ఢిల్లీ పర్యటనపై డీకే శివకుమార్ వివరణ ఏమిటి?
x

ఢిల్లీ పర్యటనపై డీకే శివకుమార్ వివరణ ఏమిటి?

'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక (Karnataka) ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీ(Delhi) వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేఖరులకు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. "నేను ఒక పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మా పార్టీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి దాదాపు 300 మంది నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి తీసుకెళ్లాలి. వారిని రైల్లో తీసుకెళ్లడం, వసతి కల్పించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్, AICC కార్యదర్శికి అప్పగించారు. ఈ విషయాన్ని పార్టీ ఆఫీస్ బేరర్లతో చర్చించి తిరిగి వస్తున్నా ’’ అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అధికార పోరు నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్, ఇతర పార్టీ సీనియర్లను కలిశారనే వార్తలను డీకే తోసిపుచ్చారు.


ఇప్పటికి అంతా ప్రశాంతం..

ఇద్దరు నాయకులు రెండు అల్పాహార సమావేశాలతో తమ ఐక్యతను బహిరంగపర్చినా.. సీఎం కుర్చీ కోసం మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం ఐక్యంగానే ఉన్నామని చెబుతున్నా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar) మధ్య కొనసాగుతున్న అధికార పోరుపై ఊహాగానాలు ఇంకా ఆగలేదు.


8 నుంచి బెళగావి శాసనసభ సమావేశాలు..

డిసెంబర్ 8 నుంచి బెళగావి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత శీతాకాల సమావేశాల గురించి చర్చించడానికి గురువారం సాయంత్రం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అల్పాహార విందు ఇద్దరి మధ్య విభేదాలు లేవని చెప్పడానికి, అలాగే ప్రస్తుతానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న సంకేతం పంపడానికి ఇద్దరి భేటీ జరిగినట్లు సమాచారం.


సమావేశం వాయిదా..

డిసెంబర్ 8న ఢిల్లీలో రాష్ట్ర ఎంపీలు, ప్రతిపక్ష నాయకులతో సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడిందని కూడా డీకే చెప్పారు. కర్ణాటకకు చెందిన పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్నందున సమావేశం వాయిదా పడినట్లు ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story