ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పి విద్యుత్ చార్జీలు పెంచిందని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు నిర్వహించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్‌చార్జీలు, నిరసన ర్యాలీలకు నాయకత్వం వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుంచి ప్రధాన వీధులు గుండా ర్యాలీలు చేసుకుంటూ వెళ్లి విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ సీఎం జగన్ ఫొటోలను ప్లకార్డులుగా ప్రదర్శించారు. ప్రధానమైన విద్యుత్ సబ్ స్టేషన్‌ల వద్ద నిరసన సభలు కూడా నిర్వహించారు. మాజీ మంత్రులు, పార్టీ అధికార ప్రతినిధులు నిరసనల్లో పాల్గొన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచేదే లేదని పలు సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ప్రకటించారని, పదే పదే విద్యుత్ చార్జీలను పెంచేదే లేదని చెప్పి సీఎం చంద్రబాబు ప్రజలను మోసగించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాల్లో కలెక్టర్లకు విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు పట్టణాల్లో భారీగా ర్యాలీల్లో జనం పాల్గొన్నారు.