బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జూర్ సస్పెండ్
x
బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జూర్

బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జూర్ సస్పెండ్

జనవరి 1 న జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పవన్, రెండో తేదీని విధుల నుంచి తొలగించిన సీఎం


బళ్లారిలో విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చెలరేగిన హింస, ఒకరి మృతిపై కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జిల్లా ఎస్పీ పవన్ నెజ్జూర్ ను సస్పెండ్ చేసింది.

గురువారం సాయంత్రం బ్యానర్ల ఏర్పాటు సందర్భంగా చెలరేగిన వివాదంలో బీజెపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి మద్ధతుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఈ సందర్భంగా ఒకరు మరణించారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. బళ్లారి ఎస్పీగా పవన్ నెజ్జూర్ జనవరి 1నే బాధ్యతలు స్వీకరించారు.

బళ్లారిలోని ఎస్పీ సర్కిల్ లో వాల్మీకి మహార్షి విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ఘర్షణ జరిగింది. దీనిఫలితంగా రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
‘‘బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జుర్ పై తగిన చర్య తీసుకోవాలని బళ్లారి రేంజ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీఐజీపీ) సిఫార్సు చేశారు. పరిస్థితిని నిర్వహించడంలో సమర్థవంతంగా వ్యవహరించకపోవడం, సీనియర్ అధికారులకు క్షేత్ర స్థాయి పరిస్థితులు సరిగా వివరించడంలో విఫలం అయ్యారు’’ అని రిపోర్ట్ లో డీఐజీపీ పేర్కొన్నారు. డీజీ, ఐజీపీ కూడా ఈ అధికారిపై అవసరమైన చర్యకు సిఫార్సు చేశారని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సస్పెన్షన్ కాలంలో ఆల్ ఇండియా సర్వీస్ క్రమశిక్షణ నియమాలు 1969, 4 వ నిబంధన ప్రకారం.. భత్యం చెల్లించబడుతుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ‘‘సస్పెన్షన్ కాలంలో అధికారి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ రాతపూర్వక అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లకూడదు’’ అని ఆదేశించింది.
హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకూ నాలుగు ఎఫ్ఐఆర్ లు పోలీసులు నమోదు చేశారు. ఈ ఘర్షణలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్థన రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు సహ ఇతరులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్ లు కట్టడంతో వివాదం ప్రారంభం అయింది. తన ఇంటిముందు కాంగ్రెస్ జెండాలపై గాలి జనార్థన్ రెడ్డి మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వీటిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని వార్తలు వస్తున్నాయి. గాలి జనార్థన్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసిన సూర్య నారాయణ్ రెడ్డి కుమారుడు భరత్ రెడ్డి తరువాత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అప్పటి నుంచి బళ్లారి లోని మైనింగ్ పట్టు సాధించేందుకు రెండు వర్గాలు ఎత్తులు వేస్తున్నారు. ఈ సందర్భంగానే ఘర్షణ జరిగింది. ఇందులో తుపాకులు కూడా వాడటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు.

Read More
Next Story