‘‘హమీలు కాదు.. గౌరవ వేతనం కావాలి’’
x

‘‘హమీలు కాదు.. గౌరవ వేతనం కావాలి’’

బెంగళూర్ లో ఆందోళన చేస్తున్న ‘ఆశా’ కార్యకర్తలు


Click the Play button to hear this message in audio format

ప్రభుత్వ హామీలు వద్దు.. నెలకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. ఇదే ఇప్పుడు కర్ణాటకలో ఆశా కార్యకర్తల ప్రధాన డిమాండ్. తమ సమస్యల పరిష్కారం కోసం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో చేపట్టిన నిరవధిక ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంతో రెండో విడత చర్చలు కూడా ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదు. వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో వేతనాలు పెంచుతామన్న ప్రభుత్వ ప్రతిపాదనను సైతం వారు తిరస్కరించారు.

జీవనం కష్టంగా మారింది..

కర్ణాటకలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు పగలు, రాత్రి తేడా లేకుండా ఫ్రీడమ్ పార్క్‌లోనే నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తమకు అందుతున్న గౌరవ వేతనం కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని వారు చెబుతున్నారు. అందుకే నెలకు కనీసం రూ.15 వేల స్థిర గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయపుర జిల్లా సింధగి ప్రాంతానికి చెందిన మంజుల అనే ఆశా కార్యకర్త నెల మొత్తం పనిచేసినా తనకు రూ.5 వేలే వస్తున్నాయని, అవి కుటుంబానికి సరిపోవడం లేదని ‘ది ఫెడరల్’ తో చెప్పారు. హున్సూర్‌కు చెందిన మరో కార్యకర్తకు నెలకు సుమారు రూ.7 వేలు అందుతున్నాయి. అయితే పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఆహార ఖర్చులకే ఆ మొత్తం సరిపోవడం లేదని ఆమె తెలిపారు.
రేషన్ బియ్యం, వంట నూనె, గ్యాస్ ధరలు పెరగడంతో పాటు ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు కూడా భారంగా మారాయని కార్యకర్తలు చెబుతున్నారు. వారిలో చాలామంది ఒంటరి తల్లులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని అంటున్నారు.

పనిభారం పెరుగుతోంది...

చాలీచాలని వేతనంతో పాటు రోజుకో కొత్త పని జత చేస్తున్నారని కూడా ఆశా కార్యకర్తల వాపోతున్నారు. గతంతో పోలిస్తే భారీ స్థాయిలో కొత్త పనులు చేపిస్తున్నారని కానీ వేతనాలు మాత్రం ఆ స్థాయిలో పెంచడం లేదని అంటున్నారు. మొదట్లో తల్లులు, శిశువుల మరణాల రేటును తగ్గించాలనే లక్ష్యంతో ఈ సేవల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు వారి బాధ్యతలు అనేక రెట్లు పెరిగాయని చెబుతున్నారు.
గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పిల్లలకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించడం, 18 ఏళ్లలోపు బాలికలపై నిఘా ఉంచి బాల్యవివాహాలను అడ్డుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఫోక్స్ కేసులపై అవగాహన కల్పించడం వంటివి కూడా వీరికే అప్పగిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఆశా కార్యకర్తలు కీలక సేవలు అందించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించడం, ప్రజలకు మందులు పంపిణీ చేయడం వంటి పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ప్రస్తుతం ఒక్కొక్కరికి దాదాపు 30 రకాల పనులు అప్పగిస్తున్నారని వారు చెబుతున్నారు. కుష్టు వ్యాధి, దోమల లార్వా సర్వేలు, కఫం నమూనాల సేకరణ వంటి పనులకు నిర్దిష్ట లక్ష్యాలు విధిస్తున్నారు. వీటికి తోడు ఆన్‌లైన్ పనులు కూడా పెరిగిపోయాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కార్యక్రమం నుంచి రోగుల ఐడీ నమోదు వరకు తమ సొంత మొబైళ్లలోనే చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోన్లు కూడా అందించలేదని వాపోతున్నారు.
ఇక వేతనాల పెంపు విషయంలో గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. 2025లోనూ ఇలాగే రాత్రంతా ఆందోళన నిర్వహించినప్పుడు, ప్రస్తుతం అందుతున్న వివిధ ప్రోత్సాహకాలను గౌరవ వేతనంలో కలిపి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లాల స్థాయిలో నిరసనలు, పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి మార్పు రాలేదని వారు చెబుతున్నారు.

హమీల అమలు ఊసేలేదు...

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ఆశా కార్యకర్తలకు రూ.3 వేల వేతన పెంపు హామీ ఇచ్చినట్లు మంజుల గుర్తు చేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరసనకు దిగిన కార్యకర్తలతో పాటు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా కూర్చొని, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని మరో కార్యకర్త ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీలతో తమ కుటుంబాలు గడవవని, తక్షణమే వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని పట్టుబడుతున్నారు.

చలిలోనూ ఆందోళన..

ఇక ఫ్రీడమ్ పార్క్‌లో నిరసన కొనసాగిస్తున్న కార్యకర్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది. చలిలో రోడ్లపైనే టార్పాలిన్ షీట్ల కింద నిద్రిస్తున్నారు. యూనియన్ ఏర్పాటు చేసిన ఏర్పాట్లలో ప్లాస్టిక్ షీట్లపై రొట్టెలు, చపాతీలు తింటున్నారు. మరుగుదొడ్లలో నీటి సదుపాయం లేకపోవడంతో పారిశుధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు రోజుల తరబడి స్నానం కూడా చేయలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
ఇంటివద్ద పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో పలువురు తమ చిన్నారులు, మనవళ్లను కూడా ఆందోళన ప్రదేశానికి తీసుకొచ్చారు. ముదోల్‌కు చెందిన జ్ఞానేశ్వరి తన ఐదేళ్ల కుమార్తె శివానిని వెంట తీసుకొచ్చారు. ఆందోళన చేస్తున్నవారిలో వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు. కొందరు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
చర్చల పేరుతో ప్రభుత్వం మరింత కాలయాపన చేయవద్దని ఆశా కార్యకర్తలు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన ప్రదేశాన్ని విడిచిపెట్టబోమని స్పష్టం చేస్తున్నారు.
మొత్తంగా కర్ణాటకలో ఆశా కార్యకర్తల నిరసన కేవలం వేతన పెంపు డిమాండ్‌కే పరిమితం కావడం లేదు. పెరుగుతున్న పని భారం, ప్రోత్సాహకాల అమలు, కనీస ఆర్థిక భద్రత వంటి అంశాలు కూడా ఈ ఆందోళనలో కీలకంగా మారాయి. ప్రభుత్వం, కార్యకర్తల మధ్య చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story