‘అలా అడగలేను.. వారసత్వం’
x
Source: Twitter

‘అలా అడగలేను.. వారసత్వం’

ఎన్నికల వేళ విజయమ్మ.. అటు సీఎం జగన్, ఇటు షర్మిల ఇద్దరి కార్యక్రమాల్లో పాల్గొనడంపై షర్మిల స్పందించారు. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను విడదీసి రెండు రాష్ట్రాలుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే సొంతం. కాంగ్రెస్ సాధించిన ఈ ఘనతకు బహుమానంగా తెలుగు ప్రజలు ఆ పార్టీని బహిష్కరించారు. అందుకే 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మనుగడను సాగించడానికి కూడా కాంగ్రెస్ కష్టపడింది. తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో పరిస్థితులు మారాయి. కానీ ఆంధ్రలో అయితే అసలు కాంగ్రెస్ అనే పార్టీ రాష్ట్రంలో ఉందా అన్న అటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల చేతిలోకి వచ్చాక.. రాష్ట్రంలో పార్టీ ముఖచిత్రం కాస్త మారుతోంది. కాంగ్రెస్‌ను మళ్లీ ఉనికిలోకి తీసుకురావడానికి షర్మిల తెగ ప్రయాస పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్ర దివంగత సీఎం వైఎస్ఆర్.. రాజకీయ వారసత్వాన్ని కూడా షర్మిల తనకే చెందుతుందని ప్రకటించుకున్నారు.

షర్మిల కష్టం ఫలించేనా

అయితే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో తిరిగి ఉనికిలోకి తీసుకురావడానికి షర్మిల పడుతున్న కష్టం పడుతుందా అంటే తప్పకుండా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం 1.2శాతం ఓట్లనే సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థితిని 2024లో షర్మిల మార్చగలుగుతుందా? ఈ క్రమంలో షర్మిలకు సంబంధించి అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం, వైఎస్ఆర్ రాజకీయ ఆశయం, షర్మిల రాజకీయ భవిష్యత్తుపై వైఎస్ఆర్ ప్లానింగ్ ఇలా మరిన్ని ప్రశ్నలు తెగ వినిపిస్తున్నాయి. తాజాగా వీటిలో కొన్ని కీలక ప్రశ్నలకు వైఎస్ షర్మిల సమాధానం ఇచ్చారు.

వైఎస్ఆర్ వారసత్వం మీదేనా?

‘‘కచ్ఛితంగా.. వైఎస్ఆర్ రాజకీయ వారసురాలిని నేనే. వైఎస్ఆర్ సిద్ధాంతాలను పాటిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ లెగసీని పొందగలరు. కానీ మా నాన్నకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య అనేక విషయాల్లో నేలకు, ఆకాశానికి ఉన్న వ్యత్యాసం ఉంది. వైఎస్ఆర్ అంటే మాటపై నిలబడే వ్యక్తి. ఆయన మాట ఇచ్చారంటే దాన్ని నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజలకు, నేతలకు కూడా ఉండేది. తన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన తన ప్రాణాలను విడవడానికి కూడా వెనకాడరు. కానీ జగన్.. అబద్దాలు, మోసాల మనిషి. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన అనేక హామీలు నీటిపైన రాతలుగా మారాయి. వాటిలో రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్‌ల పూర్తి, 2.3 లక్షల ప్రభుత్వ ఖాళీల భర్తీ, డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు.. జగన్.. వైఎస్‌ఆర్ రాజకీయ వారసత్వాన్ని ఎలా పొందగలరు? వైఎస్ఆర్ వారసత్వం కావాలంటే ముందు వైఎస్ఆర్ సిద్ధాంతాల పాటిస్తూ జీవించడం నేర్చుకోవాలి’’అని షర్మిల చెప్పారు.

రాజకీయాలకు దూరంగానే

తన రాజకీయ జీవితంపై వైఎస్ఆర్‌ ఎటువంటి ఆలోచన చేయలేదని, వీలైనంత వరకు తనను రాజకీయాలకు దూరంగానే ఉంచాలని భావించారని షర్మిల స్పష్టం చేశారు. ‘‘నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని వైఎస్ఆర్ కలలో కూడా భావించలేదు. నేనంటే ఆయనకు పంచప్రాణాలు. ఒకానొక దశలో నేను మెడిసిన్ చదువుతా అంటే అందుకు కూడా ఒప్పుకోలేదు. నేను సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే ఆయన అనుకున్నారు. నాకు కూడా రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చేలా నన్ను పరిస్థితులు ఒత్తిడి చేశాయి. ఒకవేళ మా నాన్న బతికి ఉండి ఉంటే నాకు పూర్తి సహకారం అందించి ఉండేవారు’’ అని వెల్లడించారు.

వివేకానందరెడ్డి హత్యపై సైలెంట్‌గా లేను

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికల ముందు ఆ సమస్యను పెద్దది ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న ప్రజల్లో మెదులుతోందన్న అంశంపై కూడా ఆమె స్పందించారు. ‘‘నేను ఈ ఐదేళ్లూ ఏమీ సైలెంట్‌‌గా లేను. ఈ న్యాయపోరాటంలో సునీతకు అండగా, మద్దతుగా నిలిచాను. కానీ మా కుటుంబీకులే మాకు దూరం జరిగారు. అయినా మేము మా పోరాటం ఆపలేదు. ఇప్పుడు కడప నుంచి ఎన్నికల బరిలో నిలబడాలని నిశ్చయించుకున్న తర్వాత నేను ఎక్కువగా వినిపిస్తున్నాను. కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డినే మరోసారి వైసీపీ నిలబెట్టినందుకే నేను కడప బరిలోకి దిగాలన్న నిర్ణయం తీసుకున్నాను. అవినాష్‌ను సీబీఐ తమ నిందితుల జాబితాలో చేర్చింది’’అని గుర్తు చేశారు.

విజయమ్మ తీరుకు అర్థం అదే

ఆంధ్ర ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ.. అటు సీఎం జగన్, ఇటు వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూడా షర్మిల స్పష్టతనిచ్చారు. ‘‘విజయమ్మ ముందు ఒక తల్లి. అందుకే తన ఇద్దరు పిల్లలకు అండగా నిలబడ్డారు. రెండు కళ్ళలో ఒక కంటిని ఎంచుకోమంటే.. అది సాధ్యం కాదు కదా. అలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆమెను అడగడం ఏమాత్రం సమంజసంగా ఉండదు. నేను కూడా అమ్మను అలాంటి నిర్ణయం తీసుకోమని అడగలేదు. ఇద్దరు విషయంలో ఆమె న్యూట్రల్‌గా ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని వివరించారు.

కాంగ్రెస్‌ను ఆంధ్రులు క్షమించారా..

‘‘రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టిన విషయం వాస్తవం. కానీ జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేరు. రాష్ట్ర విభజనకు కేవలం కాంగ్రెస్‌నే దోషిగా చెప్పలేం. బీజేపీ కూడా ఆంధ్ర పునఃవ్యవస్థీకరణ చట్టానికి మద్దతు పలికింది’’అని గుర్తు చేశారు.

Read More
Next Story