ఎన్నిక‌ల వేళ! త‌మ్ముళ్ళూ స్పీడ్ వ‌ద్దు!  రోడ్లపై చావు డప్పు..గంటకో 20..
x
ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే లాస్య కారు..

ఎన్నిక‌ల వేళ! త‌మ్ముళ్ళూ స్పీడ్ వ‌ద్దు! రోడ్లపై చావు డప్పు..గంటకో 20..

దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు.. ప్రతి గంటకు 20, ప్రతి రోజుకు సగటున 462 మంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. అయినా మన రూటు సెపరేటే అంటే..


దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు.. ప్రతి గంటకు 20, ప్రతి రోజుకు సగటున 462 మంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న వారి సంఖ్య ఇండియాలోనే ఎక్కువగా ఉందని 2023లో విడుదల చేసిన ఐక్యరాజ్యసమితీ నివేదిక చెబుతోంది. 2022లో ఇండియాలో 1.68 లక్షల మంది చనిపోయారు. 2012 తో పోల్చి చూసినపుడు ఈ సంఖ్య 1.10 లక్షలు ఉంటే ఇప్పుడు అంటే 2023 ముగిసే నాటికి మరో 11.59 శాతం పెరిగిందన్నది నిజం.

ప్రమాదమంటేనే అనుకోకుండా జరిగేది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఉజ్వల భవిష్యత్ ఉన్న యువతి. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆమె బతికి ఉండే వారేమో అనేది ఊహజనిత ప్రశ్నే అయినా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. అయితే ఈ మధ్య విజయవాడలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు జేడీ ఎలియాస్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఓ పిలుపు ఇచ్చారు. లాస్య సంఘటనకు ఈ పిలుపుకు సంబంధం లేకపోయినా సరిగ్గా రెండు రోజుల కిందట ఆయన విజయవాడలో ‘ఎన్నిక‌ల వేళ! త‌మ్ముళ్ళూ స్పీడ్ వ‌ద్దు, సేఫ్ రైడ్ చాలా ముఖ్యం’ అంటూ ఓ ర్యాలీ నిర్వహించారు. యువ‌త‌కు చాలా జాగ్ర‌త్త‌లు చెప్పారు.

జేడీ లక్ష్మీనారాయణ ఏమి సూచించారంటే...

“రోడ్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించండి. ఏటా ఎంతో మంది రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంగవికలురైన వారి కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ధనవంతులైన, పేదలైన బాధ ఒకటే. అందువల్ల మీ ప్రాణాలపై మీకే తీపి ఉండాలి” అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఆ మాట అనడమే కాకుండా రోడ్డుపై ఎలా డ్రైవ్ చేయాలో కూడా ఆయన స్వయంగా విజ‌య‌వాడ‌లోని బి.ఆర్.టి.ఎస్. రోడ్ లో రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండిపై హెల్మెట్ ధ‌రించి సేఫ్ రైడ్ చేసి యువకులకు చూపెట్టారు. హెల్మెట్ ధరించడం మొదలు బండ్లు స్పీడ్ గా పోతే ఎంత నష్టమో తెలియజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప‌లువురు యువ‌కులు హెల్మెట్ ధ‌రించి బుల్లెట్ బండ్ల‌పై ఆయ‌న‌ను అనుస‌రించారు.

ఈలెక్కలు వింటే గుండెలు పగులుతాయి...

”ఏటా 4.60 ల‌క్ష‌ల మంది రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందుతున్నారు. ఇందులో అత్య‌ధికం యువ‌త‌, మ‌ధ్య వ‌య‌స్కులే. ఇది చాలా బాధాక‌రం. దేశ మాన‌వ వ‌న‌రుల్లో యువ‌త కీలకం. వారి భ‌ద్ర‌త మ‌న బాధ్య‌త. యుక్తవయసులో ఓ యువతీ, యువకుడు చనిపోతే ఆ కుటుంబానికే కాదు దేశానికీ నష్టమే. పునరుత్పత్తి క్రమం దెబ్బతింటుంది. తనను నమ్ముకున్న కుటుంబం బజారున పడుతుంది. ఆర్ధికంగా చాలా నష్టపోతాం” అని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంకెల్లో సంఖ్యల్లో చూపించారు.

ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు...

వ‌చ్చే ఎన్నిక‌ల సీజ‌న్లో యువ‌త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, బైక్ ల‌పై స్పీడుగా వెళ్ళి ప్ర‌మాదాలు కొనితెచ్చుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీని ప్రతి పల్లె, పట్టణంలో నిర్వహించాలని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ నిర్ణయించింది. ఇదేదో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ర్యాలీలు కావని, ప్రజలను చైతన్య పరిచి సక్రమ మార్గంలో పెట్టాలన్నదే ధ్యేయమని జేడీ లక్ష్మీనారాయణ చెప్పడం గమనార్హం.

Read More
Next Story