కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ తిరుబాటును ప్రకటించింది. తొలుత రైతుల సమస్యల మీద గళం విప్పేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల సమస్యలపై రోడ్లెక్కడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం రైతు పోరుబాట పేరుతో నిరసనలు తెలిపేందుకు రెడీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించనున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20వేలు అందించాలి. ధాన్యానికి కనీస మద్ధతు ధర ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లల్లో దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. రంగు మారిన ధాన్యం కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు మేలు చేయాలి. రైతు భరోసా కేంద్రాలను తిరిగి అందుబాటులోకి తెచ్చి, గ్రామీ ప్రాంతాల్లోని రైతులకు తోడుగా నిలవాలి. వ్యవసాయ సలహా మండళ్లను పునరుద్ధరించి అన్నదాతలకు తోడుగా నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలి వంటి అనేక డిమాండ్ల పరిష్కారం కోరుతూ పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు నిరసనలు తెలపనున్నారు.