ఉత్తరాంధ్ర వైసీపీలో మార్పులు..?!
x

ఉత్తరాంధ్ర వైసీపీలో మార్పులు..?!

నెలాఖరుకల్లా జిల్లా అధ్యక్ష పదవుల్లో కొత్త వారికి ఛాన్స్. ప్రస్తుత రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థకు మంగళం?


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక వైసీపీలో అంతర్మథనం మొదలైంది. అనూహ్య ఓటమితో నైరాశ్యంలో ఉన్న ఆ పార్టీ క్యాడర్ లో మళ్లీ జోష్ నింపాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పార్టీలో మార్పులు, చేర్పులను తీసుకొస్తోంది. ఇటీవల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పాత అధ్యక్షులను మార్చి కొత్త వారిని నియమించారు. ఉత్తరాంధ్రలో మాత్రం పాత వారినే కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, విజయనగరానికి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యానికి శతృచర్ల పరీక్షిత్రాజు, విశాఖపట్నానికి కోలా గురువులు, అనకాపల్లికి బొడ్డేడ ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు కొట్టిగుళ్లు భాగ్యలక్ష్మిలు అధ్యక్షులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరిని కొనసాగిస్తూ మిగతా వారిని మార్చి కొత్త వారికి జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పిస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. నెలాఖరులోగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అన్నను మార్చి తమ్ముడికిస్తారా?

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. కృష్ణదాసు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన తమ్ముడు ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా పని చేశారు. జిల్లా అధ్యక్ష పదవిలో చాన్నాళ్లుగా ధర్మాన కృష్ణదాసు కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రసాదరావు పార్టీలో ఏమంత చురుగ్గా కనిపించడం లేదు. పైగా అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన ప్రసాదరావు పార్టీకి దూరం కాకుండా ఆయనకు జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. పైగా అన్న కృష్ణదాసుకంటే ప్రసాదరావే జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవితో తిరిగి జిల్లాలో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారన్న భావన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఈ రెండు జిల్లాల్లో పాత వారే..

విజయనగరం జిల్లాకు చాన్నాళ్ల నుంచి మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అధ్యక్షునిగా ఉన్నారు. ఈయన మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షునిగా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి భర్త శతృచర్ల పరీక్షిత్ రాజు కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు జిల్లాలకు కొత్త వారిని నియమించే ఆలోచన వైసీపీకి అధిష్టానానికి లేదని చెబుతున్నారు. అందువల్ల వీరిద్దరూ జిల్లా అధ్యక్ష పదవుల్లో కొనసాగనున్నారు.

విశాఖలో కొత్త వారికే ఛాన్స్!

ఇక విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షునిగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులు ఉన్నారు. తాజా మార్పుల్లో ఆయనను తప్పించి కాపు, వెలమ కులస్తుల్లో ఒకరికి ఆ పదవిని కట్టబెడతారని తెలుస్తోంది. కాపు కులస్తునికైతే మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, వెలమలకైతే మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్కు ఇస్తారని అంటున్నారు. విశాఖ జిల్లాలో మత్స్యకార సామాజిక వర్గం కూడా బలంగా ఉండడంతో కోలా గురువులకు జిల్లా అధ్యక్ష పదవికి బదులు మరో ప్రాధాన్యత కలిగిన పదవిని ఇచ్చే అవకాశం ఉంది.

అనకాపల్లి ‘బూడి’కి..?

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా గవర సామాజికవర్గానికి చెందిన బొడ్డే ప్రసాద్ ఉన్నారు. ఈ జిల్లాలో కాపు, వెలమ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. అందువల్ల ఈ దఫా జిల్లాలో ఈ రెండు కులాల్లో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవినివ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడికే ఖాయం చేస్తారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరి నిమిషంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మాడుగుల స్థానాన్ని ఆయన కుమార్తెకు, బూడికి అనకాపల్లి ఎంపీ సీటును ఖరారు చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ అధినేత ఆదేశాన్ని కాదనలేక పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన కీలకమైన అనకాపల్లి జిల్లా అధ్యక్ష పదవిని బూడికే ఇవ్వాలన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. మరోవైపు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి వెలమ సామాజికవర్గానికి కేటాయిస్తే అనకాపల్లి జిల్లా కచ్చితంగా కాపు కులస్తులకే ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరిగితే మాజీ మంత్రి గుడివాడకు విశాఖ జిల్లాకు బదులు అనకాపల్లి జిల్లా అధ్యక్ష పదవినిస్తారని తెలుస్తోంది. ఇలా చూస్తూ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్ష పదవులు కాపు, వెలమ సామాజిక వర్గాలకు చెరొకటి కేటాయించే అవకాశం ఉంది.

అల్లూరి మాధవిని వరిస్తుందా?

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోకెల్లా ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ రెండు స్థానాలను దక్కించుకుంది. ఈ జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు లోక్సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కూటమి వేవ్లోనూ ఈ రెండు అసెంబ్లీ, ఒక లోక్సభ సీటును కైవసం చేసుకుని వైసీపీ ఆ జిల్లాలో సత్తా చాటుకుంది. ఈ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి.. ఎంపీగా ఉన్న గొట్టేటి మాధవికి బదులు తనూజారాణికి అరకు ఎంపీ సీటు కేటాయించారు. దీంతో అప్పట్నుంచి మాధవి మనస్తాపంతో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా అధ్యక్ష పదవినిచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రీజనల్ కోఆర్డినేటర్లకు మంగళం..?

ఇక వైఎసీపీ పార్టీలో చాన్నాళ్ల నుంచి కొనసాగుతున్న రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అదే జరిగితే జిల్లా అధ్యక్షులే నేరుగా నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమన్వయం చేసుకునే వీలుంటుంది. గతంలో వీరందరూ రీజనల్ కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఉండేవారు, ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కీలకంగా మారనుంది. అందువల్ల ఈ పదవులకు వైసీపీలో డిమాండ్ పెరుగుతోంది.

Read More
Next Story