
హిందీలో వాతావరణ బులెటిన్ విడుదల చేసిన చెన్నై ప్రాంతీయ సంస్థ
తమిళనాడులో తీవ్ర దుమారం రేపిన వాతావరణ నివేదిక
కొన్నాళ్లుగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో హిందీని అమలు చేయడానికి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీని అనుమతిస్తేనే విద్యకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుందని కేంద్రం భీష్మించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో త్రి భాష విధానాన్ని కాకుండా కేవలం ద్విభాషను మాత్రమే తమ ప్రథమ ఎజెండా అని స్టాలిన్ సర్కార్ ప్రకటించింది.
ఈ వివాదం కొనసాగుతుండగానే తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు హిందీలో తమ రోజువారి నివేదికలు విడుదల చేయడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
తాజాగా చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వాతావరణ సూచనలలో తమిళం, ఇంగ్లీష్ తో పాటు హిందీలో సైతం బులెటిన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
వాతావరణ శాఖ చర్యను కేంద్రం సమర్థించగా, ద్రవిడ రాజకీయ నాయకులు మాత్రం విమర్శించారు. తమిళ భాషకు కట్టుబడి ఉన్న ప్రాంతంలో హిందీని రుద్దే ప్రయత్నం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు భాషల్లో నివేదిక..
చారిత్రాత్మకంగా చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం(ఆర్ఎంసీ) తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ తమిళం, ఇంగ్లీష్ లో మాత్రమే ఇంతకుముందు సూచనలు జారీ చేసేది. ప్రస్తుతం ఐఎండీ వెబ్ సైట్ లో హిందీలో కూడా సూచనలు జారీ చేసింది.
అలాగే కేరళ, కర్ణాటకలో ఉన్న ఐఎండీ కేంద్రాలు మాత్రం ఎప్పటి లాగే వాటి మాతృభాషలతో పాటు ఇంగ్లీష్ లో సూచనలు ఇస్తున్నాయి. దక్షిణ భారతంలో మొదటి సారిగా తమిళనాడులో వాతావరణ శాఖ హిందీలో సూచనలు జారీ చేసింది.
కొత్తగా కాదు..
ఈ అంశంపై చెన్నై వాతావరణ కేంద్రం అధిపతి బి అముధ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని పరిపాలన సర్ధుబాటుగా సమర్థించుకున్నారు. ‘‘హోం వ్యవహారాల శాఖ పరిధిలోని పార్లమెంటరీ సూచనలను అనుసరించి ఇది అక్టోబర్ 2024 నుంచి అమలులో ఉంది’’ అని ఆమె చెప్పారు.
‘‘మార్పులు తదనుగుణంగా అమలు చేయబడ్డాయి. హిందీలో సూచనలు జారీ చేయడానికి చెన్నై కేంద్రంలో ఒక అనువాదకుడిని నియమించారు’’ అని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు గత ఏడాదిలోనే ఇది జరిగిందని చెప్పుకొచ్చారు.
రెండు భాషల విధానం..
ఐఎండీ వివరణ ఇచ్చినప్పటికీ ఈ నిర్ణయం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సీపీఎం పార్టీకి చెందిన మధురై ఎంపీ ఎస్. వెంకటేశన్ దీనిని తమిళనాడు స్వయంప్రతిపత్తి ఉల్లంఘించడమే అని ఖండించారు. ‘‘ఇది మా ద్విభాషా విధానాన్ని, తమిళనాడును హిందీ ఆదేశాల నుంచి మినహయించే అధికార భాషల చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించడమే’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వూను కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రీ కజగం(టీవీకే) కూడా ఈ సూచనలను ఖండించింది. ‘‘కేంద్రం మూడో భాష ఎజెండా ఇక్కడ విజయవంతం కాదు’’ అని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ పరిణామం కేంద్రం- తమిళనాడు మధ్య ఇప్పుడు కొనసాగుతున్న ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నీట్, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ జాతీయ విద్యా విధానంపై చెన్నై పదేపదే న్యూఢిల్లీతో కయ్యానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి చర్యలను సమాఖ్య హక్కులపై అతిక్రమణ అని ద్రవిడ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.
Next Story