అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, తోడుగా నిలబడుతుందని జగన్ అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజుతో 15 ఏళ్లు అవుతోంది. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో తొలి రోజు నుంచి ప్రజల సమస్యల మీదనే పని చేస్తోంది. ప్రజల కష్టాల నుంచే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ద వాయిస్‌లెస్ కింద అడుగడుగున పని చేస్తూ వస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 15వ ఏటలోకి అడుగుపెట్టని నేపథ్యంలో తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వాలకు ధీటైన సమాధానం ఇస్తూనే వచ్చాం. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సమయానికి ఎన్నికలు అయిపోయి ఇప్పటికే ఏడాది అయిపోయింది. మరో మూడు, రెండు సంవత్సరాలల్లో ఈ సారి అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌సీపీనే అంటూ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లినప్పుడు కానీ, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి రైతన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తను చూసి చక్కటి చిరునవ్వుతో పలకరిస్తారు. అందుకు కారణం వైఎస్‌ఆర్‌సీపీ చెప్పిందంటే చేస్తుందనే నమ్మకమే. అదే ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉందని పేర్కొన్నారు.