కోడ్ కూయకముందే కోళ్లు తెగాలా!
x
ఆర్‌కే రోజా

'కోడ్' కూయకముందే కోళ్లు తెగాలా!

' కోడ్ ' కూయకముందే... పందేరాల పంపిణీలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు తలమునకలుగా ఉన్నారు. ఓటర్ల ఆదరణ ఎలా ఉంటుందో పోలింగ్ వరకు ఆగాల్సిందే..!


ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్


తిరుపతి: ఎన్నికల కోడ్ రాలేదు. అది రాకముందే విందులు వినోదాల కోసం కోళ్ల మెడలు తెగుతున్నాయి. అసంతృప్తిలో తిరుగుబాటుదారుల స్వరాలు కోళ్ల ఆర్తనాదంలో కలిసిపోతున్నాయి. నాయకులు బహుమతులు, విందులతో ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పాట్లు పడుతున్నారు.

బిజీ.. బిజీ..

అసంతృప్తి సెగలు కక్కుతోంది. తిరుగుబాటు దారులు పక్కలో బల్లెంలా మారారు. అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. అయినా, చిత్తూరు జిల్లా నగిరి లో సిద్ధం సభల ద్వారా తాయిలాల పంపిణీ, విందులు ఏర్పాటులో మంత్రి ఆర్కే రోజా బిజీగా ఉన్నారు. చంద్రగిరిలో కూడా ఆ తరహా కార్యక్రమం ప్రారంభమైంది. తనపై మాత్రం ఎందుకు అంత కక్ష అని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల జాతర వచ్చిందహో..

ఎన్నికల జాతరొచ్చింది. ఎన్నెన్నో గుర్తులు వచ్చాయి. మా పందేరాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదిగోండి పంచ.. చీర.. తువ్వాలు (టవల్). అక్క, అన్న ఆగండి. పిలవగానే వచ్చారు. ఈ చికెన్ ముక్క కూడా కొరకండి. బిర్యానీ తినండి. అంతా హ్యాపీనే కదా. ఎన్నికల్లో మాకు ఓటెయ్యడానికి సిద్ధంగా ఉండండి. ఇది నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరు. ఎన్నికల కోడ్ వేస్తే.. తాయిలాల పంపిణీకి నిబంధనలు అడ్డు వస్తాయి. అందుకోసం ఎన్నికల కోడ్ రాకముందే... ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు వారికి ఏడదంతా పండగలే.. పండుగ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. కానీ.. అన్ని కులాలు, మతాల వారికి మాత్రం ఐదేళ్లకోసారి జాతర వస్తుంది. ఈ ఎన్నికల జాతరకు నాయకుల ఇళ్లకు వెళ్లి సంబురం చేసుకుంటారు. అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు సతమతమవుతుంటే.. సిద్ధం సభలతో నియోజకవర్గాల్లో నాయకులు.. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతటితో ఊరుకోవడం లేదు.
తెలుగు నాట ఓ సంప్రదాయం ఉంది "తిన్నింటి వాసాలు లెక్క పెట్టరు" అన్నం తిన్న వాళ్ళు విశ్వాసంతో ఉంటారు అనుకున్నారేమో..! వచ్చిన వారికి పంచ' చీర, టవల్ ఇచ్చి పంపుతున్నారు. ఇది ఐప్యాక్ టీం ప్లానింగ్ లో భాగమేనని వైఎస్సార్సీపీ వర్గాల నుంచి తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే..



విందు రాజకీయం..

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అసమ్మతి, తిరుగుబాటుదారులు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాను ఉక్కిరి, బిక్కిరి చేస్తున్నారు. ఈ విషయమై ఐదు మండలాల నుంచి అసంతృప్తితో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సిపి అధిష్టాన వర్గానికి కూడా ఫిర్యాదులు చేశారు. తన అనుకూల వర్గాన్ని దగ్గర ఉంచుకున్న మంత్రి ఆర్కే రోజా.. సిద్ధం సభల ద్వారా ప్రతి మండలంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారు. అందులో ప్రధానంగా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెం పంచాయతీలోని మామిడి తోటలో విందు ఏర్పాటు చేశారు.

ప్రతి పంచాయతీ నుంచి 150 మందికి తక్కువ కాకుండా పిలిపించి విందు ఇచ్చారు. అంతేకాకుండా పంచ, చొక్కా, టవళ్లు పంపిణీ చేశారు. అంతకుముందు నగరిలో మహిళా టీచర్లు, అంగన్వాడి వర్కర్లకు, మెప్మా సిబ్బందికి చీరలు స్వీట్లు అందించారు. విందు కూడా ఏర్పాటు చేసి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి దగ్గరుండి వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు.

జాబితాలో పేరు ఏది?

ఇప్పటివరకు నగరి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఆర్కే రోజా పేరును వైఎస్ఆర్సిపి ప్రకటించలేదు. మళ్లీ ఆమెకే టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని, ఆమె ఓటమికి మా బాధ్యత కాదని తిరుగుబాటు నాయకులు ఈపాటికె సూచన తో కూడిన అల్టిమేటం ఇచ్చారు. వీటన్నిటిని గడ్డిపోచలా పక్కకు పడేస్తున్న మంత్రి ఆర్కే రోజా విందు రాజకీయాలతో అడుగులు వేస్తున్నారు. ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంపై ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.



ప్రారంభోత్సవాల్లో బిజీ

జీడీ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ లేదని తేలిపోయింది. ఆమె కుమార్తె కృపారాణికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అయితే, పదవి ఉండగానే ఇంకొన్ని శిలాఫలకాలపై తన పేరు చూసుకోవాలని అనుకున్నారేమో.. నారాయణస్వామి నియోజకవర్గంలో పూర్తి చేసిన కొన్ని పాఠశాలలు, ఇతర భవనాల ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారు. చేయూత చెక్కుల పంపిణీ సమావేశం వచ్చిన మహిళలకు అధికారులు భోజనం ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట లో చాలామంది ఇబ్బంది పడ్డారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి మునస్వామి ( థామస్) ఏర్పాటుచేసిన విందులో గలాటా చోటుచేసుకుంది. ప్లేట్లు కూడా గాలిలోకి లేచాయి.

డైరీల పంపిణీ.. ఫ్యాన్లు సిద్ధం..!

చంద్రగిరి నియోజకవర్గంలో పంపకాల కార్యక్రమం ప్రారంభమైంది. రానున్న ఉగాది కోసం చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుతో డైరీలు ముద్రించారు. వాటితోపాటు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద్ అని కూడా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ చేయడానికి ఫ్యాన్లు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.



నాపై ఎందుకీ కక్ష

"ఎన్నికల నిబంధనలు లేవు. కోడ్ రాలేదు. అయినా నాపై ప్రభుత్వం ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షపూరితంగా" వ్యవహరిస్తున్నారని పుంగనూరుకు చెందిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహ వ్యక్తం చేశారు. గత నెలలో గోడ గడియారాలు తెప్పిస్తుంటే, మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అధికారపక్షంలోని వారికి ఒకరు రూల్.. నాకు మాత్రమే మరో నిబంధన ఉంటుందని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు. అధికారులు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైతేనేం.. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు పంచడానికి నాయకులు తాపత్రయపడుతున్నారు. ఓట్ల జాతరలో ఓటర్లు వీరిని ఎంత మాత్రం ఆదరిస్తారనేది వేచి చూడాలి.


Read More
Next Story