గోవుల అక్రమ రవాణాదారులను కాల్చి పడేస్తాం: కర్ణాటక
బుద్దిగా పనిచేసుకొని బతకండన్న కర్ణాటక మంత్రి
ఉత్తర కర్ణాటక జిల్లాలో ఈ మధ్య విపరీతంగా జరుగుతున్న ఆవుల దొంగతనాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇక నుంచి అలాంటి వాటికి చెక్ పెట్టడానికి నిర్ణయించుకుంది. దొంగతనాలు చేస్తున్న వారిపై ఇక నుంచి పోలీసులు కాల్పులు జరపాలని ఆదేశిస్తామని ఇన్ చార్జ్ మంత్రి మంకల్ ఎస్ వైద్య హెచ్చరించారు.
జిల్లాలో ఇక నుంచి అలాంటి కార్యకలాపాలు జరగవని ఆయన హమీ ఇచ్చారు. ఆవులను రక్షించడానికి, వాటిని పెంచుతూ జీవనోపాధి పొందుతున్న వారిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇటీవల హోన్నావర్ సమీపంలోని గర్భిణీ ఆవును వధించిన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో సంబంధిత మంత్రి స్పందించారు.
‘‘చాలా సంవత్సరాలుగా ఆవులను దొంగతనం చేస్తున్నారు. ఇది ఆపాలని, ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని నేను ఎస్పీకి చెప్పాను. మేము ఆవులను పూజిస్తాం. ఈ సాధు జంతువును ప్రేమగా పెంచుకుంటాము. దాని పాలు తాగుతాము’’ అన్నారు. దీని వెనక ఎవరున్న నిర్ధయంగా చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
‘‘అరెస్ట్ లు జరిగిన ఇవి అదుపులోకి రావట్లేదని, ఇక ముందు అలాంటి వారిని నడిరోడ్డు పై కాల్చి చంపాలని ఆదేశాలు ఇస్తాం. ఇది తప్పు కావచ్చు. కానీ పని చేయడం చేత కాక ఇలా గోవులను చంపి తినడం ఏంటీ’’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కావాల్సినంత ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అలాంటి వారికి మేము మద్ధతు ఇవ్వమని చెప్పారు.
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఇప్పుడు మాత్రం తమ పార్టీని లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రతిపక్ష బీజేపీని విమర్శించారు. మేము నిశ్శబ్ధంగా ఉంటే ఎఫ్ఐఆర్ లు, అరెస్ట్ లు ఎందుకు జరుగుతాయని మంత్రి ప్రశ్నించారు. ‘‘నేను ఇక్కడ ఉన్నాను.. అన్ని చర్యలు తీసుకుంటాని అన్నారు.’’
Next Story