50 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమం.. ఓ సమీక్ష..
x
ప్రారంభోపన్యాసం చేస్తున్న హర్ష మందిర్

50 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమం.. ఓ సమీక్ష..

ప్రశ్నే పౌరహక్కుల ఉద్యమానికి పునాది. ఆధిపత్య భావజాలం అందర్నీ కమ్మేసి కుమ్మేస్తున్న కాలంలో పౌర హక్కుల సంఘం ఏమి చేయాలి? ఈ 50 ఏళ్లలో పౌరహక్కుల సంఘం ఏమి చేసిందీ?


ఓ సందిగ్ధ సమయంలో పాలకుల నుంచి పాలితులకు ముప్పు ఏర్పడినపుడు ఎవరో ఒకరు ఎక్కడో చోట గళం విప్పుతారు. చేయి చేయీ కలుపుతారు. ప్రజల ఆకాంక్షలను, అవసరాలను హక్కుల రూపంలోకి మారుస్తారు. చరిత్ర సృష్టిస్తారు. సమాజంతో పాటే ఎదుగుతారు. అదిగో అలా పుట్టి పెరిగిందే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం- ఏపీసీఎల్సీ.

1970ల నాటి మాట. ఆనాటి ఆంధ్రప్రదేశ్ కి జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. ఎటు చూసిన తీవ్ర నిర్బంధం. ఓ పక్క శ్రీకాకుళం రైతాంగ పోరాటం.. మరోపక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్ల ఆందోళన.. విప్లవ రాజకీయ అభిమానులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఓ పక్క.. యావత్తు రాజ్య వ్యవస్థ మరోపక్క.. సరిగ్గా అటువంటి దశలో 1973 డిసెంబర్ 23న గుంటూరులో ఆవిర్భవించింది ఏపీసీఎల్సీ. ఇప్పుడు అంటే 2024 మార్చి 9,10 తేదీలలో 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పుడుతూనే అత్యవసర పరిస్థితి నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఏపీసీఎల్సీ ఈ 50 ఏళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.

ఇలా మొదలైంది 50 ఏళ్ల వసంతోత్సవం...

ఇందుకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికైంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పౌరహక్కుల అభిమానులు, క్రియాశీల కార్యకర్తలు, ఏపీసీఎల్సీతో అనుబంధం ఉన్న ముఖ్యులు సుమారు ఆరేడు వందల వందల మంది హాజరయ్యారు. మహామహులెందరో హాజరైన ఈ సమావేశాలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సామాజికవేత్త హర్షమందిర్, పౌరహక్కుల సంఘం సీనియర్ నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ కాత్యాయినీ విద్మహే, లక్ష్మణ్, చిలకా చంద్రశేఖర్, రాజారావు లాంటి వాళ్లు ప్రారంభించారు.

ప్రశ్నిస్తూనే ఉండండి...

ఎంతో క్రమశిక్షణ, మరెంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వార్షికోత్సవ సమావేశాల్లో వక్తలు చేసిన ప్రసంగాలు ఆలోచింపజేసేవిగా సాగాయి. ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావించాయి. హక్కులకు రాబోతున్న ముప్పును జనం ముందుంచాయి. ఈ దేశ ప్రజల బాధ్యతను గుర్తుచేశాయి. పౌరహక్కుల సంఘం అంటే కేవలం సంఘమే కాదని, అందులో పౌరులు, హక్కులు, సంఘం అనే మూడు కీలకాంశాలు మిళితమై ఉన్నాయని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ వివరించినప్పుడు సభికులు ఆలోచనలో పడ్డారు. రాజ్యాంగంలోని లేని హక్కుల్ని ప్రభుత్వాలు సంక్రమించుకుని భూముల్ని అమ్ముకునే తీరును ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలని, రాజకీయ పార్టీలవి ఓటు రాజకీయాలైతే ప్రజలకున్న బాధ్యత ప్రశ్నించడమని విజ్ఞప్తి చేశారు.

ఆ రాముడు ఈ రాముళ్లు ఒకటి కాదు...

హక్కుల పరిధిని మరింత విస్తృతం చేస్తూ జస్టిస్ సుదర్శనరెడ్డి చేసిన ప్రసంగం యావత్తు సభికుల్ని ఆకట్టుకుంది. ప్రభుత్వాలు ప్రజలకు ధర్మకర్తలే గాని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదని తేల్చిచెప్పారు. హక్కుల ఉద్యమం ఈ దేశానికి కొత్త కాదని 1936లో ప్రారంభమైన పౌరహక్కుల ఉద్యమం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అవసరం ఉందా లేదా అనే దానిపై రాజ్యాంగ పరిషత్ లో చర్చ సాగిందని, రాజ్యాంగమే వస్తున్నప్పుడు ఇక పౌరహక్కుల సంఘాల అవసరం లేదని ఆనాటి కాంగ్రెస్ నేతలు జవహర్ లాల్ నెహ్రూ మొదలు ఎంతో మంది వాదించినా కమ్యూనిస్టులు, సోషలిస్టులు మాత్రం ఉండాల్సిందనేనని పట్టుబట్టిన తీరును, ప్రాధమిక హక్కులకు సంబంధించి కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఒకప్పుడు రాజ్యం (ది స్టేట్) ప్రజలకు పూచిగా ఇప్పుడు మార్కెట్లే రాజ్యాలుగా మారాయని చమత్కరించారు. త్రేతాయుగంలోని రాముడు ఇప్పుడు ‘రాముళ్లు’ ఒకటి కాదని కూడా ఒకింత వివరంగానే చెప్పారు. నిజాన్ని నిర్ధారించే అవసరం లేకుండానే అసత్యాలను ప్రచారం చేసి దాన్ని సత్యంగా నమ్మమంటున్నారని, దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత హక్కుల సంఘాలపై ఉందన్నారు. ఒకప్పుడు రాజ్యహింసే ప్రధానంగా ప్రశ్నింపబడేదని, ఇప్పుడు ప్రతి రంగమూ యుద్ధరంగమేనంటూ పౌరసంఘాలు చేయాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. ప్రశ్నించడం ప్రజలకు నేర్పాలని, ప్రశ్నిస్తూనే ఉండాలని, దీనికి మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆనాడు ప్రశ్నించినందుకు ఆరుగురు పౌర హక్కుల నాయకులు ప్రాణాలు కోల్పోయిన గుర్తుచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి.

ఎన్నో ఆటు పోట్లు...

ప్రొఫెసర్ హరగోపాల్ ఏపీసీఎల్సీ 50 ఏళ్ల ప్రస్ధానాన్ని సోదాహరణంగా కళ్లముందుంచారు. అధికారం లేనప్పుడు వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో, అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో వివరించారు. ఉపా చట్టాన్ని వెనక్కుతీసుకుంటానని మాటిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని దాట వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డికి చురకంటించారు. మనిషి ఉన్నతమైన మనిషిగా ఎదగడానికే హక్కుల సంఘాలన్నారు. స్వేచ్ఛ అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా అభివర్ణించారు. అన్ని వ్యవస్థలను నేటి పాలకులు ఎలా కలుషితం చేస్తున్నారో వివరిస్తూ దాన్ని ఎదుర్కొనకపోతే ఫాసిస్టు పాలన వస్తుందని, అప్పుడు తిరిగి చూసుకునేందుకు ఎవరూ మిగలరన్న సందేశాన్ని ఇచ్చారు.

ప్రతి రంగమూ యుద్ధ రంగమే...

ప్రముఖ గాంధేయ వాది, సామాజిక వేత్త హర్షమందిర్ తన ప్రారంభోపన్యాసంలో ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక అంశాలను ప్రస్తావించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి మహాత్ములు నడయాడిన నేలలో ఇవేళ జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను విడమరచి చెప్పారు. గాంధీ చెప్పిన సౌభ్రాతృత్వం ఇవేళ కనుమరుగైందని, సమాజంలో ఓ వర్గంపై అప్రకటిత యుద్ధం నడుస్తోందని, ఇది 1975ల నాటి ఎమర్జెన్సీని మించిపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఓ మోదీనో మరో అమిత్ షాని నిందించడానికి బదులు ప్రజల్నే తప్పుబట్టాలన్నారు. ఈ దేశం నీదీ, నాదీ, మనందరిదీ అనే భావన కొరవడితే చాలా కష్టనష్టాలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవన్న హర్షమందిర్ ఇప్పుడున్న పాలకులే మళ్లీ గెలిస్తే రాజ్యాంగ స్వరూపం మారుతుందని, దీనికి మౌనం సమాధానం కాదని తెగేసి చెప్పారు. హింస దేనికి సమాధానం కాదంటూ గాంధీని చంపిన గాడ్సే చివర్లో అన్న మాట హే రామ్, గాంధీ ప్రబోధించిన హే రామ్ ఒకటి కాదన్నది గుర్తించాలన్నారు హర్షమందిర్.

చక్కటి ప్లానింగ్ తో సాగిన సభల నిర్వహణ

తొలిరోజు జరిగిన నాలుగు సెషన్స్ ను నిర్వాహకులు చాలా పకడ్బంధీగా ప్లాన్ చేశారు. ప్రారంభోత్సవంలోనే జస్టిస్ సుదర్శనరెడ్డితో నిర్బంధ చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి మాట్లాడితే దేశవ్యాప్తంగా హక్కుల పరిస్థితిని హర్షమందర్ వివరించారు. మతం- రాజ్యాంగం- పౌరహక్కులపై ది వైర్ పత్రిక సీనియర్ ఎడిటర్ అర్ఫాఖాసుం షేర్వానీ, పత్రికా స్వేచ్ఛ- నిర్బంధంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, విద్య- కాషాయికరణపై ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ మధు ప్రసాద్ ప్రసంగించారు. హక్కుల సంఘాల ప్రతినిధులు, సౌహార్థ సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో.. ఎక్కడా వచ్చిన వారికి బోర్ కొట్టకుండా చక్కగా సభా నిర్వహణ సాగింది. రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలను, చర్చలను సాగించేలా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్కా నారాయణ రావు, వేడంగి చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్, అడ్వకేట్ విష్ణువర్ధన్ లాంటి వాళ్లు యావత్ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఎవరికీ ఏ లోటూ లేకుండా 50వ వార్షికోత్సవాలను నడపడం విశేషం.

ఎంత నిర్బంధానికి గురైనా, ఎన్ని బెదిరింపులు వచ్చిన ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో ముందుంటామనే ప్రతిజ్ఞతో ఈ 50 ఏళ్ల వసంతోత్సవ సభలు ముగిశాయి.

Read More
Next Story