
సెంగొట్టయన్‌ను బీజేపీ 'స్లీపర్ సెల్' అని అన్నదెవరు?
‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనమేరకే సెంగొట్టయన్ TVK పార్టీలో చేరారు’- తమిళనాడు మంత్రి రేగుపతి
సెంగొట్టయన్(Sengottaiyan) బీజేపీ(BJP) "స్లీపర్ సెల్" అని వ్యాఖ్యానించారు తమిళనాడు మంత్రి ఎస్. రేగుపతి. గతంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన సెంగొట్టయన్.. నిన్న(నవంబర్ 27) విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రీ కజగం (TVK)లో చేరిన విషయం తెలిసిందే. సెంగొట్టయన్‌ను కాషాయ పార్టీ రిమోట్‌తో పోల్చిన రేగుపతి..కేంద్ర హోమంత్రి అమిత్ షా సూచనమేరకే ఆయన విజయ్ పార్టీలో చేరారని ఆరోపించారు.
బీజేపీ చేర్చుకోకపోవడంతోనే సెంగొట్టయన్ టీవీకేలో చేరారా? అని అడిగినపుడు..బీజేపీ మోసం చేసి ఉంటే సెంగొట్టయన్ టీవీకేలో చేరి ఉండేవాడు కాదని మంత్రి రేగుపతి బదులిచ్చారు. బీజేపి ఇచ్చిన పనిని అమలు చేయడానికి సెంగొట్టయన్ టీవీకేలో చేరాడని ఆరోపించారు.
AIAMDKతో యాభైఏళ్ల ప్రయాణం..
ఏఐఏడీఎంకేకు సుమారు యాభైఏళ్ల పాటు సేవలందించిన సెంగొట్టయన్‌ను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఫళని స్వామిని సెంగొట్టయన్ కోరారు. అయితే ఆయన డిమాండ్‌ను ఒప్పుకోకపోవడంతో నవంబర్ 26న సెంగొట్టయన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ అప్పావుకు తన రాజీనామా లేఖను అందజేసే ముందు సెంగొట్టయన్ సచివాలయంలో హిందూ మత, ధార్మిక ధార్మిక శాఖ మంత్రి శేఖర్ బాబుతో కొద్దిసేపు మాట్లాడారు.
సెంగొట్టయన్‌తో బాబు సమావేశం?
సెంగొట్టయన్‌ను డీఎంకేలోకి ఆహ్వానించడంపై శేఖర్ బాబు మాట్లాడుతూ..‘‘ఎవరైనా పార్టీ నుంచి నిష్క్రమిస్తే వారిని ఆహ్వానించడం సహజం. ఆయన బీజేపీ స్లీపర్ సెల్ కాబట్టి రాలేదు" అని బాబు అన్నారు.

