
Karnataka: ‘ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది’
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల(Dharmastala) ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(D K Shivakumar) అన్నారు. మతం విషయంలో తాము అందరినీ సమానంగా చూస్తామని, మతపర ప్రదేశాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ అనుమతించదని స్పష్టం చేశారు. SIT దర్యాప్తు చేస్తున్న ఈ కేసు గురించి తనకు అవగాహన ఉందన్నారు. ఆలయ పవిత్రతను నాశనం చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఎమ్మెల్యేలు కోరుతున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
13 చోట్ల తవ్వకాలు.. రెండు అస్థిపంజరాలు..
గతంలో ధర్మస్థల ఆలయంలో పనిచేసిన పారిశుధ్య కార్మికుడొకరు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పనిచేస్తున్నపుడు 1995 నుంచి 2014 మధ్యకాలంలో చాలామంది మహిళలు, బాలికల మృతదేహాలను ఖననం చేశానని, పశ్చాత్తాపం వెంటాడుతుండడంతో ఇన్నేళ్ల తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. గతంలోనూ చాలాసార్లు పోలీసులకు చెబుదామనుకున్నా.. తనను కొంతమంది బెదిరించారని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత ఈ కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు అప్పగించింది. దర్యాప్తులో భాగంగా పారిశుధ్య కార్మికుడు చూయించిన 13 చోట్ల తవ్వకాలు జరిపారు. ఆలయ పరిసరాల్లో, నేత్రావది నది ఒడ్డున చేపట్టిన తవ్వకాలు రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాలు బయటపడ్డాయి.