ప్రజాగళంలో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ఊసే లేదెందుకు?
x

ప్రజాగళంలో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ఊసే లేదెందుకు?

‘ప్రజాగళం’ సభపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ఊసే లేదెందుకని ప్రశ్నించారు.


ఆంధ్రలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా పార్టీలన్నీ ప్రచారం ప్రారంభించేశాయి. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే కార్యక్రమానికి కూడా నేతలు రిబ్బన్ కటింగ్ చేసేశారు. ఇందులో భాగంగా చిలకలూరి పేటలో ఆదివారం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నిర్వహించిన ‘ప్రజాగళం’ సభపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది వరకే 2014లో ఈ మూడు పార్టీలు ఒకసారి కలిసి ఎన్నికల బరిలోకి దిగి అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు.

అప్పుడు ఇచ్చిన హామీల్లో వీరు ఎన్నింటిని అమలు చేశారో వారు చెప్పాలి? అని నిలదీశారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఉందని, అది ఆ తర్వాత ఏమైపోయిందో కూడా తెలీదని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే తెగదెంపులు చేసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కూటమి రద్దయిన తర్వాత చంద్రబాబు పలు సందర్బాల్లో ప్రధాని మోదీని వ్యక్తిగత హననం చేశారని గుర్తు చేశారు.

‘ప్రజాగళం’లో సంజాయిషీ ఇవ్వాల్సింది!

ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో 2014లో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన.. అమలుకు నోచుకోని హామీలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పదేళ్ల తర్వాత మళ్ళీ కలిసొచ్చి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నామన్న భావన వాళ్ళ ముఖాల్లో ఇసుమంతైనా కనిపించలేదు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల బరిలోకి అడుగంటూ పెట్టరు. ఎన్నికలంటే ఆయనకు పొత్తులే గుర్తొస్తాయి. 2014లో చంద్రబాబు సుమారు 600 హామీలు ఇచ్చారు. వాటి అమలు అప్పుడు మాత్రం బాబు మొఖం చాటేశారు. చిలకలూరి పేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభ అబద్దాలు, వంచనకు ప్రతిరూపం’’అని ఆరోపించారు సజ్జల.

మైకులు ఆగితే పోలీసులకు సంబంధమేంటి!

‘ప్రజాగళం’ సభను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, అందులో పోలీసుల పాత్ర కూడా ఉందంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. కూటమి నిర్వహించిన ఈ సభ అట్టర్ ఫెయిల్ అయిందని చురకలంటించారు. ‘‘సీఎం జగన్‌పై దుమ్మెత్తి పోయడమే ఈ సభ ప్రధాన అజెండా. సభలో వాళ్ళ మైక్ ఫెయిల్ అయితే దానికీ పోలీసులకు సంబంధం ఏంటి? కరెంటు పోతే పోలీసులు ఏం చేస్తారు? సభను నిర్వహించడంలో వాళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అంతా వైసీపీ కుట్ర అంటూ మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’’అని ఆగ్రహించారు. ‘‘ఢిల్లీ నుంచి సభకు హాజరుకావడానికి ప్రధాని మోదీ వస్తే ఆయనకు ఒక బొకే ఉండదు.. శాలువా ఉండదు.. ఇదెక్కడి విచిత్రం. ఇదే తరహాలో ప్రధాని హోదాలో మోడీ ఆంధ్రాకు వస్తే సీఎం జగన్ ఆయనను రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రశ్నించారు. ఈ అంశాలను చంద్రబాబు, పవన్ ఎందుకు ప్రస్తావించలేదు’’అని ప్రశ్నించారాయన.

ఎన్నికల సమయంలో ఓట్లు రాబట్టడానికి చంద్రబాబు అనేక అబద్దపు హామీలు ఇస్తారని కానీ ప్రజలు వాటిని గమనించి అప్రమత్తంగా ఉండాలని, మరోసారి సరైన నేతనే ఎన్నుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకన్నా జగన్ ఎక్కువ సంక్షేమమే చేశారని, అది అలానే కొనసాగాలంటే ప్రజలు మరోసారి వైసీపీకే ఓటు వేయాలని కోరారు సజ్జల. చంద్రబాబు చెప్పే అబద్దాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, అధికారంలోకి ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందో ప్రజలకు బాగా తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story