
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళని స్వామి
అన్నాడీఎంకే ఎన్నికల హమీలు తమిళనాడు బడ్జెట్ తో సాధ్యమేనా?
ఇప్పటికే జీఎస్డీపీలో 25 శాతంగా ఉన్న అప్పులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అనుకుంటున్న అన్నాడీఎంకే పార్టీ ప్రజలను ఆకర్షించే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించింది.
మహిళలకు మెరుగైన ఆర్థిక సాయం, పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, గృహ నిర్మాణ పథకాన్ని విస్తరించడం వంటివి ఇందులో ఉన్నాయి. డీఎంకే రూపొందించిన కొన్ని పథకాలతో వీటికి సారూప్యతలు ఉన్నాయి. అన్నాడీఎంకే కాపీ పేస్ట్ విధానాలను అమలు చేస్తుందని ఈ మ్యానిఫెస్టో పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అప్పులకుప్పతో సతమతం అవుతోంది. ఈ సమయంలో మరిన్ని ఉచిత పథకాలు ప్రకటించడం రాష్ట్రంపై ఆర్థికంగా పెనుభారంగా మారే అవకాశం ఉంది. దేశంలో రెండో అతిపెద్ద జీడీపీ కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ పరిమితికి మించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక ఒత్తిడి తీవ్రతరం అవుతోంది.
అన్నాడీఎంకే ఉచితాలు..
చెన్నైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి విలేకరులతో మాట్లాడారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే ఐదు కీలక వాగ్ధానాలను వివరించారు.
ఇందులో ‘కుల విలక్కు(కుటుంబ దీపం)’ పథకం, ఇది రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ కు హమీ ఇస్తుంది. ఇది నేరుగా ఇంటియజమాని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
ఇది ప్రస్తుతం డీఎంకే అమలు చేస్తున్న రూ. 1000 ల పథకమైన ‘‘కలైంజర్ మగలిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని పోలి ఉంది.
పట్టణ ప్రాంతాలలో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు పథకం కొనసాగించడం, షెడ్యూల్డ్ కుల కుటుంబాలకు ప్రత్యేక నిబంధనలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత కాంక్రీట్ ఇళ్లు, పట్టణ మండలాల్లో అపార్ట్ మెంట్లు అందించడానికి ‘‘అమ్మఇల్లం’’, గ్రామీణ ఉపాధి పథకం పనిదినాలను వంద నుంచి 150 రోజులకు పెంచడం, అమ్మ ద్విచక్ర వాహనం పదకం కింద ఐదు లక్షల మంది మహిళలకు రూ.25 వేల సబ్సిడీని అందించడం వంటి ప్రకటనలు ఉన్నాయి.
ఆర్థిక ఇబ్బందులు..
దేశ జీడీపీ తమిళనాడు 8.5 వాటాను అందిస్తోంది. ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి బలమైన పరిశ్రమలు వృద్దికి ఊతమిస్తున్నాయి. హ్యుందాయ్, ఫోర్డ్ వంటి ప్రధాన ఆటో మొబైల్ కంపెనీలు రాష్ట్రం కేంద్రంగా ఉన్నాయి. తిరుపూర్ నిట్వేర్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది. చెన్నై ఐటీకారిడార్ పెట్టుబడులు ఉద్యోగాలను ఆకర్షిస్తూనే ఉంది.
అయితే బలమైన ఆర్థిక పునాది ఉన్నప్పటికీ రాష్ట్రం మాత్రం అప్పుల కుప్పతో సతమతమవుతోంది. 2021 లో అన్నాడీఎంకే చివరి పదవీకాలం లో రాష్ట్ర అప్పు దాదాపు రూ.5.18 లక్షల కోట్లుగా ఉండేది. అయితే 2026 నాటికి ఇది ఏకంగా రూ. 8.16 లక్షల కోట్లకు చేరింది.
అధిక సంక్షేమ కార్యక్రమాలు, కోవిడ్ పరిస్థితులు, జీఎస్టీ అమలు తరువాత పెరిగిన ఖర్చులు, తరిగిన రాబడి వీటికి కారణం. ప్రస్తుతం తమిళనాడు జీఎస్డీపీలో 25-28 శాతం అప్పులు వాటా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ.
అక్ష్యరాస్యత 85 శాతం, తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 50 శాతం ఎక్కువ ఉండటంతో రాష్ట్రంలో మంచి మానవాభివృద్ధి సూచికలు ఉన్నాయి. అయితే సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడం, గ్రామీణ వేతనాల్లో స్తబ్ధత, వ్యవసాయంపై పర్యావరణ ప్రభావం చూపతున్నాయి.
రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ల్యాప్ టాప్ పంపిణీ వంటి పథకాలు నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 1 కోట్ల అప్పు తీసుకుంటోంది.
సంక్షేమ వాదనలు..
గత ఐదు సంవత్సరాలలో అధికార పార్టీ సాధించిన విజయాలకు అన్నాడీఎంకే మ్యానిఫెస్టో ‘‘దయనీయమైన నకిలీ’’ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా విమర్శించారు. ‘‘ఏఐఏడీఎంకే చాలా దిగజారింది. అది మా పథకాలను అలాగే అమలు చేస్తామని చెబుతోంది’’ అని రాజా ఒక ప్రకటనలో విమర్శించారు. 2021 లో ఈ పథకాలను ఫళని స్వామి లాభదాయకం కాదని విమర్శించారని, ఇప్పుడు ఆయనే వీటిని అమలు చేస్తామంటున్నారని చెప్పారు.
గ్రామీణ ఉపాధిని విస్తృతం చేస్తామని అన్నాడీఎంకే చేసిన వాగ్ధానాన్ని ఆయన ఎగతాళి చేశారు. ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని కార్మిక సంస్కరణలు ముందుకు తెచ్చి ఉపాధిని బలహీనపరుస్తోందని విమర్శించారు.
‘‘వంద రోజుల పథకానికి సమాధి తవ్విన బీజేపీ చట్టాలకు పళనిస్వామి మద్దతు ఇచ్చారు. కానీ ఆయన ఇప్పుడు 150 రోజుల పనికి హమీ ఇచ్చారు. ఆయన తనను తాను మోసం చేసుకోవచ్చు. కానీ తమిళ ప్రజలను మాత్రం కాదు’’ అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలను పళనిస్వామి గట్టి కౌంటర్ ఇచ్చారు. తన పదవీకాలంలో ఆర్థిక శక్తి గట్టిగా ఉందని నొక్కి చెప్పారు. ‘‘అన్నాడీఎంకే పాలనలో పన్ను ఆదాయం లేకుండా కోవిడ్ ఉపశమనం కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని అయినప్పటికీ అప్పటి అప్పు కేవలం 5.18 లక్షల కోట్లు మాత్రమే. డీఎంకే కాలంలో మాత్రం అప్పును భారీగా పెంచింది. ఇది వారి పరిపాలన అసమర్థతకు కారణం’’ అని ఆయన ఎదురుదాడికి దిగారు.
రాజకీయ కారణాల వల్ల ప్రజాదరణ పొందిన పథకాలను నిలిపివేసిందని, ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని ప్రజలకు అందించవచ్చని అన్నాడీఎంకే ఎంపీ ఐఎస్ ఇంబాదురై చేసిన వాదనకు మద్దతు ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా పళని స్వామి సమర్థవంతంగా ఆర్థిక వ్యవహరాలు నడిపారని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక వాస్తవితకు అనుగుణంగా..
సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ మాట్లాడుతూ.. అన్నాడీఎంకే విజయం డీఎంకే ప్రారంభించిన పథకాల పేరు మార్చే ప్రక్రియకు దారితీస్తుందని పేర్కొన్నారు. గత పాలనలో ఈ పద్దతి మారుతోంది.
‘‘పళని స్వామి తన ఆర్థిక వ్యూహాన్ని స్పష్టం చేసుకోవాలి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున అదనపు నిధులు రాబట్టుకోవచ్చు. కానీ రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేయడంలో ముందుంటారు. డీఎంకే నెలవారీగా రూ. 2500 సాయంతో ఎదుర్కోగలదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ద్రవిడ పార్టీలు ఉచితాలతో పోటీ పడటం వ్యంగ్యంగా ఉందని ఆయన గుర్తించారు. ఈ సమయంలో ఇటువంటి ప్రజాకర్షక చర్యలకు కేంద్రం నుంచి ఆమోదం లభించే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రాలు చేసే అప్పుపై కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.
ఎన్నికల వాతావరణం హీటెక్కుతున్నప్పటికీ విశ్లేషకులు డీఎంకే, అన్నాడీఎంకే చేసిన వాగ్ధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఇచ్చే వాగ్థానాలకు ఆర్థిక ఆరోగ్యపై పడే ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు.
ఈ ప్రకటనలు ఓట్లుగా మారతాయా లేదో చూడాలి. కానీ అవి తమిళనాడు శాశ్వత రాజకీయ సంప్రదాయాన్ని జనాదరణను ఆర్థిక ఆశయంతో మిళితం చేయడాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నాయి.
Next Story

