ఉచిత ల్యాప్ టాప్ పథకాన్ని ప్రారంభించిన డీఎంకే
x
విద్యార్థినికి ల్యాప్ టాప్ అందజేస్తున్న సీఎం ఎంకే స్టాలిన్

ఉచిత ల్యాప్ టాప్ పథకాన్ని ప్రారంభించిన డీఎంకే

ఎన్నికల గిమ్మిక్కుగా ప్రతిపక్షాల విమర్శలు


తమిళనాడు ప్రభుత్వం కళాశాల విద్యార్థుల కోసం చాలాకాలంగా నిలిపివేసిన ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. ఆర్థిక పరిమితుల కారణంగా దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యక్రమం పున: ప్రారంభించారు.

‘‘ఉలగం ఉంగల్ కైయిల్’’(మీ చేతుల్లో ప్రపంచం) గా పిలువబడే ఈ పథకం చెన్నై ట్రేడ్ సెంటర్ లో విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీతో ప్రారంభమైంది. పొంగల్ కానుకలు ఇవ్వడం, మహిళా హక్కుల కార్యక్రమాలను విస్తరించడం, ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హమీ ఇచ్చిన పెన్షన్ పథకం వంటివి తాజాగా డీఎంకే ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ఏప్రిల్- మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

భవిష్యత్ తరం విద్య..
యువతకు సాధికారత కల్పించడంలో పథకం ముఖ్యపాత్ర పోషిస్తుందని స్టాలిన్ అన్నారు. ‘‘ ఈ ల్యాప్ టాప్ కేవలం బహుమతి కాదు. ఇది ఖర్చు కాదు. భవిష్యత్ తరం విద్యలో పెట్టుబడి’’ అని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ పరికరాలను వినోదం కాకుండా తమ కెరీర్ లకు లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని కోరారు.
తల్లులు, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం, పొంగల్ బోనస్, పాఠశాల అల్ఫాహార కార్యక్రమాలు, ప్రపంచ పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
ఉచితంగా ల్యాప్ టాప్ పథకం మొదట 2011 లో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2021 వరకూ రూ. 7,750 కోట్లు వెచ్చించి 52 లక్షల విద్యార్థులకు ల్యాప్ టాప్ అందించింది. అయితే 2021 లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం కోవిడ్ కారణంతో పాటు జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందనే కారణంతో ఈ పథకం నిలిపివేసింది.
జెన్ జెడ్ లక్ష్యంగా పథకాలు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జెన్ జెడ్ యువత ఓట్లను పొందడానికి డీఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని పున: ప్రారంభించిందని సీనియర్ జర్నలిస్ట్ టీ రామకృష్ణన్ విశ్లేషించారు.
రాష్ట్రం తన 2025-26 బడ్జెట్ లో రెండు దశల్లో 20 లక్షల ల్యాప్ టాప్ లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. మొదటి దశల్లో ఇంజనీరింగ్, కళలు, సైన్స్, వైద్య, వ్యవసాయం, పాలిటెక్నిక్ విభాగాలలో పది లక్షల మంది విద్యార్థులు అందుబాటులో ఉన్నారు.
డెల్, హెచ్పీ, ఏసర్, ఇతర బ్రాండ్ల ల్యాప్ టాప్ లను ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పథకం పూర్తి అవుతుందని భావిస్తున్నారు. దీనికి రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
డీఎంకే అమలు చేస్తున్న ఇతర ముఖ్యమైన పథకాలు కలైంజర్ మగలిర్ ఉరిమై తొగై( మహిళల అర్హత పథకం), పుధుమై పెన్న్(బాలికల విద్యార్థుల కోసం) తమిళ పుధల్వన్(బాలుర విద్యార్థుల కోసం), ముఖ్యమంత్రి అల్పహార పథకం వంటి వాటితో పాటు పొంగల్ బహుమతులు ఉన్నాయి. ప్రతిపక్షాలు వీటిని ఎన్నికల జిమ్మిక్కులుగా పేర్కొన్నారు.
ఉచిత ల్యాప్ టాప్ పథకం: రెండేళ్లలో 20 లక్షల మంది కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. మొదటి దశలో పది లక్షల మందితో ప్రారంభమవుతుంది. లబ్దిదారులలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులలోని వారికి ప్రాధాన్యత ఉంటుంది.
కలైంజర్ మగలిర్ ఉరిమై తొగై: అర్హులైన మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 1000 అందిస్తోంది. మే 2025 నాటికి ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 1.15 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీల డీఎంకే 2021 మ్యానిఫెస్టోలో వాగ్థానం చేసినట్లు చేయడం లేదని అన్నారు.
ఫుధుమై పెన్ పథకం: ప్రభుత్వ పాఠశాలలో 6-12 తరగతులు పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించే బాలికలకు నెలకు రూ. 1000 అందిస్తుంది. ఇది 2025 మధ్య నాటికి 4.9 లక్షల మంది బాలికలకు సహాయం చేసింది. ప్రభుత్వ సహాయక తమిళ మాధ్యమ పాఠశాలలకు అదనంగా జత చేయడంతో దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది.
ముఖ్యమంత్రి అల్ఫాహార పథకం: ఆకలిని ఎదుర్కోవడానికి, హజరును మెరుగుపరచడానికి ప్రాథమిక పాఠశాల పిల్లలకు పోషకమైన ఉదయం భోజనం అందించడం. ఇది ప్రభుత్వం పాఠశాలలో 17.53 లక్షల మంది విద్యార్తులకు చేరుతుంది.
పొంగల్ గిప్ట్ ప్యాకేజీ: కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో బియ్యంతో పాటు రూ. 3 వేల నగదు, అదనంగా కిలో ముడి బియ్యం, కిలో చక్కెర, చెరకు ఇస్తారు. శ్రీలంక తమిళ పునరావాస శిబిరాల్లో ఉన్న కుటుంబాలు సహ 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది ఆర్థిక పరిమితుల కారణంగా 2025 లో నిలిపివేశారు. తాజాగా మరోసారి అమలు చేస్తున్నారు.
తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ పథకం: జనవరి 3, 2026 ప్రారంభించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతంలో 50 శాతం పెన్షన్ హమీగా ఇస్తుంది.
సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యం పెంపు ఉంటుంది. ఇది ఏప్రిల్ 1, 2004 తరువాత కాంట్రీబ్యూటరీ సిస్టమ్ కింద చేరిన వారికి వర్తిస్తుంది. జనవరి 2027 అమలులోకి వస్తుంది. లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా పాత పెన్షన్ పథకం పునరుద్దరించాలనే 20 సంవత్సరాల డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చినట్లు అయింది.
సంక్షేమం.. ఆర్థిక సమతుల్యం..
భారత్ లో రెండో అతిపెద్దదైన రాష్ట్రమైన తమిళనాడులో ఆర్థిక వ్యవస్థ 2025-26 లో సంవత్సరానికి రూ.35.67 లక్షల కోట్ల జీఎస్డీపీగా అంచనా వేశారు. తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ.
అయితే రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోంటోంది. 2025 లో రెవెన్యూ వసూళ్లు రూ. 3,31,569 కోట్లుగా అంచనా వేయగా, దీనిలో సొంత పన్ను ఆదాయం రూ. 2,20,895 కోట్లు, జీఎస్టీ 58,022 కోట్లుగా ఉన్నాయి.
పన్నేతర ఆదాయం రూ. 28,819 కోట్లు, కేంద్ర బదిలీల, గ్రాంట్లు 81,855 కోట్లుగా ఉంది. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందని రామకృష్ణన్ పేర్కొన్నారు.
రాష్ట్ర అప్పులు జీఎస్ డీపీలో మార్చి 2026 నాటికి 9.29 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది జీఎస్ డీపీలో 26.07 శాతంగా ఉందని చెప్పారు. ద్రవ్య లోటు జీఎస్ డీపీలో 3 శాతం, రెవెన్యూలోటు రూ. 41,635 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. వడ్డీ చెల్లింపులు రెవెన్యూ వసూళ్లలో 21 శాతం ఆక్రమించాయి.
బాధ్యతాయుతమైన చర్యలు..
ఈ పథకాలు రాబోయే ఆరు ఏడు సంవత్సరాల పాటు ఆర్థిక భారంగా కలిగిస్తాయని చెప్పారు. ఎన్నికలకు ముందు అమలు చేయడంలో తప్పులేదని రామకృష్ణ అంటున్నారు.
బీహర్ లో ఇటువంటివి అమలు చేశారని చెప్పారు. ఎన్నికల ముందు ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం మరోసారి అధికారంలోకి రావడానికి ప్రకటించిన తాయిలాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటమి భయం.. పళని స్వామి
ఉచిత ల్యాప్ టాప్ సహ ఇతర పథకాలను ఓటమి భయంతోనే డీఎంకే ప్రారంభించిందని పళని స్వామి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి కచ్చితంగా ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
ఉచిత ల్యాప్ టాప్ పథకం దివంగత జయలలిత ప్రారంభించారని చెప్పారు. 2021 లో ఈ పథకం నిలిపివేశారని, దాదాపు నాలుగు సంవత్సరాలు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించలేదని విమర్శించారు.
‘‘ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మా పథకాన్ని హడావుడిగా పునరుద్దరించి, క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు’’ అని పళని స్వామి ఆరోపించారు.
2026 లో అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే ఎన్నికల లక్ష్యాలు లేకుండా విద్యార్థుల నిజమైన సంక్షేమం కోసం అసలు ల్యాప్ టాప్ పంపిణీని పూర్తిగా పునరుద్దరిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
ప్రభుత్వం వీటిని కేవలం ప్రజాకర్షణ కాదు, మానవ మూలధనంలో పెట్టుబడులని వాదిస్తోంది. తమిళనాడు ఆర్థికంగా ఎదురుగాలిని ఎదుర్కొంటున్నప్పుడూ నిజమైన ప్రభావం బ్యాలెట్ బాక్స్ లో బయటపడుతోంది.
Read More
Next Story