కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విశాఖలో మాట్లాడుతూ.. ఫ్రీ హోల్డ్ భూములపై ఆరోపణలు రుజువు చేయాలన్నారు. అవినీతి జరిగిందంటూ మమ్మల్ని నిందిచడం సరి కాదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలన్నారు.
అన్ని రంగాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు. రుషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలేనని ఆరోజే చెప్పామన్నారు.
విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి ఆక్షేపించారు. వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ వైఎస్‌ఆర్‌సీపీని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు.
ఫ్రీహోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. అప్పులు తేవడం, హామీల అమలు చేయకపోవడంతో పాటు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. నిత్యవసర ధరలు పెరిగిపోతున్నాయి. రకరకాల పన్నులు, విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇంకా ఎండాకాలం రాకపోయినా పవర్ కట్‌లు మొదలయయ్యాయి. తమ ప్రభుత్వ హయాంలో అవినీతి, భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు చేశారు. రకరకాల కమిటీలు, విచారణలు చేయిస్తున్నారు. ఏ ఒక్కటీ తేల్చలేకపోయారు. మళ్లీ రిపోర్టులు తెప్పిస్తామంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందా? అనే అనుమానం కలుగుతోందని ధ్వజమెత్తారు.
విద్యా రంగం మీద చేయని విషప్రచారం లేదు. ఇంగ్లిష్ మీడియం ఎత్తేయడానికి ప్రభుత్వ బడుల్లో పిల్లలు తగ్గిపోయారని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. సెంట్రల్ సిలబస్‌కి మంగళం పాడేశారు. నాడు–నేడు పనులు ఎక్కడా సాగడం లేదు. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, గోరు ముద్ద, అమ్మ ఒడి పథకం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు.
నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఇంగ్లిష్ భాష మీద పట్టున్న వారికే ఉన్నతోద్యోగాలు దక్కుతున్నాయని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకం ప్రకారం ప్రభుత్వ బడుల నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని తొలగించేశారు. పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ చూసినా డయేరియా కేసులతో పిల్లలు అల్లాడిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో 7వేల నుంచి 10వేల ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. అధికారులకు, మంత్రులకు సమన్వయం లేదని సీఎం మాటలతో అర్థమవుతుంది. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇంకా పాలన గాడిలో పెట్టలేకపోయారని మండిపడ్డారు. రోజూ పేపర్ చూస్తే అప్పుల తేవడం గురించి వార్తలే కనిపిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్భాటాలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తున్నారు. రుషికొండలో కట్టిన భవనాలేనని ఆరోజు చెప్పాం. ఈరోజూ కూడా చెబుతున్నామన్నారు.
పాలన చేతకాక, హామీలు అమలు చేయలేక.. డైవర్షన్ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను అరెస్టులు చేయడం తప్ప సాధించింది శూన్యం. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీస్ వ్యవస్థను కోర్టులతో చీవాట్లు పెట్టిస్తున్నారు. ప్రజలను ఇకనైనా మభ్య పెట్టడం ఆపాలి. ఇచ్చిన హామీలను ఎప్పటిలోపు నెరవేరుస్తారో చెప్పాలి. ఫ్రీహోల్డ్ భూముల్లో కుంభకోణాలు జరిగాయని నోటికొచ్చినట్టు ఆరోపణలు చేశారు. వాటిని ఎప్పటిలోపు రుజువు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు, అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కరణం ధర్మశ్రీ, మాజీ శాసనసభ్యులు అదిప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story