కర్ణాటక సీఎంకు ఎదురుదెబ్బ.. గవర్నర్ చర్యలను సమర్థించిన కోర్టు
x

కర్ణాటక సీఎంకు ఎదురుదెబ్బ.. గవర్నర్ చర్యలను సమర్థించిన కోర్టు

ముడా స్కామ్‌కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కామ్‌ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక సిద్ధరామయ్య విచారణ ఎదుర్కోక తప్పదు.

ఏమిటీ ముడా?

మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల విస్తీర్ణం గల 14 ఇంటి స్థలాలు కేటాయించింది. ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నా.. అభివృద్ధి చెందిన విజయనగర లే అవుట్‌లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధరామయ్య ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడీఎస్‌ ఇటీవలే బహిర్గతం చేసింది. కెసర పరిధిలో చదరపు అడుగు రూ.2-3 వేలు పలుకుతుండగా, విజయనగర్‌ లే అవుట్‌లో రూ.10-12 వేల వరకూ ధర పలుకుతున్న ఇంటి స్థలాలను సిద్దరామయ్య భార్య పొందారని, వాస్తవంగా ఆవి దళితులకు చెందినదని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధరామయ్య భార్యకు కేటాయించిన ఇంటి స్థలాల విలువ రూ.70 కోట్లకుపైగానే పలుకుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య గతంలో స్పందించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే.. దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.

మరో వైపు ముడా ఇంటి స్థలాలను అక్రమంగా పొందిన సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, మైసూరుకు చెందిన మరో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, బెంగళూరు నాగరభావి నివాసి ప్రదీప్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. జూలై 26న టీజే అబ్రహాం సమగ్ర వివరాలతో గవర్నర్‌ను కలిసి ప్రాసిక్యూషన్‌ కోరారు. ఆ మరుసటి రోజే సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, ముడా ఇంటిస్థలాల అక్రమంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని గవర్నర్‌ అనుమతులు ఇచ్చారు.

నిరసన

గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసన చేపట్టారు. గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, అనేక ఇతర కేసులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదిలా ఉండగా, ఆరోపించిన ముడా కుంభకోణంపై పత్రాలతో పాటు వివరణాత్మక నివేదికను అందించాలని గవర్నర్ గెహ్లాట్ గత వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్‌ను కోరారు.

వాయిదా

భూ కేటాయింపుల కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో గవర్నర్ ఉత్తర్వులను సీఎం సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. విచారణను హైకోర్టు ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 19 మధ్యంతర ఉత్తర్వులను కూడా కోర్టు పొడిగించింది. ఇందులో సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఫిర్యాదుల విచారణను తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని ప్రత్యేక కోర్టును హైకోర్టు కోరింది.

Read More
Next Story