కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంపై చేతబడి
x
గత వారం మంగళూరులోని శ్రీ క్షేత్ర ధర్మస్థల సందర్శన సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్. ఫోటో: PTI

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంపై చేతబడి

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రత్యర్థి పార్టీలు చేతబడి చేయించాయా? బ్లాక్ మ్యాజిక్ చేయించిందెవరు? డిప్యూటీ సీఎం శివకుమార్ ఏం చెప్పారు?


రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేతబడి చేయించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేర్కొన్నారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని మారుమూల ప్రాంతంలో అఘోరాలు, తాంత్రికులతో కలిసి ఈ పని చేయించినట్లు తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించవని పేర్కొన్నారు.

శత్రు నిర్మూలన కోసం చేసే ఈ యాగాన్ని 'రాజ కంటక', మరణ మోహన స్తంభన'గా పిలుస్తారని శివకుమార్ చెప్పారు. ఈ యాగానికి అఘోరీల సమక్షంలో 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇస్తారని పేర్కొన్నారు.

ఈ పని బిజెపి లేదా జెడిఎస్ చేసి ఉంటుందా? అని అడిగినప్పుడు..శివకుమార్ పార్టీల పేర్లు బయటపెట్టకుండానే.. కేవలం కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులే చేయించి ఉంటారని చెప్పారు.

దీని వెనుక ఎవరున్నారో తెలుసని చెబుతూ.. “వారి ప్రయత్నాలను కొనసాగించనివ్వండి. నాకు ఏ ఇబ్బంది లేదు. హాని చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించవు. నేను నమ్మే శక్తి నన్ను కాపాడుతుంది’’ అని చెప్పారు.

చేతబడికి విరుగుడు పూజ చేయిస్తారా? అన్న ప్రశ్నకు శివకుమార్.. ప్రతిరోజూ విధులకు హాజరయ్యే ముందు ఒక నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తానని మాత్రమే బదులిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు గురించి..

త్వరలో జరగనున్న ఎమ్మెల్యే ఎన్నికల గురించి శివకుమార్ మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి బెంగళూరులో శాసనసభ్యుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు. 300 మందిలో 65 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశామని చెప్పారు. హైకమాండ్ కోరడంతో నివేదిక పంపామన్నారు.

సీఎం కుమారుడికి ఎమ్మెల్సీ సీటు..

తన తండ్రి కోసం ఎమ్మెల్యే సీటును వదులుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓడిపోయిన వారితోపాటు ప్రముఖ నేతలు టికెట్లు కోరినట్లు సమాచారం. పార్టీకోసం పనిచేసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బెంగళూరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం సాధ్యం కాదని, కళ్యాణ కర్ణాటక, ముంబై కర్ణాటక, కోస్టల్, సెంట్రల్ కర్ణాటక వంటి ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తామన్నారు.

Read More
Next Story