కర్నూలులో వైసీపీకి షాక్..
x
ఆర్థర్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్న షర్మిల

కర్నూలులో వైసీపీకి షాక్..

కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆయనను స్వాగతించారు.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్,)

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్‌ఆర్‌సీపీకి కర్నూలు జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. కర్నూల్ జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌.. వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కర్నూలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ సింగరి సంజీవ్ కుమార్ ఇటీవల టీడీపీలో చేరారు. సర్వేలో పనితీరు బాగాలేదనే నెపంతో ఆయనకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్ధర్‌ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

"ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, నమ్మకం, కొత్త రెక్కలతో, మరింత శక్తితో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకుంటోంది. ఈ నిజాన్ని పార్టీలోకి పెరుగుతున్న చేరికలు నిరూపిస్తున్నాయి" అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్వీట్ చేశారు. "నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు ఆనందిస్తున్నాను. ఆయన అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన, కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయి" అని వైఎస్ షర్మిల స్పందించారు.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తొగురు ఆర్థర్‌ 1982లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2009 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేశారు. తర్వాత డీజీపీ పేషీలో డీఎస్పీగా పని చేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. తొగురు ఆర్థర్‌.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2014లో నందికొట్కూరు నియోజకవర్గం టికెట్ ఆశించినా దక్కలేదు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన 2019లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండి జయరాజుపై 40,610 ​ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

"సర్వేలో పనితీరు బాగా లేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు" అని ఆర్థర్ అన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. నందికొట్కూరు టికెట్‌ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాటలు విని తాను షాకయ్యానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారులు లేకుండా చేశారని ఆర్థర్ చెప్పుకొచ్చారు. వైసీపీలో ఇమడలేకనే బయటకు వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. "అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది. అందుకే వేరే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే చేరా" అని ఆర్థర్ చెప్పారు.

Read More
Next Story