
కొచ్చిలో యాంటీ SIR ర్యాలీ.. మోదీ ప్రభుత్వానికి అభిజీత్ దీప్కే సవాల్
కార్యక్రమానికి కాంగ్రెస్ దూరం!
జైలు గోడలు తన పోరాటాన్ని ఆపలేవని, ఎన్ని సార్లు అరెస్టు చేసినా మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి నిరసన కొనసాగిస్తానని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి బహిరంగ నిరసనలో పాల్గొన్న ఆయన.. కొచ్చిలో జరిగిన యాంటీ SIR ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘నన్నుఅరెస్ట్ చేసి జైలులో పెట్టండి..మీరు ఎన్నిసార్లు అలా చేసినా నేు నిరసన తెలిపేందుకు తిరిగి వస్తాను’’ అని శనివారం ఆయన అన్నారు.
మరోవైపు ప్రతిపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
నవంబర్ 7న కొచ్చిలోని రాజేంద్ర మైదాన్‌లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. 'జంతర్ మంతర్ @ కొచ్చి' పేరుతో పలు పౌర సమాజ సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనను మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపినా వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని సార్లు జైలుకు పంపినా తిరిగి వచ్చి నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని దీప్కే ఆరోపించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.
విదేశీ నిధులు..
తమ పార్టీ విదేశీ నిధులు పొందుతోందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. విదేశీ నిధుల విషయంలో తమ పార్టీని ప్రశ్నిస్తున్న బీజేపీ.. దేశ ప్రయోజనాలను విదేశీ ఒత్తిళ్లకు తాకట్టు పెడుతున్న ప్రభుత్వ తీరుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూలను ప్రస్తావించారు. గాంధీ భారతదేశానికి ఆత్మ అని, అంబేడ్కర్ వెన్నెముక అని, నెహ్రూ దేశ ఆలోచనా విధానానికి ప్రతిరూపమని అభివర్ణించారు.
ప్రధాని మోదీ ఎంతకాలం అధికారంలో ఉన్నా నెహ్రూ స్థాయికి చేరుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో మోదీ అధికారాన్ని కోల్పోతారని కూడా జోస్యం చెప్పారు.‘‘ఈ నిరసన పట్ల ప్రభుత్వ స్పందన, ఈ 56 అంగుళాల ఛాతీగల నాయకుడు ఎంత పిరికివాడూ చూపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం కంటే అప్పటి పాలన మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదని దీప్కే అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ దూరందూరం..
ఇదిలా ఉంటే.. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు కావడం ప్రత్యేకంగా కనిపించింది. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది నిర్వాహకుల లక్ష్యం. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు నిర్వహణ కమిటీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉంది. దీంతో ప్రతిపక్షాల ఐక్యత లక్ష్యానికి, కొచ్చిలో కనిపించిన వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసం స్పష్టమైంది.
మరోవైపు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ర్యాలీలో పాల్గొనడంతో పాటు సభలో ప్రసంగిస్తూ ఆజాదీ నినాదాలు చేశారు. అయితే అంతకుముందు కేరళలోని కాలడిలో ఉన్న శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సస్పెన్షన్ వివాదంపై యూడీఎఫ్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.
విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరితో పోల్చారు. ఈ విమర్శలు కాంగ్రెస్ నాయకత్వానికి అసంతృప్తి కలిగించినట్లు కథనం పేర్కొంది. అయితే కాంగ్రెస్ నేతలు ర్యాలీకి దూరంగా ఉండటానికి ఇదే కారణమని చెప్పలేదు.
ఈ సభలో ఎస్ఎఫ్ఐకి చెందిన శిల్పా ఎస్, ఏఐఎస్ఏకు చెందిన డానిష్ అలీ, ఏఐఎస్ఎఫ్కు చెందిన విరాజ్ దేవాంగ్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు అహ్మద్ సాజు పాల్గొన్నారు. సీపీఎం నాయకుడు, మాజీ మంత్రి పి. రాజీవ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షురాలు చింతా జెరోమ్‌తో పాటు సాంస్కృతిక రంగానికి చెందిన ఎన్.ఎస్. మాధవన్, సునీల్ పి. ఎళయిడం, రంజిని హరిదాస్ కూడా హాజరయ్యారు.
వామపక్షాల ఆధిపత్యం..
ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న పలు సంఘాల ప్రతినిధులు కూడా కొచ్చి సభకు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, స్వతంత్ర కార్యకర్తలే కనిపించారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఈ ర్యాలీలో ప్రధానంగా డిమాండ్ చేశారు.
మొత్తానికి, అన్ని బీజేపీయేతర శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నంతో కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమం.. కాంగ్రెస్ గైర్హాజరు, వామపక్ష సంఘాల ఆధిపత్యంతో మరో రాజకీయ చర్చకు తెరతీసింది. SIR, ఎన్నికల సంఘం అంశాలపై వివిధ రాజకీయ, పౌరసమాజ సంఘాల మధ్య ఐక్యత ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Next Story
