డిప్యూటీ సీఎం పదవుల గురించి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ఏమన్నారు?
x

డిప్యూటీ సీఎం పదవుల గురించి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ఏమన్నారు?

కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఎత్తుగడలు మళ్లీ మొదలయ్యాయా? కొత్తగా మరికొంతమందికి ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించాలన్న ప్రతిపాదన దేనికి సంకేతం?


కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అంతర్గత పోరు మళ్లీ మొదలైనట్లుంది. డిప్యూటీ సీఎం పదవిని మరికొంతమందికి కేటాయించాలన్న ప్రతిపాదన అందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కొందరు మంత్రులు అదే ప్రతిపాదనను మీడియాతో పంచుకున్నారు. అయితే పత్రికల వాళ్లతో చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని గట్టిగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్.

ప్రస్తుతం వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన శివకుమార్ మాత్రమే ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నేతలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు.

"మీడియాతో మాట్లాడే వారు హైకమాండ్‌ దగ్గరకు వెళ్లండి.. ఏం కావాలో వివరించండి. పత్రికల వాళ్లకు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో నేను కూడా మీడియాతో మాట్లాడను’’ అని శివకుమార్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

కేపీసీసీ చీఫ్‌ని మార్చాలని పార్టీలో కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు శివకుమార్‌ సమాధానమిస్తూ.. ‘‘చాలా సంతోషం. సమయాన్ని వృథా చేయకుండా అడగాల్సిన వాళ్లను అడగండి ..నాకు ఏ అభ్యంతరం లేదు." అని సమాధానమిచ్చారు.

ఇటు అదనపు ఉప ముఖ్యమంత్రి పదవులు కావాలని బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులను కోరినట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రకటనలు ప్రభుత్వంపైనా, పార్టీపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని పదవి ఆశిస్తున్న మంత్రి కేఎన్ రాజన్నతో సిద్ధరామయ్య ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

శివకుమార్‌ను అదుపులో ఉంచేందుకు సిద్ధరామయ్య శిబిరం వేసిన ప్లాన్‌లో భాగమేనని కాంగ్రెస్‌లోని ఒక వర్గం అభిప్రాయపడింది. సిద్ధరామయ్య సన్నిహితులైన సహకార శాఖ మంత్రి రాజన్న, గృహనిర్మాణ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, పబ్లిక్ వర్క్స్ మంత్రి సతీష్ జార్కిహోళి డిప్యూటీ సీఎం రేసులో ఉండమనే అందుకు కారణం.

ఇదిలా ఉండగా శివకుమార్ శిబిరంలోని నేతలు కూడా తమ నాయకుడికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని చన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వి.శివగంగ బుధవారం పార్టీని కోరారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చడం గురించి రాజన్న ఇలా అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మూడు విషయాలను ప్రకటించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ పార్లమెంటు ఎన్నికల వరకు డిప్యూటీ సీఎంగా శివకుమార్ కొనసాగుతారని చెప్పారు.ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story