వైఎస్సార్సీపీ గిరిజనుల్లో పట్టు కోల్పోయింది. ఏడు ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఐదు స్థానాల్లో ఘోర పరాజయం పాలైంది. ఇందుకు కారణాలు ఏమిటి?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు వైఎస్సార్సీపీకి పట్టుగొమ్మ లాంటి వారు. వారు కూడా ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీని వదిలేశారు. ఎందుకు ఇలా జరిగింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కాంగ్రెస్ అంటే గిరిజనులు ఎంతో ఆప్యాయతను చూపారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే పడి చచ్చేవారు. అందుకే వైఎస్సార్సీపీని వారు ఓన్ చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ గిరిజనులు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు.

2024 ఎన్నికల్లో మాత్రం గిరిజనులు కూడా వైఎస్సార్సీపీని మట్టి కరిపించారు. ఏడు స్థానాల్లో కేవలం అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలువగలిగారు. మిగిలిన ఇద్దరు మాజీ మంత్రులు పోటీ చేసిన కురుపాం, సాలూరు నియోజకవర్గంతో పాటు రంపచోడవరంలోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక పాలకొండ, పోలవరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. అంటే ఎన్డీఏ కూటమి తిరుగులేని శక్తిగా గిరిజనుల్లో ఎదిగింది.

ఇందుకు బిజెపి ఒక కారణం కాగా, జనసేన పార్టీ రెండో కారణంగా చెప్పొచ్చు. బిజెపి వారు కొన్ని వేల మంది గిరిజనులను ఎన్నికల నోటిఫికేషన్ కు మూడు నెలల ముందు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిపించే ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైలు ద్వారా వారిని రాష్ట్రపతి భవన్ కు తీసుకెళ్లి అక్కడి వాతావరణం, రాజ్ భవన్ ఎలా ఉంటుంది. అందులో ఎంత మంది ఉద్యోగులు ఉంటారు. ఏమి చేస్తుంటారు. అనే విషయాలన్నీ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను ఆనుకుని ఉన్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముర్ము రాష్ట్రపతి కావడం వల్ల ఏపీ గిరిజనులు ఆమెను ఓన్ చేసుకున్నారు. ఢిల్లీ నగరంలోని ముఖ్య ప్రదేశాలు వారికి చూపించి బిజెపి గిరిజనుల మన్ననలు పొందగలిగింది. గిరిజనులను ఆకర్షించేందుకు చేసిన కార్యక్రమాల్లో ఇదొకటి.

జనసేన పార్టీకి వీరు స్వతహాగా అభిమానులుగా ఉన్నారు. సినిమాలపై వీరికి కాస్త మోజు ఎక్కువ. ఆ మోజుతోనే పవన్ కళ్యాణ్ పై అభిమానం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు ఒక్కో ఎస్టీ నియోజకవర్గం నుంచి సుమారు 20వేల ఓట్ల వరకు రాబట్ట గలిగారు. అంటే గిరిజనుల్లో పవన్ కళ్యాణ్ కు మంచిగానే చోటు దక్కిందని చెప్పొచ్చు. కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గిరిజనులు గెలిపించారు. మంత్రలుగా పనిచేసిన పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్న దొర వంటి వారు చాలా పర్యాయాలు శాసన సభ్యులుగా గెలిచారు. అయినా వారి గురించి ప్రజలు ఆలోచించలేదు. కేవలం పార్టీల గురించి మాత్రమే ఆలోచించారు. ప్రధానంగా ఏపీలోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనుల ప్రభావం ఎస్టీల్లో ఎక్కువగా ఉంది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే గిరిజన రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి.

Next Story