తమిళనాడు మంత్రి ‘ బాలాజీ’ రూటే వేరు, దానికి ఆయన ఫోన్లే సాక్ష్యం
రెండు మూడు సెల్ ఫోన్లుండటం గొప్ప కాదు, ఆ ఫోన్లలో లక్షమంది ఒటర్ల నంబర్లుండటం గొప్ప? అందుకే ఏ పార్టీలో ఉన్నా సెంథిల్ బాలాజీ ఓటర్ల మనిషి, వివరాలు
వారిని గుర్తు పెట్టుకుని కనీసం నెలలో ఒక్కసారైన ఫోన్ చేసి మాట్లాడారా? కానీ తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఇవన్నీ చేస్తాడు. అందుకే మిగిలిన రాజకీయ నాయకుల నుంచి ఆయనను వేరు చేశాయని చెప్పవచ్చు. ఆయన దగ్గర ఉన్న రెండు ఫోన్లలో ఒకటి తన సొంత నియోజకవర్గమైన కరూర్ కు కేటాయించారు. మరొకటి కోయంబత్తూర్ కార్యకలాపాల కోసం కేటాయించాడు.
మానవ సంబంధాలు
"నేను ఓసారి ఒక సమావేశానికి హాజరైయ్యాను. అదే సమావేశానికి సెంథిల్ కూడా వచ్చారు. అదే క్షణంలో నాకు వెంటనే ఆయన కాల్ చేశారు, అంతకుముందు ఒకసారి మేము కలుసుకున్న సంగతి చెప్పి, తరువాత ఎందుకు కలవలేదని ఆరా తీశారు. అక్కడ చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నప్పటికీ ఆయన నన్ను గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది " అని ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే ఓ కార్యకర్త ఫెడరల్ తో అన్నారు. సెంథిల్ కింది స్థాయి కార్యకర్తలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు. ఇటువంటి సంబంధాలే ఆయనను బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. పార్టీ క్యాడర్ ఆయన ఏం చెబితే అదే వేదంలా మారేలా చేసింది బహూశా ఈ ప్రవర్తనే కారణంగా చెప్పవచ్చు.
ఎవరీ సెంథిల్ బాలాజీ
కరూర్ సమీపంలోని రామేశ్వరంపట్టీ స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో 1975 లో జన్మించారు. కళాశాల చదువు అర్థాంతరంగా ఆపేసి రాజకీయాల్లో చేరారు. అలా మొదట 1990 వ దశకంలో మొదట డీఎంకే లో చేరారు. తరువాత డీఎంకే నుంచి విడివడిన ఎండీఎంకేలో చేరారు. ఆ తరువాత అన్నా డీఎంలో చేరి రాజకీయంగా ఎదగడం ప్రారంభించారు.
అమ్మ అనుగ్రహం..
అన్నాడీఎంకే 2006 ఎన్నికల్లో కరూర్ నియోజకవర్గం నుంచి ఆయనను పోటీకి నిలబెట్టింది. అప్పట్లో ఆయన శక్తివంతమైన డీఎంకే అభ్యర్థి వాసుకీ మురుగేషన్ ను ఓడించి సంచలనం సృష్టించారు. 2011 లో మరోసారి గెలిచి జయలలిత క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా బెర్త్ దక్కించుకున్నారు. తరువాత ఆర్టీసీ బస్సులపై అన్నాడీఎంకే గుర్తు అయినా రెండు ఆకులను వేయించాడు.
దీనిపై కరుణానిధి అసెంబ్లీలో ప్రశ్నించగా.. సెంథిల్ సమాధానమిస్తూ.. ఇదీ తమిళ సాంప్రదాయమైన తులసీ, తమలపాకులు వంటి సంప్రదాయ ఆకులను ప్రజలకు గుర్తు చేస్తున్నామని సమాధానమిచ్చారు. ఇదీ తమ పార్టీ గుర్తు కాదని ఎదురుదాడి చేశారు. దీంతో ప్రతిపక్షం అవాక్కయింది. అమ్మ( జయలలిత) మనసులో చోటు దక్కడానికి కారణం అయింది.
తరువాత బస్సుల్లో " అమ్మా కుడినీర్" ( అమ్మ నీరు) ప్రవేశపెట్టి జయలలితను మరింతగా ఆకట్టుకున్నాడు. తరువాత సెంథిల్ ను జయలలిత తన కొడుకు లాంటివాడని ప్రకటించింది. తదనంతరం పొయోస్ గార్డెన్(జయలలిత నివాసం)తో ఆయన సంబంధాలు బలపడ్డాయి.
అమ్మ ఆగ్రహం
జూలైలో 2015లో ముఖ్యమంత్రి జయలలిత జైలు నుంచి విడుదలై వచ్చాక సెంథిల్ అదృష్టం తల్లకిందులైంది. మొదట మంత్రివర్గం నుంచి తప్పించింది. తరవాత కరూర్ జిల్లా కార్యదర్శి నుంచి తొలగించింది. మంత్రులందరిని కూడా వారి స్థానాలపై స్థిరంగా ఉండకుండా చర్యలు తీసుకుంది. అయితే ఈసందర్భంలో కూడా శశికళ, ఇళవరసితో సెంథిల్ సత్సంబంధాలు నెరిపాడు. ఆర్టీసీ లో సెంథిల్ చేసిన అవినీతి నివేదికలు అమ్మ కంటపడగానే మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఊహగానాలు ఉన్నాయి.
పార్టీలు.. శిబిరాలు
జయలలిత మరణం తరువాత సెంథిల్ టీటీవీ దినకరన్ పక్షాన నిలిచాడు. దాంతో అతడిపై అనర్హత వేటు పడింది. తరువాత అతను డీఎంకేలో చేరాడు. ముఖ్యంగా కొంగునాడు బెల్ట్ లో ఆయనకున్న పట్టు, సొంత సామాజిక వర్గం గౌండర్ పట్టు కూడా బాగా కలిసివచ్చింది. ఈ పరిణామాలు డీఎంకేకు బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఇవన్నీ కాకుండా అతడి కష్టపడే తత్వమే ఎక్కువ గా రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడిందని కేసీ పళని స్వామి చెబుతున్న మాట. " సెంథిల్ ప్రతిరోజు ఫీల్డ్ లోకి వెళ్తాడు. ప్రతి కార్యకర్తతోను నేరుగా మాట్లాడతాడు. ఇదే అతని బలం" అని అభిప్రాయపడ్డారు.
డీఎంకే లో తన ముద్ర
డీఎంకే తరఫున 2019 లో జరిగిన అరవకురుచి ఉప ఎన్నికల్లో గెలుపొందాడు. 2021 లో తిరిగి కరూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కొన్ని రోజులకు పార్టీ తరఫున పట్టణస్థానిక సంస్థలకు కొయంబత్తూర్ ఇంచార్జ్ గా పని చేసి 100 వార్డులకు గాను 97 స్థానాలను గెలిపించి చూపించాడు. ఇదీ డీఎంకే పార్టీలోనే అతి పెద్ద విజయం. దీంతో బీజేపీలో కలవరం మొదలైంది. ఇదీ బీజేపీకి ఆశ ఉన్న దక్షిణాది నగరాలలో ఒకటి. ఆ తరువాత నే సెంథిల్ బాలాజీ వెంట కేంద్ర దర్యాప్తు సంస్థలు పడ్డాయని ప్రముఖ జర్నలిస్ట్ , రాజకీయ వ్యాఖ్యాత ప్రియన్ చెబుతున్న మాట.
సెంథిల్ బాలాజీ చిన్న వయస్సులో మంత్రి పదవి పొందాడు. అనేక విధాలుగా కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి ఎదిగాడు. కానీ ఒక్కసారి కూడా తన మంత్రి పదవిని పూర్తి కాలం పాటు కొనసాగించలేకపోయాడు. అయితే అతను త్వరగానే వీటన్నింటి నుంచి బయటపడతాడని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.
కష్టాలు ఎదురైనప్పుడే సెంథిల్ మరింత పట్టుదలగా ఉంటాడని అతని మాజీ సహచరులు చెబుతున్న మాట. అది డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ ఏదయిన కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే నిద్ర పోయి.. కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఎదిగిన నాయకుడు అతనితో సన్నిహితంగా మెలిగిన వారి మాట. ఈడీ అతడిని అరెస్ట్ చేసి జైలులో వేసిన ఎనిమిది నెలలకు ఫిబ్రవరిలో తన మంత్రి పదవికి సెంథిల్ రాజీనామా చేశాడు. కానీ తగిన సమయం కోసం ఆయన చాలా ఓపికగా ఎదురు చూస్తునే ఉంటాడని వినిపిస్తున్నమాట.