నీటిని ‘నీళ్ల’లాగా ఖర్చు చేస్తే... అక్కడ ఇక నుంచి ఫైన్
x

నీటిని ‘నీళ్ల’లాగా ఖర్చు చేస్తే... అక్కడ ఇక నుంచి ఫైన్

నీటి ఎద్దడితో భారత ఐటీ రాజధాని విలవిలలాడుతోంది. బిందెడు నీళ్లకు బండెడు కష్టాలు పడుతున్నారు. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా నీటిని వాడుతున్నారనే ఫిర్యాదుతో..


కరువుతో కర్నాటక, నీటికొరతతో బెంగళూర్ అల్లాడుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం ట్యాంకర్ల వెంట ప్రజలు పరుగులు తీస్తున్నారు. నీటి కొరత కారణంగా స్కూళ్లు మూసివేశారు.. ఐటీ ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోం చేయాలని కంపెనీలన్నీ సూచించాయి. నగరంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే కొంతమంది మాత్రం నీటిని ఇష్టారాజ్యంగా వాడుతున్నారు.

నీటిని పొదుపు చేయాలని ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు. కార్లు కడగడం, తోట పని కోసం, అలంకరణ కోసం నీటిని వాడడం వంటి పనులు చేయడంతో బెంగళూర్ నీటిసరఫరా, మురుగునీటి బోర్డు(BWSSB) అలాంటి వారిపై కొరడా ఝలుపించింది.

‘నగరంలో నీటి కొరత కొనసాగుతున్న తరుణంలో, అనవసర అవసరాలకు తాగునీరందించకూడదనే ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించాం’ అని ఓ అధికారి ప్రకటించారు. రెండు వారాల క్రితం ఈ ఉత్తర్వు జారీ చేశారు.

సోషల్ మీడియా ద్వారా బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)కి వచ్చిన అనేక ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర అనవసరమైన అవసరాల కోసం త్రాగునీటిని ఉపయోగించినందుకు 22 కుటుంబాల నుంచి రూ.1.1 లక్షల జరిమానా వసూలు చేసింది.

బోర్డు వెల్లడించిన డేటా ప్రకారం, ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిలో అత్యధికంగా నగరంలోని ఆగ్నేయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. ఈ విభాగం నుంచి కనీసం 12 ఫిర్యాదులు అందడంతో వారి నుంచి రూ. 60 వేలు జరిమానాగా వసూలు చేశారు. అదే విధంగా తూర్పు డివిజన్‌లో రూ.15 వేలు జరిమానా, నైరుతి డివిజన్‌లో మరో రూ.15 వేలు జరిమానా విధించి వసూలు చేశారు.
మార్చి 7న, BWSSB బెంగళూరు నగరంలో వాహనాలను శుభ్రం చేయడానికి, భవనాలు, రోడ్ల నిర్మాణానికి, వినోద ప్రయోజనాల కోసం లేదా ఫౌంటైన్‌ల వంటి అలంకరణల కోసం త్రాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రకారం మాల్స్‌, సినిమా హాళ్లలో నీటిని తాగేందుకు మాత్రమే అనుమతించారు.
''ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే, మొదటి సారి చేసిన నేరానికి రూ. 5,000 జరిమానా విధిస్తారు. రెండో సారి ఇదే తప్పు చేస్తే రోజుకు రూ. 500 అదనపు జరిమానాతో రూ. 5,000 జరిమానా విధించబడుతుంది,'' అని పేర్కొంది.
ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తున్నట్లు తేలితే వెంటనే బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు కాల్ సెంటర్ 1916కు తెలియజేయాలని అధికారులు కోరారు.
Read More
Next Story