కమ్యూనిస్టులు హిందువులను మభ్య పెడుతున్నారు: ప్రియాంక వాద్రా
x

కమ్యూనిస్టులు హిందువులను మభ్య పెడుతున్నారు: ప్రియాంక వాద్రా

కేరళలో అధికారంలో ఉన్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ప్రస్తుతం హిందువులను మభ్యపెట్టే పనికి పూనుకున్నారని వాయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రా..


2024 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఓటమి తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హిందూ సమాజాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ లోక్‌సభ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.

కాంగ్రెస్‌ నాయకుడు, తన సోదరుడు రాహుల్‌ గాంధీ రాజకీయ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని నియోజకవర్గంలోని కార్నర్‌ మీటింగ్‌లలో ప్రియాంక వాద్రా ఆరోపించారు. కానీ ఇక్కడ తమాషా విషయం ఏంటంటే.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా( మార్క్సిస్ట్) జాతీయా స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ కేరళ లో మాత్రం వీరే ప్రధాన ప్రత్యర్థులు.
కేరళ సీఎంపై ప్రియాంక విమర్శలు..
“ సార్వత్రిక ఎన్నికల సమయంలో, సీఎం విజయన్ CAA సమస్యను చర్చించడం ద్వారా మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ మైనారిటీ వర్గం నుంచి ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు మెజారిటీ వర్గాలను బుజ్జగించడం మొదలుపెట్టాడు' అని ప్రియాంక మీడియాతో అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), జమాత్-ఇ-ఇస్లామీ లేదా JeI లను విజయన్ పోల్చడాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో గత ఐదు ఎన్నికల్లో జేఈఐ సీపీఎంకు మద్దతిచ్చిందని ఆమె తెలిపారు.
CPI-M - జమాత్‌పై..
గత 30 ఏళ్లుగా సీపీఎంకు జేఈఐ మద్దతు లభించింది. జమాత్ సీపీఐ-(ఎం) తో ఉన్నప్పుడు సెక్యులర్‌గా ఉండేవారు కానీ సీపీఐ-(ఎం) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఓ ప్రత్యేక వర్గంగా మారారు. ఇది సిపిఎం అవకాశవాదంగా విమర్శించారు. అన్ని వర్గాలు ఒకదాని తర్వాత ఒకటి సీపీఐ-(ఎం) ను విడిచిపెట్టడం ప్రారంభించాయని ఆమె తెలిపారు. అధికార పార్టీ విభజన, పెట్టుబడిదారీ ఎజెండాను వ్యతిరేకించడం వల్లే రాహుల్ గాంధీ బీజేపీ ఫేవరెట్ టార్గెట్ అయ్యారని అన్నారు.
రాహుల్‌ను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసింది..
" రాహుల్ ప్రేమ, ఐక్యత గురించి మాట్లాడుతుంటే, ప్రధాని నరేంద్ర మోదీ ద్వేషం, విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు." అని చెప్పారు. వాయనాడ్ ఎంపీగా రాహుల్‌కు లభించిన ప్రేమ - మద్దతు దేశం అంతటా పర్యటించడానికి విలువలు, వారసత్వాన్ని తిరిగి పొందే శక్తినిచ్చిందని ప్రియాంక ఉద్ఘాటించారు.



బీజేపీ ద్వేషం ఎజెండా..
“ దేశంలో మైనారిటీలపై నిరంతరం దాడులు చేస్తూనే బీజేపీ ఆ వర్గాలలో భయం, ద్వేషం, విభజనను వ్యాప్తి చేస్తుంది. వారి విధానాలు సామాన్య ప్రజలు, రైతులు లేదా గిరిజన వర్గాలతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయి” అని ఆమె అన్నారు.
గిరిజనుల భూములను బడా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని, కనీస మద్దతు ధరల గురించి తప్పుడు హామీలతో రైతులను మోసం చేస్తున్నారని ప్రియాంక అన్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రియాంక ఎత్తిచూపారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా రాహుల్ సాధ్యమైనదంతా చేశారని ఆమె అన్నారు.
వాయనాడ్ ప్రజలకు ప్రశంసలు..
కొండచరియలు విరిగిపడిన విపత్తు తర్వాత తన పర్యటనను కాంగ్రెస్ నాయకురాలు వివరించింది. వాయనాడ్ ప్రజలు కుల, మత విభేదాలకు అతీతంగా ఒకరికొకరు ఎలా సహకరించుకున్నారో గమనించారు. వాయనాడ్ గొప్ప ప్రతిఘటన చరిత్రను ప్రశంసిస్తూ, “ఈ భూమి బ్రిటిష్ వారి నుంచి నేటి వరకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే వారసత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడి ప్రజలు సామరస్యాన్ని గౌరవిస్తారు. శ్రీ నారాయణ గురు బోధనలను అనుసరిస్తారు. ప్రేమ స్నేహాన్ని కాపాడుకుంటారు. రాజ్యాంగంలోని ప్రధాన విలువలను మోదీ ప్రభుత్వం కూల్చివేస్తోందని ప్రియాంక వాద్రా ఆరోపించారు.
మోదీ ప్రభుత్వంపై..
“ బీజేపీ రాజ్యాంగ విలువలను క్రమపద్ధతిలో తుంగలో తొక్కుతోంది. వారి విధానాలు సంపన్నులకు మాత్రమే ఉపయోగపడతాయి, సాధారణ ప్రజలు లేదా రైతుల పట్ల సానుభూతి లేదు” అని ప్రియాంక అన్నారు.
“నిరుద్యోగం భయంకరమైన స్థాయికి చేరుకుంది, చాలా మంది యువకులకు విద్య ఉన్నప్పటికీ భవిష్యత్తు లేకుండా పోయింది. మణిపూర్‌లో జరిగిన దురాగతాలు దేశమంతటా వ్యాపించిన విద్వేషం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సత్యం కోసం ప్రజలు పాటుపడాలని, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యంగా ఉండాలని ప్రియాంక పిలుపునిచ్చారు.
ప్రియాంక వాయనాడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "ప్రతి ఒక్కరూ నా సోదరుడిపై దాడి చేసినప్పుడు, వాయనాడ్ అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అతనికి దేశం అంతటా నడిచే శక్తిని ఇచ్చింది" అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం- సమానత్వాన్ని సమర్థించే తన మిషన్‌ను కొనసాగించడానికి వాయనాడ్ ప్రజలు రాహుల్‌కు శక్తినిచ్చారని ఆమె వ్యాఖ్యానించారు.
రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత రాహుల్ ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ప్రియాంక వాయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
Read More
Next Story