వైసీపీ మీద విశాఖ యాదవుల అలక
x
YCP

వైసీపీ మీద విశాఖ యాదవుల అలక

విశాఖ నగరంలో మెజారిటీ సామాజిక వర్గమైన యాదవులకు వైసీపీ ఈసారి ఒక్క టికెట్టు కేటాయించలేదు. వైసిపి మీద అలిగిన యాదవులు ఎటువైపు చూస్తారు



(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: 'సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చేసి చూపించింది వైసీపీ.. 50 శాతం కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు తమ పార్టీ సీట్లు కేటాయిస్తోంది' రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట తరచూ వచ్చే మాటలు ఇవి. రాష్ట్రం విషయం పక్కన పెడితే.. విశాఖ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.


వైసీపీ ప్రకటించిన అభ్యర్థులు వీరే....


విశాఖ నగర పరిధిలోని భీమిలి నుంచి గాజువాక నియోజకవర్గం వరకు చూసుకుంటే ఒక్క నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. భీమిలిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముత్తం శెట్టి శ్రీనివాస్, విశాఖ తూర్పు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎం వీవీ సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేకే రాజు, దక్షిణం నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ నియోజకవర్గం నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన ఆడారి ఆనంద్ కుమార్, పెందుర్తి నియోజకవర్గం నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన అన్నం రెడ్డి అదీప్ రాజు, గాజువాక నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్‌కు వైసీపీ టికెట్లు ఇచ్చింది. ఇందులో కాపు సామాజిక వర్గానికి రెండు సీట్లు కేటాయించగా.. యాదవ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు.


ఓట్లు ఉన్నా సీట్లు లేవు...


విశాఖ నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర , దక్షిణ , గాజువాక , భీమిలి నియోజకవర్గాలు యాదవులకు అనుకూలమైనవి. ఇందులో రెండు నియోజకవర్గాల్లో వైసీపీ.. యాదవ అభ్యర్థులను ప్రకటించి తిరిగి తప్పించింది. భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో యాదవ ఓటర్లే అత్యధికం. తొలుత వైసీపీ.. విశాఖ తూర్పు నియోజకవర్గానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్రమాని విజయనిర్మలను సమన్వయకర్తగా ప్రకటించి తర్వాత తప్పించింది. గాజువాక నియోజకవర్గంలో తొలుత ఉరుకూటి చందును వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి తర్వాత ఆ సీటును మంత్రి అమర్నాథ్‌కు కేటాయించింది.


గతమెంతో ఘనం...

గతంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈసారపు వాసుదేవరావు, పల్లా సింహాచలం , రాజానా రమణి, పిన్నింటి వరలక్ష్మీ , పల్లా శ్రీనివాస్ శాననసభ్యులుగా ఎన్నికయ్యారు. రాజానా రమణి మేయర్‌గా కూడా చేశారు. అక్కరమాని విజయనిర్మల వుడా చైర్ పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. 'సీట్ల కేటాయింపులో రాష్ట్రవ్యాప్తంగా యాదవులకు వైసీపీ బాగానే న్యాయం చేసింది. అయితే విశాఖలో ఒక్క సీటును కూడా యాదవులకు కేటాయించకపోవడం నిజంగా బాధాకరం' అన్నారు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బర్నికాన రామారావు. 'వైసీపీ.. ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా యాదవులకు కేటాయించలేదు. సామాజిక న్యాయం అంటూ చెప్పే జగన్ ఇది గుర్తుంచుకోవాలి. విశాఖలో యాదవులకు సీటు కేటాయించకపోవడం వైసీపీకి తీవ్ర నష్టం’ అని అన్నారు విశాఖ యాదవ్ సంఘం యువ నాయకులు ఉప్పిలి వంశీ.


యాదవులను గుర్తించిన ప్రతిపక్షాలు...

విశాఖలో అత్యధిక ఓటర్లు కలిగిన యాదవులను ప్రతిపక్షాలు గుర్తించాయి. జనసేన.. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటును యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్‌కు కేటాయించగా... తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం టిక్కెట్‌ను యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు కేటాయించింది. ఈ సామాజిక వర్గానికి వైసీపీ మాత్రం ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ పరిణామాల ప్రభావం పార్టీపై తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.




Read More
Next Story