విలక్షణం..! మారిన సింహపురి సీన్
అధికార వైసిపికి నెల్లూరు జిల్లాలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జిల్లాకు చెందిన కీలక నేతలు ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు.
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
వడ్లకే కాదు..! సింహపురి జిల్లా రెడ్ల ఆధిత్యానికి ప్రతీక.!!. రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం. ఆ కోవలో నుంచే సిపిఎం, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్ర నేతలుగా ఎదిగి, చక్రం తిప్పిన జాబితాలోని వారికి కొదవలేదు. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సింహపురి రాజకీయం రసవత్తరంగా మారింది. కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలోని పదికి పది శాసనసభ స్థానాలను వైఎస్ఆర్సిపి దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారిపోతూ ఉండడం, కీలక నేతలు కూడా టిడిపిలోకి వలస వెళ్లడంతో.. రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పోతే పోనివ్వండి. ఇంకొకరిని పంపిస్తున్నాం. అన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు, ఇదే జిల్లాకు చెందిన వి విజయసారెడ్డిని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు.
ధనం, రాజకీయ బలం కలిగిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ మంత్రి పీ. అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరో నలుగురు కీలకమైన కార్పొరేటర్లు శనివారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువాలు వేసుకున్నారు. నెల్లూరులో జనసేన నాయకుడిగా హల్చల్ చేసిన విద్యార్థి నాయకుడు కేతన్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపిలో చేరినా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే నడిచారు. "ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టిడిపిలో చేరాను"నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ జిల్లా రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా అధికార -ప్రతిపక్షాలు ఉంటాయి. రంజయిన రాజకీయానికి విలక్షణ వ్యక్తులకు పుట్టినిల్లు అయిన ఈ జిల్లాలో ఆ రెండు పార్టీలకు ఇంటి పోరు చెవిలో జోరీగలా మారింది.
ఆ కోవలో...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీలో చేరికలకు ప్రధాన భూమిక పోషించారు అనేది సింహపురి రాజకీయ వర్గాల్లో వినిపించే మాట.
కడప తరువాత నెల్లూరులో...
వైఎస్సార్‌సీపీకి పురుడు పోసిన తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగారు. రెండోసారి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సొంత జిల్లా కడపలో వైఎస్ఆర్‌సీపీ నుంచి పదికి పది ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. అదే స్థాయిలో.. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్‌తో పాటు నాయకులు ఉన్నప్పటికీ.. పదికి పది సీట్లలో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు ఏకపక్షంగా నిలిచారు. నెలల కాలం వ్యవధిలోనే నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలంగా తయారవుతుందనే అంచనాలు తలకిందులయ్యాయి. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలి మంత్రివర్గం ఏర్పాటులో పురుడు పోసుకున్న అసంతృప్తి, రెండేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ మరింత ఆజ్యం పోసింది.
అనిల్‌తో రగిలిన మంట..
నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించి, తనదైన మార్కు రాజకీయాలను సాగించారు. మంత్రి పదవి దక్కని స్థితిలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, ఆనం నారాయణరెడ్డి శాసనసభలను ఆ తర్వాత నియోజకవర్గంలో కూడా పార్టీ పనితీరుపై వ్యతిరేక వ్యాఖ్యలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంటి కింద రాయిలా మారారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కిన తరువాత అసమ్మతి కాక ఆకాశానికి తాకింది. ఇది ఎంతవరకు దారితీసింది అంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ((ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) పార్టీ నుంచి వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిష్కరించారు.
తెలుగుదేశం శిబిరంలో..
తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఏమాత్రం తక్కువగా లేవు. వైయస్సార్సీపి నుంచి తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అదే స్థానం నుంచి టిడిపి సీటు దక్కింది. ఉదయగిరి నుంచి టికెట్ రేసులో ఉన్న వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఎటు కాకుండా పోయింది. ఆ సీటు ఎన్నారై కి టికెట్ కేటాయించడంతో రేసులో నిలిచిన టిడిపి సీనియర్ నాయకుడు బొల్లినేని రామారావు ఆగ్రహంగా ఉన్నారు. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి అభ్యర్థుల ఎంపిక ప్రతిష్టంబనగా మారింది.
రాజకీయ ఉద్దండలకు నెలవు
ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ జిల్లా కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉద్దండులైన రాజకీయ నాయకులను అందించింది. వారిలో మార్క్సిస్టు మేధావి,పుచ్చలపల్లి సుందరయ్య నుంచి ప్రారంభిస్తే .. ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతం కీలక రాజకీయాల్లో ఉన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉదయగిరి శాసనసభ నియోజకవర్గంలో నుంచి 1978, 1983 లో బిజెపి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
దేశానికి ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలందించారు. 1990- 1992 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గా సేవలు అందించారు. విశాఖపట్నం నుంచి కూడా ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన భార్య ఎన్. రాజ్యలక్ష్మి కూడా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా మంత్రిగా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సింహపురి సిగలో ప్రధానంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కుటుంబాలు నగరంతోపాటు.. నెల్లూరు జిల్లా రాజకీయాల్ని శాసించేవారు. ఇదే జిల్లాకు చెందిన పి మధు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.
Next Story