డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కావాలి: వొక్కలిగ పీఠం
x
డీకే శివకుమార్ తో నిర్మలానందనాథ స్వామి

డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కావాలి: వొక్కలిగ పీఠం

అనేక మంది భక్తులు, సమాజం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన నిర్మలానంద భారతీ స్వామి


కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కావాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, సమాజంలోని భావన కూడా అని ఒక్కలిగ పీఠాథిపతి నిర్మలానందనాథ స్వామిజీ అన్నారు.

శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు అని, ఆయన చేసిన సేవలను ఉటంకిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆదిచుంచున గిరి మఠం పీఠాధిపతి విశ్వాసం వ్యక్తం చేశారు. దీనితో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. రాష్ట్ర రాజకీయాలలో పీఠాల ప్రభావం చాలా ఎక్కువ.

నవంబర్ 20న ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను దాటడంతో అధికార కాంగ్రెస్ లో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు ఢిల్లీ వేదికగా బలప్రదర్శనకు దిగాయి.

2023 లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని కొన్నివార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిని పార్టీ అధికారికంగా ధృవీకరించలేేదు. డీకే శివకుమార్ పాత మైసూర్ ప్రాంతంలో బలమైన కమ్యూనిటీ అయిన ఒక్కలిగకు నాయకుడు.

‘‘ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల గురించి నేను మీడియాలో చూస్తున్నాను. చదువుతున్నాను. ఈ మఠం ఒక్కలిగ సమాజానికి విశ్వాస కేంద్రం.ఇతర సామాజిక వర్గాల వారికి కూడా గొంతుకగా ఉంది.
ముఖ్యమంత్రి విషయంపై శివకుమార్ నాతో ఏం మాట్లాడలేదు’’ అని పీఠాధిపతి విలేకరులతో అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన జేడీ(ఎస్) బీజేపీ, కాంగ్రెస్ వంటి అన్ని ప్రధాన పార్టీలలో ఒక్కలిగ సమాజం నాయకులను అందించిందని ఆయన పేర్కొన్నారు.
‘‘2023 అసెంబ్లీ ఎన్నికలలో మనలలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని ఆశతో ఆ కమ్యూనిటీ చెందిన ప్రజలు ఓటు వేశారు. అప్పుడు అది జరగలేదు. రెండున్నర సంవత్సరాల తరువాత అది జరుగుతుందని ఆశ.
కానీ ఇప్పుడు అది అసంభవంగా కనిపిస్తోంది. అలా జరగకపోతే, వేలాది మంది మఠం భక్తులను బాధపెడుతుంది’’ అన్నారు. నాయకత్వ గందరగోళం రాష్ట్రానికి అనారోగ్యకరమని, స్పష్టత ఇవ్వడం కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యత అని ఆయన అన్నారు. ‘‘రెండున్నర సంవత్సరాల తరువాత శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి. ఇది నా అభిప్రాయం, భక్తుల అభిప్రాయం’’ అని ఆయన అన్నారు.
‘‘పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేసిన శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను రాష్ట్ర అభివృద్ధికి సేవ చేయడానికి అనుమతించాలి.
కెంగల్ హనుమంతయ్య, కేసీ రెడ్డి, హెచ్ డీ దేవేగౌడ, ఎస్ఎం కృష్ణ, సదానంద గౌడ, హెచ్ డీ కుమారస్వామి వంటి ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధికి సేవ చేయడానికి అనుమతించాలి’’ అన్నారు.
తన విజ్ఞప్తిని మన్నించాలని, మిగిలిన పదవీకాలం శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేయడం భక్తుల కోరికలను ప్రతిబింబిస్తుందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన విధేయత, ప్రయత్నాలను గుర్తిస్తుందని అన్నారు.
Read More
Next Story