కార్మికుల కడుపుకొట్టి రాజకీయ పార్టీలకు బాండ్లు కొనిపెట్టి..
x
ఎన్నికల బాండ్లపై కార్మికుల ప్రదర్శన (ఫైల్)

కార్మికుల కడుపుకొట్టి రాజకీయ పార్టీలకు బాండ్లు కొనిపెట్టి..

తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 కంపెనీలు ఎన్నికల బాండ్లు కొని రాజకీయ పార్టీలకు ఇచ్చాయి. అందుకే అవి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల్ని తప్పించుకుని ఉండవచ్చు


ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం బయటపెట్టిందో లేదో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం ఒక భాగంలో.. ఏ పార్టీ ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తాన్ని డ్రా చేసిందన్న వివరాలు మరో భాగంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రముఖ కంపెనీలున్నా తెలుగు రాష్ట్రాల్లోని బడా కంపెనీలు కూడా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు అప్పగించాయి.

మేఘా ఇంజినీరింగ్‌ భారీ విరాళం

తెలుగు రాష్ట్రాల్లో పేరున్న మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్ధలు ఏవేవీ?

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.80 కోట్లు, నాట్కోఫార్మా: రూ.70 కోట్లు, ఎన్‌సీసీ లిమిటెడ్‌: రూ.60 కోట్లు, హెటిరో గ్రూప్‌: రూ.60 కోట్లు, నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌: రూ.55 కోట్లు, దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.55 కోట్లు, అరబిందో ఫార్మా లిమిటెడ్‌: రూ.50 కోట్లు, రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.45 కోట్లు, గ్రీన్‌కో: రూ.35 కోట్లు, అపర్ణా ఫామ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సంస్థ: రూ.30 కోట్లు, ఎన్‌ఎస్‌ఎల్‌ ఎస్‌ఈజెడ్‌ హైదరాబాద్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.29 కోట్లు, కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌: రూ.26.50 కోట్లు, మైహోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.25 కోట్లు, రాజపుష్ప గ్రూప్‌: రూ.25 కోట్లు, ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌: రూ.10 కోట్లు, నారా కన్‌స్ట్రక్షన్స్‌: రూ.10 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌: రూ.10 కోట్లు, సోమశిల సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌: రూ.7 కోట్లు, శ్రీచైతన్య స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌: రూ.6 కోట్లు, సుధాకర్‌ కంచర్ల: రూ.5 కోట్లు, కేసీఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ: రూ.5 కోట్లు, ఐల్యాబ్స్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.5 కోట్లు.

ఏయే పార్టీలకు ఎన్నెన్ని కోట్లంటే...

ఎన్నికల బాండ్ల రూపంలో వైసీపీదే అగ్రస్థానం. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందాయి. టీడీపీకి రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి. తెలంగాణ బీజేపీకి రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.

కార్మికులకు జీతాలివ్వరు గాని..

“తమ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి చేతులు రాని అనేక పేరున్న కంపెనీలు.. రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు కొనిపెట్టిన తీరు చూస్తుంటే కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉంది. మేఘా కంపెనీ ఏకంగా 966 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చింది. పని చేస్తున్న ఫ్యాక్టరీలో ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోని దివీస్ కంపెనీ రూ.55 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. ఇలా ఒకరేమిటీ ఎన్నికల బాండ్లు కొన్న ప్రతి కంపెనీ.. కార్మికుల ఉసురు తీసినవే” అన్నారు ఏఐటీయూసీ నేత ఆర్.రవీంద్రనాథ్. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా చాలా కాలంగా పార్మా కంపెనీల ఆగడాలపై అటు విశాఖ ఇటు హైదరాబాద్ సహా పలు చోట్ల ఆందోళనలు సాగాయి. పర్యావరణానికి హానీ జరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటిరెండు కంపెనీల్లో అయితే పేలుళ్లు జరిగి కార్మికులు ప్రాణాలే పొగొట్టుకున్నారు. అయినా ఆ కంపెనీలు ఏవీ బాధితుల కుటుంబాలకు అందించాల్సినంత సాయం అందించలేదన్నది నగ్నసత్యం. దివీస్, అరబిందో, రెడ్డిస్ ల్యాబ్ సహా అనేక ఫార్మా కంపెనీలపై కార్మిక శాఖ వద్ద కేసులు కూడా ఉన్నాయి. అలాగే మేఘా కనస్ట్రక్షన్ కంపెనీపైనా కేసులు నడుస్తున్నాయని, ఉత్తరాది రాష్ట్రాలలో జరుగుతున్న కనస్ట్రక్షన్ సైట్లలో కార్మికులు 2023 నవంబర్ 6న కూడా ధర్నాలు జరిగాయని మరో కార్మిక సంఘం నేత గాదె దివాకర్ చెప్పారు. “బాండ్ల వివరాలు బయటకు వచ్చినందున ఏ పెట్టుబడిదారుడు లేదా కంపెనీ ఆ బాండ్లను విరాళంగా ఇచ్చిందో తెలిసిపోయింది. విరాళానికి ఫలితంగా ఆ సంస్థ లేదా వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా చేసిన పనులు లేదా విధానాలు బయటకురావాల్సి ఉంది. ఎన్నికల బాండ్ల కొనిపెట్టిన కంపెనీల మీద పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండి ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 కంపెనీలు ఎన్నికల బాండ్లు కొని రాజకీయ పార్టీలకు ఇచ్చాయి. అందుకే అవి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి దాడుల్ని తప్పించుకుని ఉండవచ్చు. ఒకసారి ఎన్నికల బాండ్ల వివరాలు పూర్తిగా బయటకు వస్తే, ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడినందుకు ప్రతిగా ఏమిచ్చారో నిర్ధారణ అవుతుంది” అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. నష్టాల పేరిట దివాలా పిటిషన్లు వేసిన వారు, కార్మికుల నెలవారీ వేతనాలు ఎగ్గొట్టిన సంస్థలు కూడా ఎన్నికల బాండ్లు కొన్నాయంటే వీటిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రామకృష్ణ.

Read More
Next Story