కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సీఐడీ నోటీసు..
x

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సీఐడీ నోటీసు..

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అరెస్టు చేస్తారా? హోం మంత్రి ఏమన్నారు. ఇంతకు యడియూరప్పపై ఉన్న కేసేమిటి?


లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సీఐడీ నోటీసు ఇచ్చింది. జూన్ 13న తమ ముందు హాజరుకావాలని కేసును దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కోరింది. ఈ విషయాన్ని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ధృవీకరించారు.

“చట్టం తనపని తాను చేసుకుపోతుంది. జూన్ 15 లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. అంతకంటే ముందు అయన స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసి కోర్టులో హాజరుపరచాలి. ”అని పరమేశ్వరప్ప తుమకూరులో విలేకరులతో అన్నారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా “అవసరమైతే అరెస్టు చేస్తారు. అది నేను చెప్పలేను. CID చెప్పాలి.” అని పరమేశ్వర పేర్కొన్నారు.

ఇంతకు కేసేమిటి?

యడ్యూరప్ప తన నివాసంలో ఫిబ్రవరి 2న తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. మార్చి 14న సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసిన కొన్ని గంటలకే.. కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అలోక్ మోహన్ ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

యడ్యూరప్పపై అభియోగాలు మోపిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఇటు 81 ఏళ్ల యడ్యూరప్ప తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.

ఏప్రిల్‌లో యడ్యూరప్పను కార్యాలయానికి పిలిపించి సిఐడి వాయిస్ శాంపిల్‌ను సేకరించింది. మరోవైపు ఈ కేసులో సీఐడీ తరపున వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) అశోక్ హెచ్.నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ యడ్యూరప్ప కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read More
Next Story