగ్ లోనే అనేశారు.
బీజేపీకి భయపడేందుకు?
అంతటితో ఆగలేదు షర్మిల. ఇంకో అడుగుముందుకేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను జగన్‌తో పాటు ఆయన పార్టీ వారంతా బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకున్నా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు.. రాష్ట్రానికి ఒక్క మేలు చేయకున్నా ఆ పార్టీకి ఎందుకు దాసోహమయ్యారో? చెప్పాలని సవాల్ చేశారు. తీగలాగితే డొంక బయటపడుతుందన్న సామెతగా తన అన్న జగన్ ఎవరికి, ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నది ఆమె ఉద్దేశంగా ఉంది. సీబీఐ కేసులకు భయపడుతున్నారనే బహుశా ఆమె మనోగతం కావొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
వారసులు సరే.. పనేదన్నా..
“ప్రత్యేక హోదా కోసం ఏనాడూ జగనన్న ఉద్యమం చేయలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిందీ లేదు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులన్నారు. ఇవాళ అసలు రాజధాని ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఆఖరికి విశాఖ స్టీల్‌ను కూడా బీజేపీకి పణంగా పెట్టారు. స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన వారు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. వైఎస్ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్‌ను సీఎంను చేశారు. వైఎస్ వారసులమని చెప్పడం కాదు.. పనితీరులో అది కనపడాలి. రైతును రాజశేఖర్‌రెడ్డి నెత్తిన పెట్టుకున్నారు. ఆయన ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగ.. ఇప్పుడు దండగగా మారింది. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలనే ధ్యాసే లేకుండా పోయింది. ఉద్యోగ ఖాళీలనూ భర్తీ చేసే పరిస్థితి లేదు. వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? “ అని షర్మిల ప్రశ్నిస్తుంటే హాలు హాలంతా చప్పట్లతో మార్మోగింది.
నీ పదవి ఎంతోమంది త్యాగఫలం..
“సీఎం ప్రజల వద్దకు వెళ్లరు.. వాళ్లు వచ్చినా కలవనీయరు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా జగన్ కనపడరు. వైఎస్‌ను కలవాలంటే ప్రజాదర్బార్‌లో నేరుగా కలిసేవాళ్లు. ఎంతోమంది ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి అందరినీ దూరం చేసుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండటం చూసి చలించిపోయా. నా కుటుంబం చీలిపోతుందని తెలిసినా ప్రజల కోసం కాంగ్రెస్‌లో చేరా. అద్భుత రాజధాని కావాలనేది మా పార్టీ ఉద్దేశం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ తొలి సంతకం చేస్తారు’’ అన్నారు షర్మిల.
నా పిల్లల్ని వదిలిపెట్టి తిరిగానన్నా...
నా ఇంటిని, పిల్లల్ని పక్కన పెట్టి...ఎండనక,వాన అనక రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా, దేశంలోనే సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషి,మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. కానీ రాష్ట్రానికి అన్యాయం చేయడమే బాధని పించింది. అందుకే నోరు విప్పాల్సి వచ్చింది అన్నప్పుడు వైఎస్ షర్మిల జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని, నన్ను కాంగ్రెస్ ఏపికి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నానని షర్మిల స్పష్టం చేశారు.