ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వెళ్లకుండానే వైఎస్‌ఆర్‌సీపీ బహిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా చెప్పిన విధంగానే అసెంబ్లీ çసమావేశాలు బహిష్కరించారు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల వైఎస్‌ఆర్‌సీపీ ఏమి సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఒక పార్టీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యే అయినా.. ఆ పార్టీ విధానం ప్రజల శ్రేయస్సు కోసం ఆ పార్టీ ఏమి చెప్పాలనుకుంటున్నది అనేందుకు చట్ట సభలు ప్రధాన వేదికలు. ఆ వేదికను బహిష్కరించడం అనేది ఒక విధంగా ప్రజాస్వామ్యంలో మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అవమానాలకు గురి కావలసి వస్తుందని మాత్రమే సమావేశాలను బహిష్కరించారు తప్ప వేరొకటి కాదని వైఎస్‌ఆర్‌సీపీలోనూ చర్చ సాగుతోంది.
నిజానికి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అవమానాలు కొత్తని భావించేందుకు వీల్లేదు. పోలీసు కేసులు, జైలు జీవితం, టీడీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు జగన్‌కు సర్వసాధారణంగానే అనిపించాయి. అలాంటప్పుడు అసెంబ్లీలో అవమానాలు పడాల్సి వస్తుందేమోనని అనుకునేందుకు కూడా వీల్లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వరు. తాము చెప్పేవి వినరు. స్పీకర్ ఇష్టాను సారంగా వ్యవహరిస్తారు. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం వల్ల ఉపయోగం ఏమిటి? అంటూ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ వెల్లడించారు.