జగనన్నా.. డబ్బు కోసం పేగుబంధాన్నే తుంచుతావా? షర్మిల ఘాటు లేఖ
x

జగనన్నా.. డబ్బు కోసం పేగుబంధాన్నే తుంచుతావా? షర్మిల ఘాటు లేఖ

తల్లి తర్వాత అంతటి స్థానం మేనమామది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆదర్శంగా, గొప్పగా ఉన్న కుటుంబాలు కూడా ఆర్ధిక సంబంధాల ముందు వెలవెలపోతున్నాయి.


భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు కుటుంబాలలో మేనమామకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లి తర్వాత అంతటి స్థానం మేనమామది. తల్లి లేని లోటును మేనమామ భర్తీ చేస్తారన్న అర్థంలో చాలా సామెతలూ ఉన్నాయి. డబ్బుకు లోకం దాసోహం అయిన రోజుల్లో కుటుంబ సంబంధాలు గాలికి కొట్టుకుపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆదర్శంగా, గొప్పగా ఉన్న కుటుంబాలు కూడా ఆర్ధిక సంబంధాల ముందు వెలవెలపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం. వైఎస్సార్ బతికున్నంత కాలం ఎన్నడూ బయటకు రాని సంచలన విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఆస్తుల ముందు అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ డొల్లేనని రుజువవుతున్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తులున్నా ఈ కుటుంబం డబ్బు కోసం చట్టపరమైన పోరాటానికి దిగడం తెలుగు ప్రజల్ని విస్తుపరుస్తోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దంపతులు తమ నలుగురు మనుమలకు సమానంగా ఆస్తులు దక్కాలని చెప్పినా ఇప్పుడు స్వయానా రక్తం పంచుకుపుట్టిన బిడ్డలు ఆస్తుల కోసం వీధినపడ్డారని తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


రాజశేఖరరెడ్డి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కంపెనీలో తన చెల్లికి, తల్లికి ఇచ్చిన వాటాను వెనక్కుతీసుకుంటానని లేఖ రాయడం, దానికనుగుణంగా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు చూసే కోర్టుకు లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఆస్తులు వాళ్లకి ఇవ్వాలంటే తనను, తన భార్యను, తన బాబాయి కొడుకు అవినాశ్ రెడ్డిని విమర్శించకూడదని షరతులు విధిస్తూ తన చెల్లెలు షర్మిలకు లేఖ రాశారు. దానిపై షర్మిల కూడా ఘాటుగానే బదులిచ్చారు.

షర్మిల ఏమని లేఖ రాశారంటే..
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా దక్కకుండా తన అన్న వైఎస్ జగన్ అన్యాయం చేశారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఆస్తుల పంపకానికి సంబంధించి తనతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఖాతరు చేయవా అంటూ ప్రశ్నించారు. తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సెటిల్‌ కావాలంటే.. జగన్‌కు, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడంపై ఆమె మండిపడ్డారు. ‘మీరు నైతికంగా దిగజారిపోయిన అథఃపాతాళపు లోతుల నుంచి పైకి వచ్చి, ఇప్పటికైనా మన తండ్రికి ఇచ్చిన మాట నెరవేరుస్తారని, మన మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను. అలా జరగాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ మీరు అలాగే ఉండాలని నిర్ణయించుకుంటే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా నాకున్న మార్గాల్లో వెళతాను’ అంటూ జగన్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. నా రాజకీయ ప్రయాణం ఎలా ఉండాలో నిర్దేశించడానికి మీరెవరంటూ ఎదురుదాడికి దిగారు. ఆ లేఖపై షర్మిలతో పాటు, తల్లి విజయమ్మ కూడా సంతకం చేశారు. ‘ప్రియమైన జగన్’ అంటూ మొదలైన ఆ లేఖ ఇలా సాగింది.

"డియర్ జగన్ అన్నా. మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. దివంగతులైన మన నాన్నగారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్పిన విషయం మీకు గుర్తుచేస్తున్నా. ఈ షరతుకి అంగీకరిస్తున్నానని అప్పట్లో మీరు మాకు హామీ ఇచ్చారు. అయితే నాన్న మరణం తర్వాత దానికి ఒప్పుకోనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షితో పాటు నాన్న తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులను నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా ఇవ్వాలని చెప్పారు. వీటన్నింటికీ అమ్మే సాక్షి. అయితే నాకు బదిలీ చేసినట్లుగా చేసుకున్న ఒప్పందంలో చెప్పిన ఆస్తులు, నాన్న ఆదేశాలను పాక్షికంగా పాటించడమే. పాక్షికంగా అని ఎందుకంటున్నానంటే సాక్షి, భారతీ సిమెంట్స్‌లో మెజారిటీ వాటాను మీరు కోరుతున్నారు." అని తన లేఖలో రాశారు.
ఇస్తానన్న ఆస్తులూ ఇవ్వవా?
2019 ఆగస్టు 31న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇస్తానన్న ఆస్తుల్ని కూడా ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు. ఎంఓయూ ప్రకారం మీ చెల్లెలు, ఆమె పిల్లలకు చెందాల్సిన ఆస్తులను వారికి దక్కకుండా చేస్తున్నారు. దాని కోసం ఏకంగా సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారారు. మహోన్నతుడైన మన తండ్రి నడిచిన మార్గానికి మీరు ఎంత దూరంగా వెళుతున్నారో చూసి దిగ్భ్రాంతి చెందుతున్నాను. నాన్న ఆకాంక్షలకు, మీరు గతంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు. మీరు రాసిన చట్టప్రకారం.. ఆ ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. మీరు ఆ లేఖ రాయడం వెనుక ఉన్న దురుద్దేశం నన్ను తీవ్రంగా బాధించింది. నాన్న ఎప్పుడూ కలలో కూడా ఊహించని పని మీరు చేశారు. ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యపైనా, కుమార్తెపైనా కేసులు పెట్టడంతో పాటు, ఆస్తిలో ఆయన కుటుంబానికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటాను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
చట్టప్రకారం కోర్టుకు వెళతా..
ఎంఓయూకి కాలం చెల్లదు. దానికి మీరు కట్టుబడాల్సిందే. మీరు దాన్ని ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం చట్టప్రకారం కుదరదు. బెంగళూరులో 20 ఎకరాల్లో ఉన్న యలహంక ప్యాలెస్‌లో వాటాతో పాటు.. ఎంఓయూలో ప్రతి అంశాన్నీ మీరు నెరవేర్చాల్సిందే. లేకపోతే మిమ్మల్ని చట్టప్రకారం బాధ్యుల్ని చేస్తాను. వా నిటినీ మీరు ఎంఓయూలో చేర్చడంతో పాటు, మౌఖికంగానూ అంగీకరించారు. దానికి అమ్మే సాక్షి.

నా రాజకీయ జీవితం నా ఇష్టం. నా వృత్తిపరమైన వ్యవహారశైలి ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం మీకు లేదు. బహిరంగ వేదికలపై మీకు, ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న నిబంధనపై నన్ను సంతకం చేయమని కోరడం అసంబద్ధం. నాకు అరకొర ఆస్తులు మాత్రమే ఇస్తూ చేసుకున్న ఒప్పందంపై సెటిల్‌మెంట్‌కి అలాంటి అర్థంపర్థంలేని నిబంధన విధించడం సహేతుకం కాదు.
రక్తసంబంధాన్ని మరువకండి..
తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవళ్లకు చెందాలన్న నాన్న అభిమతాన్ని, నా రాజకీయ ప్రయాణంతో ముడిపెట్టాలని చూడటం సరికాదు. నాకు అన్నగా, నా పిల్లలతో రక్తసంబంధం ఉన్న మామగా, మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఒప్పందాన్ని తప్పక అమలు చేయడం మీ బాధ్యత. మీరు నైతికంగా దిగజారిపోయిన లోతుల నుంచి పైకి రావాలని, తండ్రి నిరూపించాలని ఇప్పటికీ ఆశిస్తున్నాను. మీరు ఆ పని చేయకపోతే నా హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా నాకున్న మార్గాల్లో వెళతాను. ఈ వాస్తవాల్లోని గాఢతను మీకు గుర్తు చేయడానికి, ఈ పరిణామాలన్నీ సాక్షిగా అమ్మ కూడా ఈ లేఖపై సంతకం చేసింది.
మీరిద్దరేగా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు?
ఎంఓయూలో నా వాటాగా సరస్వతి పవర్‌లోని షేర్లు మొత్తం ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే నాకు బదలాయిస్తానని హామీ ఇచ్చారు. అంగీకరించి అనేక సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు. పైగా భారతి, సండూర్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాక, మిగిలిన షేర్లను వాటి ఫోలియో నెంబర్లు సహా రాసిన గిఫ్ట్‌ డీడ్స్‌పై మీరు, మీ భార్య భారతి సంతకాలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చాక... ఇప్పుడు మీరు దానిపై ఫిర్యాదు చేయడం, గగ్గోలు పెట్టడం సరికాదు. నాకు చట్టబద్ధంగా దక్కాల్సిన సరస్వతి పవర్ షేర్లు, దక్కకుండా చేయాలన్న దురుద్దేశంతోనే మీరు ఈ పనికి పూనుకున్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఈమె రాసిన లేఖను టీడీపీ వర్గాలు బయటపెట్టాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ లో ఆ లేఖను ముక్కలు ముక్కలుగా పోస్ట్ చేయడం గమనార్హం.


Read More
Next Story