కృష్ణాలో వైఎస్సార్‌సీపీ ఎదురీదుతోంది. సర్వేల పేరుతో స్థానిక నేతలకు చెక్‌పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీ బాలశౌరి రాజీనామా పార్టీలో కలకలం రేపింది.


కృష్ణాలో వైఎస్సార్‌సీపీ ఎదురీదుతోంది. సర్వేల పేరుతో స్థానిక నేతలకు చెక్‌పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా పార్టీలో కలకలం రేపింది. ఏకంగా నియోజకవర్గాలకు సంబంధం లేని వ్యక్తులను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా రంగంలోకి దించుతోంది. అభ్యర్థి కుభేరుడా కాదా అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమవుతుందా? విఫలమవుతుందా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని పలువురు చెప్పడం విశేషం. పైగా కమ్మ సామాజికవర్గం పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తోందని, ఈ నేపథ్యంలో కృష్ణాలో వైఎస్సార్‌సీపీకి ఎదురీత తప్పేట్టు లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంచలనమైన బాలశౌరి రాజీనామా


మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు శనివారం రాజీనామాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పంపించారు. తాను త్వరలో జనసేనలో చేరుతున్నట్లు తన ట్విటర్‌ అకౌంట్‌లో తెలియజేశారు. బాలశౌరి దివంగత వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు. బాలశౌరి ఏదైనా చెప్పారంటే వైఎస్సార్‌ తప్పకుండా చేసేవారు. సాక్షి దిన పత్రిక ప్రారంభంలో బాలశౌరి చెప్పిన వారికి వైఎస్సార్‌ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అటువంటిది వైఎస్సార్‌సీపీలో చేరిన తరువాత బాలశౌరి కనుమరుగయ్యారు. ఆయన వాయిస్‌ అసలు వినిపించలేదు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌లు ఒక్కటై బాలశౌరికి చుక్కలు చూపించారు. ఇప్పటి వరకు ఓర్చుకుంటూ వచ్చిన ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. తాను జనసేనలో చేరుతున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ స్థానంలో బాలశౌరి గెలిచే అవకాశం లేదని, అందువల్ల టిక్కెట్‌ ఇచ్చే అవకాశం లేదని సీఎం జగన్‌ నుంచి సంకేతాలు అందుకున్న బాలశౌరి ముందుగానే పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో శౌరి ఉన్నారని సమాచారం.
టీడీపీలో చేరనున్న పార్థసారధి


ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి సీటును వైఎస్‌ జగన్‌ లాగేసుకున్నారు. పెడన ఎమ్మెల్యే, హౌసింగ్‌ మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో పార్థసారధికి చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటి వరకు బయట పడకపోయినా ప్రజలకు నాపై నమ్మకం ఉంది. మా నేతకే నమ్మకం లేదంటూ సాధికార యాత్రలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈనెల 18న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సోషల్‌ మీడియా, వివిధ వార్త పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఆయన ఖండించలేదు. దీనిని బట్టి పార్థసారధి టీడీపీలో చేరుతున్నారని కన్‌ఫాం అయింది.
హైదరాబాద్‌ నుంచి పాలన విజయవాడకు మారాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని పార్థసారధి తన సొంత స్థలంలో ఏర్పాటు చేశారు. చాలా కాలం అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు.
గన్నవరం టిక్కెట్‌ వంశీకి లేనట్లే..


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. గన్నవరంలో గెలిచే అవకాశాలు లేనందున సీటు ఇచ్చే అవకాశం లేదని వంశీకి జగన్‌ చెప్పినట్లు సమాచారం. వల్లభనేని వంశీపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఓటమి చెందారు. 2019లో వెంకట్రావుకు 1,03,043 ఓట్లు రాగా వంశీకి 1,03,881 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 838 ఓట్ల మెజారిటీతో మాత్రమే వంశీ గెలుపొందారు. ఆ తరువాత వంశీ వైఎస్సార్‌సీపీలో చేరారు. వెంకట్రావును కాదని వంశీకి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారు. దానిని జీర్ణించుకోలేని వెంకట్రావు టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వంశీ ఓటమి ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీకి టిక్కెట్‌ ఇవ్వడం సాధ్యం కాదని జగన్‌ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బొప్పన కూడా బాలశౌరి బాటలోనే..


విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్‌ బాలశౌరి బాటలోనే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే భవకుమార్‌ జనసేనలో కాకుండా టీడీపీలో చేరి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధితో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్‌టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి టిక్కెట్‌ లేదనే సంకేతాలు పార్టీ నుంచి అందాయి. ఆయన కూడా పార్థసారధి బాటలో ఉన్నారు.
మచిలీపట్నం టీడీపీ ఎంపీగా పార్థసారధి
తెలుగుదేశం పార్టీలో చేరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు కొలుసు పార్థసారధి సిద్ధమైనట్లు సమాచారం. టిడిపిలో చేరక ముందే వారి నుంచి కమిట్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించారు. మచిలీపట్నం ఎంపీగా సీటు ఇచ్చే అవకాశం లేకపోతే నూజివీడు ఎమ్మెల్యే టిక్కెట్‌ అయినా ఇవ్వాలని డీడీపీ అధినేతను సారధి కోరినట్లు సమాచారం. మచిలీపట్నం ఎంపీ స్థానానికి పార్థసారధిని నియమించే అవకాశం ఉందని డీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మచిలీపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) కచ్చితంగా ఓడిపోతాడని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అటు గన్నవరం, మచిలీపట్నం, పెనమలూరు తప్పకుండా టీడీపీ గెలుస్తుందనే ధీమాలో టీడీపీ వర్గాలు ఉన్నాయి. పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాముకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ కేటాయింది. ఈయన భార్య ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్, పామర్రు నుంచి కైలే అనిల్‌కుమార్, గుడివాడ నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని)లు రంగంలో ఉంటారనే టాక్‌ ఉంది. అయితే వీరికి కూడా ఇంతవరకు సీఎం జగన్‌ మీరే అభ్యర్థులుగా ఉంటారని తేల్చి చెప్పలేదు.


Next Story