
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
బ్రేక్ ఫాస్ట్ డిప్లమసీ: శివకుమార్ ఇంటికి వెళ్లనున్న సీఎం సిద్ధరామయ్య
పార్టీలో గందరగోళం లేదు, ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వడానికే అంటున్న పార్టీ వర్గాలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే నివాసానికి రేపు ఉదయం సీఎం సిద్ధరామయ్య వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీఎం కుర్చీ కోసం చాలా రోజులుగా వైరీ వర్గాలు ఉన్నా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మొన్న అల్పాహార సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇద్దరు మీడియా సమావేశం పెట్టి, నాయకత్వ మార్పు లేదని ప్రకటించారు.
2028 ఎన్నికల్లో శివకుమార్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉంటారని కూడా వెల్లడించారు. తాజాగా ఈ దౌత్యం మరింత ముందడుగు వేయడానికి డీకే శివకుమార్ ఇంటికి సీఎం రేపు వెళ్లనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నెలల తరబడి కొనసాగిన అధికారు పోరు అలజడి తరువాత పార్టీ అధిష్టానం ఇరు నాయకుల మధ్య సంధి కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మధ్య ఐక్యత తీసుకురావడానికి అల్ఫహార దౌత్యాన్ని తెరపైకి తెచ్చింది.
నాయకత్వ మార్పు లేదు..
శివకుమార్ సీఎం ఇంటికి వెళ్లిన తరువాత ఆయన ఉప ముఖ్యమంత్రి ఇంటికి రానున్నట్లు తెలిసింది. ఇంతకుముందే ఇద్దరు నాయకులు సీఎం మార్పు ఉండదని ప్రకటించారు.
అయితే శివకుమార్ ఇంటికి సీఎం రావడం పార్టీలో ఐక్యమత్యాన్ని చాటడం కోసమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలకు తాము కలిసున్నామనే స్పష్టమైన సందేశం ఇవ్వడమే అని చెబుతున్నారు. డిసెంబర్ ఎనిమిది నుంచి బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు జరబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి ఇరువురు నాయకులు కలవబోతున్నారని సమాచారం.
‘‘శనివారం ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన రేపు అల్పాహారం కోసం శివకుమార్ నివాసానికి వెళ్లనున్నారు’’ అని అధికారికి వర్గాలు వెల్లడించాయి.
అధికార భాగస్వామ్యం..
నవంబర్ 20 తో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. తరువాత రాష్ట్రంలో ఒక్కసారిగా నాయకత్వ మార్పుపై వార్తలు, హడావుడి పెరిగింది. దాంతో పార్టీలో కూడా అధికార పోరు తీవ్రమైంది. 2023 లో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని, చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం పదవిని పంచుకోనున్నారని వార్తలు వచ్చాయి.
అయితే వీటిని సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ఇదంతా మీడియా సృష్టించిన గందరగోళంగా అభివర్ణించారు. ‘‘మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. భవిష్యత్ లోనూ చోటు చేసుకోవు. మా లక్ష్యం 2028 ఎన్నికలు. అంతకుముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు’’ అన్నారు.
‘‘హై కమాండ్ ఏది చెబితే అది పాటిస్తాము. రేపటి నుంచి ఎలాంటి గందరగోళం లేదు. ఇప్పటికి లేదు. కొంతమంది మీడియా రిపోర్టర్లు గందరగోళం సృష్టించారు’’ అని సిద్ధరామయ్య అన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. ఇప్పుడంతా కలిసే పనిచేస్తున్నామని, సీఎంతోనే మేమంతా ఉన్నామన్నారు.
‘‘నాయకత్వ సమస్యపై మేము హైకమాండ్ చెప్పినట్లు వింటాము. వారు ఏమి చెప్పినా, అది మా నిర్ణయం. మేము పార్టీకి నమ్మకమైన సైనికులం, మన దేశంలో పార్టీ కష్ట సమయాల్లో ఉందని మాకు తెలుసు.
కానీ కర్ణాటకలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాము. 2028 లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. 2029 లో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ నాయకత్వంలో ముందుకు సాగుతాము’’ అని శివకుమార్ అన్నారు.
Next Story

