ఏపీలో  బీఆర్ఎస్ మూత!  జనసేన వైపు తోట చంద్రశేఖర్!!
x
తోట చంద్రశేఖర్, పవన్ కల్యాణ్

ఏపీలో బీఆర్ఎస్ మూత! జనసేన వైపు తోట చంద్రశేఖర్!!

ఈ మాజీ ఐఎఎస్ లు ఒక్కచోట నిలకడ ఉండరా.. అప్పుడెప్పుడో జయప్రకాశ్ నారాయణ, మొన్నీ మధ్య ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు తోట చంద్రశేఖర్..


బీఆర్‌ఎస్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐఎఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ మరోసారి పార్టీ మారుతున్నారు. ఏ పార్టీపైనైతే గతంలో విమర్శల జడివాన కురిపించారో అదే పార్టీలో చేరనున్నారు. ఈసారి జనసేనలో చేరేందుకు కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న తోట చంద్రశేఖర్ సినీనటుడు చిరంజీవిని కలిసి చర్చించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లానని చంద్రశేఖర్ చెబుతున్నా.. అసలు ఉద్దేశం మాత్రం జనసేనలో చేరడానికే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తోట చంద్రశేఖర్‌ పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలను చర్చించారని సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన అసెంబ్లీ టికెట్ చంద్రశేఖర్ ఆశిస్తున్నట్లు విస్తృత ప్రచారమైంది.

బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షునిగా...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌. 2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్‌.. 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిత్య హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉంటూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ప్రజారాజ్యం నుంచి ప్రస్థానం...

తోట చంద్రశేఖర్.. రాజకీయప్రస్థానం ప్రజారాజ్యం నుంచి ప్రారంభమైంది. ప్రజారాజ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబానికి బాగా సన్నిహితుడని చెబుతారు. ఇటు జనసేన పార్టీలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత జనసేనకు గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దగ్గరయ్యారు. దీంతో కేసీఆర్ ఆయనకు ఏపీ బాధ్యతలు అప్పగించారు. చాలామంది జనసేన నేతలను ఆయన బీఆర్ఎస్‌లోకి తీసుకెళ్తారని చాలామంది భావించినా పెద్దగా స్పందన రాలేదు. గుంటూరులో బీఆర్‌ఎస్‌ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని పెట్టి పార్టీని నడిపినా ఫలితం లేకపోయింది. ఓ దశలో కేసీఆర్‌ కూడా ఆయన్ను దూరంగా పెట్టారని చెబుతారు. ఇంతలో బీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఓడిపోవడంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.

ప్రజారాజ్యం కనుమరుగైన తర్వాత వైసీపీలోకి తోట...

చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. పవన్‌తో ఉన్న సంబంధాలతో.. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓడిపోయారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడుగా జనసేన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే.. ఆయన ఆమధ్య బహిరంగంగానే జనసేనాని తీరుపై విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా జనసేనలోని కీలక నేత నాదెండ్ల మనోహర్‌పై ఆరోపణలు చేశారు. జనసేనలో ప్రస్తుతం పవన్ తరువాత.. నెంబర్ 2 నాదెండ్ల మనోహర్. ఆయన్నే విమర్శించడం వివాదాస్పదమైంది. వ్యక్తిగతంగా పవన్- తోట చంద్రశేఖర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోయినా.. ఆయన జనసేనకు దూరం అయ్యారు. పార్టీ సొంతంగా ఎదిగే అవకాశాలు ఉన్నా.. టీడీపీతో పొత్తు దిశగా పవన్‌ను మనోహర్ ప్రభావితం చేస్తున్నారనే విమర్శ ఉంది. దీని కారణంగానే చంద్రశేఖర్ జనసేనకు దూరంగా అయ్యారన్న టాక్‌ ఉంది. తోట చంద్రశేఖర్‌కు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనకు సొంత మీడియా చానల్‌ 99 కూడా ఉంది. ఈ చానల్‌ కొంత కాలం జనసేనకు అండగా నిలిచినా ఆ తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు మళ్లీ జనసేన పంచన చేరుతున్నందున తిరిగి పవన్‌కల్యాణ్‌కి ప్రచారం చేస్తారంటున్నారు.

గుంటూరులో జన్మించిన చంద్రశేఖర్‌...

చంద్రశేఖర్ 1963, మే 28న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సరోజిని - రామారావు. గుంటూరులో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన 2000లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చంద్రశేఖర్ భార్య అనురాధ. ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆదిత్య శేఖర్, కుమార్తె అధితి శేఖర్. తోట చంద్రశేఖర్‌ సంస్థలన్నీ వీరిద్దరి పేర్లమీదనే ఉంటాయి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్‌ థానే మున్సిపల్ కార్పొరేషన్ మునిసిపల్ కమిషనర్‌గా, నాగ్‌పూర్ మునిసిపల్ కమిషనర్‌ ముంబై మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేశారు.

Read More
Next Story