
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్‌కు నోటీసు..
కర్ణాటక ఉపముఖ్యమంత్రి ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వాలని కోరిన ఢిల్లీ పోలీసులు..
కర్ణాటక(Karnataka) ఉపముఖ్యమంత్రి(Deputy CM) డీకే శివకుమార్(D K Shivakumar ) కు ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈ ఏడాది అక్టోబర్ 3న నమోదైన నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)కు సంబంధించి శివకుమార్ వద్ద కీలక సమాచారం ఉందని నోటీసులో పేర్కొంటూ.. తన ఆర్థిక లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. డిసెంబర్ 19వ తేదీ లోపు తమ ముందు హాజరు కావాలని లేదా తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని శివకుమార్‌కు సమన్లు జారీ చేశారు.
‘కోర్టులో తేల్చుకుంటాం..’
అయితే తనను వేధించడం కోసమే నోటీసు ఇచ్చారని, దీనిపై చట్టప్రకారం పోరాడతానని డీకే పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ED ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు, ప్రత్యేక పోలీసు దర్యాప్తు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
"ఇది నాకు షాకింగ్‌గా ఉంది. నేను EDకి అన్ని వివరాలు ఇచ్చాను. ED నన్ను నా సోదరుడిని (మాజీ MP DK సురేష్) కూడా పిలిచింది. ఇది మా (పార్టీ) సంస్థ (నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా). మేం కాంగ్రెస్ సభ్యులం. సంస్థకు మద్దతు ఇచ్చాం. దాగుడుమూతలు లేవు, ”అని శివకుమార్ అన్నారు.
బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, "ED చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు (ఢిల్లీ పోలీసులు) కేసు నమోదు చేయవలసిన అవసరం లేదు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతాం." అని పేర్కొన్నారు.
డిసెంబర్ 19న హాజరు అవుతారా? అని అడిగిన ప్రశ్నకు.. "నిన్ననే నాకు నోటీసు వచ్చింది. నేను దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఏం చేయాలో ఆలోచిస్తా," అని ఆయన జోడించారు.
13 ఏళ్ల క్రితం కేసు..
నేషనల్ హెరాల్డ్ కేసు 2012 నాటిది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు స్థాపించారు. దీని ప్రచురణకర్త AJL. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోసానికి పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి జూన్ 26, 2014న స్థానిక కోర్టులో పిటీషన్ వేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో నేషనల్ హెరాల్డ్ ప్రచురణ ఆగిపోయింది. అప్పటికే కంపెనీ కాంగ్రెస్ పార్టీ నుంచి రూ.90 కోట్ల రుణం తీసుకుంది. 2010లో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికి కొన్ని నెలల ముందు స్థాపించారు. ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉన్నారు. కంపెనీలో వారిద్దరికీ చెరొక 38 శాతం వాటా ఉంది. మిగతా 24 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పాత్రికేయుడు సుమన్ దూబే, పారిశ్రామికవేత్త శాం పిట్రోడాకు ఉంది. కేవలం రూ.90 కోట్ల రుణం ఇచ్చి 2వేల కోట్ల విలువైన AJL ఆస్థులను కొట్టేయాలని చూశారన్నది సుబ్రమణియన్ స్వామి వాదన.

