మోనార్క్  మార్క్ జాబితా
x
Source: Twitter

మోనార్క్ ' మార్క్' జాబితా

ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, రాజకీయ బదిలీలు. జిల్లాలో నేతల మార్కు సూచన వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల ఎంపికలో కనిపిస్తోంది..



(ఎస్. ఎస్. వి. భాస్కర్ రావ్ )




తిరుపతి : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జిల్లా నాయకుల సూచనలకే ప్రాధాన్యం ఇచ్చారా? పార్టీ శ్రేణుల ఆక్షేపణ పట్టించుకోలేదా? ఫిర్యాదులను పెడచెవిన పెట్టారా? అంటే అవుననే చెప్పాలి. ఈరోజు సీఎం జగన్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ‘నేను మోనార్క్‌ని ..!’ అనే మాట సీఎం జగన్ తన అభ్యర్థుల జాబితో చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. ఎస్సీ రిజర్వుడు సీట్లలో అభ్యర్థులను మార్చడం, కొన్ని స్థానాల్లో అభ్యర్థులను బదిలీ చేయడం మినహా, సిట్టింగులకే అవకాశం కల్పించారు. గ్రేటర్ రాయలసీమ, నెల్లూరులో రాజకీయ బదిలీలు చేసిన ఆయన, ఎస్సీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మిగతా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. 2024 ఎన్నికలకు శాసనసభ, పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను కడప జిల్లా ఇడుపులపాయ వేదికగా ప్రకటించారు. ఇడుపులపాయలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుష్పాంజలి ఘటించిన అనంతరం సీఎం జగన్ విడుదల చేశారు.


కుడి -ఎడమ భుజాలు


బీసీలు, దళితులు తనకు కుడి ఎడమ భుజాల లాంటివారన్న సందేశాన్ని ఇచ్చినట్లు కనిపించింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడివైపు కూర్చున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడమ వైపు కూర్చున్న దళిత నాయకుడు, బాపట్ల సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ ఈ జాబితాను చదివి వినిపించారు. గత ఎన్నికల సందర్భంగా కూడా వీరిద్దరి చేతే జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రకటింపజేశారు. వేదికపై డెప్యూటీ సీఎం, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, దళిత సామాజిక వర్గానికి చెందిన మరో డిప్యూటీ సీఎం కళతూరు నారాయణస్వామి, వీరి వెనక రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులతోపాటు ఆ సామాజిక వర్గ నేతలే ఎక్కువగా కనిపించారు.


ఓడితే బాధ్యత కాదన్నా.. డోంట్ కేర్..!


రాయలసీమ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులపై చేసిన నిరసన, తిరుగుబాటును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.


అందుకు ఇదే సాక్ష్యం..

చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజాపై ఐదు మండలాల నాయకులు తిరుగుబాటు చేశారు. సీఎం కార్యాలయంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా నివేదించారు. " ఆర్కే రోజాకు మినహా నగరి నియోజకవర్గంలో స్థానికులకు టికెట్ ఇవ్వండి" అనేకాకుండా.. ‘‘ఆర్కే రోజాకు మళ్ళీ టికెట్ ఇస్తే, ఆమె ఓటమికి మేము బాధ్యులం కాదు " అని కూడా హెచ్చరించారు. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆర్కే రోజా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.


నెల్లూరులో మార్పులు..


వెంకటగిరి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణపై సస్పెండ్ చేశారు. తిరుగుబాటు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. టిడిపిలోకి వెళ్లి టికెట్ దక్కించుకున్నారు. ఆయన స్థానంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని గతంలోనే ఇన్చార్జిగా నియమించారు. ఈయనను తాము భరించలేమని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు గగ్గోలు పెట్టాయి. వీటన్నిటినీ ఏ మాత్రం పట్టించుకోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు.


రాజకీయ బదిలీలు-అభ్యర్థుల మార్పులు


నెల్లూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను.. నరసరావుపేటకు బదిలీ చేసి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో నెల్లూరు నగర ఎండి ఖలీల్ అహ్మద్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు చేసి టీడీపీకి వెళ్లడం ద్వారా టికెట్ దక్కించుకున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బదిలీ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం అభ్యర్థిగా వైఎస్ఆర్‌సీపీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని పోటీ చేయిస్తున్నారు. గూడూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు టికెట్ ఇవ్వడానికి సీఎం జగన్ నిరాకరించారు. దీంతో ఆయన స్థానంలో మేరిగ మురళిని తెరపైకి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు చేశారు. ఆయన స్థానంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించారు.


రిజర్వ్ సీట్లపై పెద్ద మార్క్


చిత్తూరు జిల్లాలో అభ్యర్థులను మార్చారు. సర్వే పేరుతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో సీనియర్ నాయకురాలు గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు నూక తోటి రాజేష్‌ను తెరపైకి తీసుకురావడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు అనేది సమాచారం. 2004 ఎన్నికల సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ పెద్దలు గుమ్మడి కుతూహలమ్మకు టికెట్ నిరాకరించారు. ఆ సమయంలో కూడా ఆమెకు పెద్దిరెడ్డి అండదండలు అందించారనేది అప్పట్లో వినిపించిన మాట. సర్వే పేరిటే నిరాదరణకు గురైన పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తప్పించారు. మళ్లీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి సునీల్ కుమార్‌ను అభ్యర్థిగా తీసుకువచ్చారు.

మదనపల్లిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను తప్పించారు. ఆ స్థానంలో కొత్తగా నిసార్ అహ్మద్ అనే వ్యక్తిని తెరపై నిలిపారు. ఇదే తరహాలో పెద్దిరెడ్డి వల నిరాదరణకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు షేక్ షాజహాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కళతూరు నారాయణస్వామికి టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమార్తె కలతూరు కృపా లక్ష్మికి అవకాశం కల్పించారు.


అనంత జిల్లాలో..


అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో కూడా అభ్యర్థులను మార్పు చేశారు. యథావిధిగానే సర్వే నివేదికల పేరుతో సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని తప్పించారు. ఆమె స్థానంలో ఎం వీరాంజనేయులు అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. మడకశిర రిజర్వ్ నియోజకవర్గంలో సుధాకర్ రావును తప్పించారు. ఆయన స్థానంలో ఈర లక్కప్పకు అవకాశం కల్పించారు.


రాజకీయ బదిలీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్‌ను పెనుగొండకు మార్చారు. అనంతపురం ఎంపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు.


కొండారెడ్డి బురుజుఫై ఆన..


కర్నూలు నగర సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి, బుట్టా రేణుక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక ఆ తర్వాత తిరుగుబాటు చేసి టీడీపీలోకి వెళ్లారు. కొంతకాలం తర్వాత ఆమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో బుట్టా రేణుకకు టికెట్ ఖరారు చేశారు. ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు బూసినే విరుపాక్షికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అందుకు ససేమిరా అన్న ఆయన టీడీపీలోకి వెళ్లారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయనకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది ఎదురు చూడాలి.


రాయలసీమ నెల్లూరు జిల్లాలోని అభ్యర్థులు..


నెల్లూరు

కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

ఆత్మకూర్ - మేకపాటి విక్రమ్ రెడ్డి

కోవూరు - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ అహ్మద్

నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

సర్వేపల్లి - కాకాణి గోవర్ధన్ రెడ్డి

గూడూరు - మేరిగ మురళి

సూళ్లూరుపేట - కిలివేటి సంజీవయ్య

వెంకటగిరి - నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

ఉదయగిరి - మేకపాటి రాజగోపాల్ రెడ్డి



కడప

బద్వేల్ - డాక్టర్ దాసరి సుధ

రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

కడప - ఎస్.బి అంజద్ బాషా

రైల్వే కోడూరు - కొరముట్ల శ్రీనివాసులు

రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి

పులివెందుల - వైయస్ జగన్ మోహన్ రెడ్డి

కమలాపురం - పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

జమ్మలమడుగు -మూలే సుధీర్ రెడ్డి

ప్రొద్దుటూరు - రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

మైదుకూరు - రఘురామిరెడ్డి సెట్టిపల్లి



కర్నూల్..

ఆళ్లగడ్డ - గంగుల బ్రిజేంద్ర రెడ్డి

శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి

నందికొట్కూరు - డా. సుధీర్ దారా

కర్నూలు - ఎం డి ఇంతియాజ్

పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి

నంద్యాల - శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

బనగానపల్లె - కాటసాని రామి రెడ్డి

డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్

పత్తికొండ - కంగాటి శ్రీదేవి

కోడుమూరు - డా. సతీష్

ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

మంత్రాలయం - వై బాలనాగి రెడ్డి

ఆదోని - వై.సాయి ప్రసాద్ రెడ్డి

ఆలూరు - బూసినే విరుపాక్షి


అనంతపురం

రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి

ఉరవకొండ - వై విశ్వేశ్వర రెడ్డి

గుంతకల్లు - వై.వెంకటరామ రెడ్డి

తాడిపత్రి - కె. పెద్దా రెడ్డి

శింగనమల - ఎం వీరాంజనేయులు అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామి రెడ్డి

కళ్యాణదుర్గం - తలారి రంగయ్య

రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

మడకశిర - ఈర లక్కప్ప

హిందూపురం - టి.ఎన్ దీపిక

పెనుకొండ - కె. వి. ఉషశ్రీ చరణ్

పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి

కదిరి - మక్బుల్ అహ్మద్


చిత్తూరు జిల్లా..

తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి

పీలేరు - చింతల రామచంద్రా రెడ్డి

మదనపల్లె - నిస్సార్ అహ్మద్

పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి

శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి

సత్యవేడు - నూకతోటి రాజేష్

నగరి - ఆర్.కె రోజా

గంగాధర నెల్లూరు - కృపా లక్ష్మి

చిత్తూరు - ఎం విజయానంద రెడ్డి

పూతలపట్టు - డా. సునీల్ కుమార్

పలమనేరు - ఎన్. వెంకటే గౌడ

కుప్పం - కే ఆర్ జే భరత్



Read More
Next Story