
డీఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ
2026 అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు కోసమేనా?
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు(డిసెంబర్ 3) తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి, డీఎంకే(DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్(MK Stalin)తో సమావేశమైంది. అయితే సమావేశాన్ని కాంగ్రెస్ ప్రతినిధి బృందం "మర్యాదపూర్వక భేటీ’’గా అభివర్ణించింది. అయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. స్టాలిన్‌ను కలిసిన వారిలో AICC తమిళనాడు ఇన్‌చార్జ్ కీర్తి ఆజాద్ షోడంకర్, TNCC అధ్యక్షుడు K సెల్వపెరుంతగై, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు M రాజేష్ కుమార్ మరియు AICC కార్యదర్శులు సూరజ్ MN హెగ్డే నివేదిత్ అల్వా ఉన్నారు.
స్టాలిన్‌తో సమావేశం తర్వాత సెల్వపెరుంతగై విలేఖరులతో మాట్లాడారు. "స్టాలిన్‌తో మాది మర్యాద పూర్వక భేటీ మాత్రమే. తమిళనాడులో ఇండియా కూటమి గతంలో కంటే బలంగా ఉంది. ఇక సీట్ల సర్దుబాటు విషయానికొస్తే కమిటీ ఏర్పడ్డాక చర్చలు ప్రారంభమవుతాయి, " అని చెప్పారు.
2021లో అప్పటి TNCC చీఫ్ KS అళగిరి నేతృత్వంలో DMK నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి (SPA) 25 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో 18 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికలలో బలమైన ప్రత్యర్థులతో పోటీ పడాలంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ DMKతో కలిసి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సారి పోటీలో బలమైన ప్రత్యర్థులు..
2026 ఎన్నికలలో బలమైన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఒకవైపు విజయ్ చిత్రపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి సొంత పార్టీ తమిళగ వెట్రీ కజగం (టివికె) పెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు బీజేపీ AIADMKతో జతకట్టింది. ఇటీవలి కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) టీవీకే (TVK)చీఫ్ విజయ్(Vijay)తో రెండుసార్లు ఫోన్‌లో నేరుగా మాట్లాడారని టీఎన్‌సీసీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
తాజా పరిణామంపై రాజకీయ విశ్లేషకుడు రవిదరన్ దురైసామి మాట్లాడుతూ.. " సీట్ల పంపకాల చర్చల కమిటీని డీఎంకే ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ కాంగ్రెస్ ఎందుకు తొందరపడుతుందో తెలియాల్సి ఉంది. కూటమిని విడిచిపెట్టకూడదని డీఎంకే అయినా తొందరపడుతుండాలి? మరికొన్ని రోజుల్లో వీటిని సమాధానాలు దొరుకుతాయి," అని అన్నారు.

