వర్గ శత్రు నిర్మూలనంటే కమ్యూనిస్టు మిత్రుల్ని చంపడమా కామ్రేడ్!
x
హత్యకు గురైన బ్రహ్మయ్య (ఫైల్ ఫోటో)

వర్గ శత్రు నిర్మూలనంటే కమ్యూనిస్టు మిత్రుల్ని చంపడమా కామ్రేడ్!

చర్చల ద్వారా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడం, మెజారిటీ నిర్ణయాన్ని పాటించడం వంటి నిర్మాణ సూత్రాలకు కట్టుబడి ఉండాల్సిన కమ్యూనిస్టు గ్రూపులు చంపుకోవడమేమిటీ?


కమ్యూనిస్టు వ్యూహాలలో వర్గ శత్రు నిర్మూలన ఒకటి. ప్రపంచ కార్మికులారా ఏకంకండని చెప్పే కమ్యూనిస్టు గ్రూపులు వాళ్లలో వాళ్లు ఏకం కావడానికి బదులు వాళ్లలో వాళ్లని నిర్మూలించుకోవడం దేనికి సంకేతం.

సీపీఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) నేత నాదెండ్ల బ్రహ్మయ్యను ఆ పార్టీ నాయకుడు చంద్రన్న, ఇతర సభ్యులు హత్య చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీలో వచ్చిన విభేదాలే బ్రహ్మయ్య హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం మొదలు న్యూడెమోక్రసీ వరకు ఖండన మండనలు చేస్తున్నాయి. బ్రహ్మయ్యను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో చంపేసి పెదకాకాని సమీపంలోని ఓ మురికి కాలువలో పడేసి వెళ్లిపోయారు.

అసలేం జరిగింది?


కమ్యూనిస్టు గ్రూపుల్లో సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా చాల చిన్న గ్రూపు. గుంటూరు జిల్లాలో అక్కడక్కడా ఈపార్టీకి కొన్ని శాఖలు ఉన్నాయి. పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా గతంలో ఈ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అంగడి చెన్నయ్య లాంటి నాయకులు కూడా గతంలో హత్యలకు గురయ్యారు. ఈ పార్టీ కూడా ఇటీవల రెండు ముఠాలు చీలిపోయింది. చీలిక వర్గమైన సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి బ్రహ్మయ్య. ఆయన ఇప్పుడు చాలా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ఎవరో చంపి ఓ మురికి కాలువలో పడేసి వెళ్లిపోయారు. పార్టీ ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగానే తన భర్తను హత్య చేశారని ఆయన భార్య ఆరోపించారు. గుంటూరులో బ్రహ్మయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది. ఆ తరువాత గుంటూరు అంబేద్కర్ భవన్ లో సంతాపసభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకులు కె.పోలారి, గుంటూరు జిల్లా నాయకులు మోజెస్, వేల్పూరు నర్సింహారావు, పి.డి.ఎస్.యు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, విరసం నేత ప్రసాద్, మరికొన్ని విప్లవ సంఘాల నాయకులు ఈ దారుణ హత్యను ఖండించారు. భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

లెక్కల చూసుకుందామని పిలిచి హత్య చేశారా?

సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి బ్రహ్మయ్యని చంపింది ఎవరు అనేది బయటకి రాలేదు. చంద్రన్న వర్గానికి చెందిన న్యూడెమోక్రసీ పార్టీ వారే లెక్కలు చూసుకోవడానికి బ్రహ్మయ్యని పిలిచినట్లు కుటుంబ సభ్యులు బహిరంగ ప్రకటన చేశారు. బ్రహ్మయ్య 40 ఏళ్లుగా విప్లవోద్యమంలో భాగస్వామిగా ఉన్నారు. వర్గ శత్రు నిర్మూలన సిద్ధాంతమంటే తోటి సహచరుల్ని చంపడమా అనే ప్రశ్నఇప్పుడు తలెత్తింది. బ్రహ్మయ్య గతంలో పీడీఎస్ యూ లో పని చేసారు. రైతు కూలీ సంఘంలో పనిచేస్తూ పల్నాడు ఏరియాలో దేవాలయ భూములు వందల ఎకరాలపై పేదలకు సాగుహక్కుల కోసం పోరాడారు. అనేక సార్లు అరెస్టు అయి నిర్బంధాలకి గురైయ్యారు.

పేదవాళ్ళు ఎక్కడ కష్టాలు పడుతున్నా, అక్కడకి వెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి ముందుండేవాడు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా పేదలు ముఖ్యంగా దళితుల సమస్యలపై స్పందిస్తూ కార్యాచరణ సాగిస్తున్నాడు. ఇప్పటికీ చంద్రన్న పిలిస్తే పార్టీలో పని చేసే ఆలోచనలో ఉన్నారు. తనని చంద్రన్న కార్యకర్తలే మాట్లడానికి పిలిస్తే వెళ్లాడనేది బయటపడింది. చంద్రన్న పార్టీ వారే చంపారని అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు వారు ఆరోపిస్తున్నారు. అయినా బ్రహ్మయ్య హత్యపై నేటి వరకు చంద్రన్న పార్టీ రాష్ట్ర కమిటీ స్పందించలేదు. ‘బ్రహ్మయ్యను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. బ్రహ్మయ్యని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని సీ.పీ.ఐ (యం.యల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు ఖండించారు. దళితుల్నే టార్గెట్ చేసి చంపేస్తారా అని ప్రముఖ న్యాయవాది వై.కోటేశ్వరరావు నిరసించారు. ఎర్రజెండాల ముసుగులో మాలమాదిగలను పొట్టన పెట్టుకుంటున్న న్యూడెమోక్రసీని బహిష్కరించాలన్నారు విరసం నేత సీఎస్ఆర్ ప్రసాద్. ఆ పార్టీలో ఉండే దళితులు వెంటనే బయటకు రావాలని కోరారు.

ఏమిటీ న్యూ డెమోక్రసీ గ్రూపు...


తరిమెల నాగిరెడ్డి నుంచి విడిపోయిన చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన గ్రూపుల్లో న్యూ డెమోక్రసీ ఒకటి. 1984లో చండ్ర పుల్లారెడ్డి చనిపోయిన తర్వాత ఈ పార్టీ రెండుగా చీలింది. ఒక గ్రూపునకు పుల్లారెడ్డి భార్య నిర్మల నాయకత్వం వహించారు. దానిపేరు సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా, రెండో గ్రూపు సీపీఐ ఎంఎల్ ప్రతిఘటన. ఆ తర్వాత ఈ ప్రతిఘటన గ్రూపు రెండుగా చీలి ఆ తర్వాత ప్రతిఘటన- ప్రజా ప్రతిఘటనగా అవతరించాయి. 1992లో ఫణీంద్ర కుమార్ తో కలిసిన ప్రజాపంధా గ్రూపు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఏర్పాడ్డాయి. 2013లో ఈ గ్రూపు కూడా రెండుగా చీలింది. రెండు గ్రూపులు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పేరిటే పని చేస్తూ ఒక గ్రూపుకి చంద్రన్న (పాతూరి నారాయణ), మరో గ్రూపుకి రాయల సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. బోస్ నాయకత్వంలోని గ్రూపు కూడా ఇటీవల రెండుగా చీలిపోయింది. వీళ్లలెక్కలో ప్రతి చీలికా అనివార్యమే అనే అభిప్రాయం ఉంది. ఇటీవలి కాలం వరకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీలో పని చేసిన బ్రహ్మయ్యను మరో గ్రూపు వారు హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చర్చల ద్వారా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడం, మెజారిటీ నిర్ణయాన్ని పాటించడం వంటి నిర్మాణ సూత్రాలకు కట్టుబడి ఉండాల్సిన కమ్యూనిస్టు గ్రూపులు చంపుకోవడం ద్వారా భిన్నాభిప్రాయాన్ని సమాధి చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు ఐక్యతను కోరుకునే కమ్యూనిస్టు అభిమానులు. ఈ తరహా హత్యల్ని వాళ్లలో వాళ్లు సమర్ధించుకోవచ్చునేమో గాని చరిత్ర క్షమిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.


Read More
Next Story