సుదీర్ఘ శత్రుత్వానికి ముగింపు ఎన్నడో..
x
FILE: సిద్దరామయ్య, కుమారస్వామి

సుదీర్ఘ శత్రుత్వానికి ముగింపు ఎన్నడో..

కర్ణాటకలో సీఎం, హెచ్‌డీకే కత్తులు దూస్తున్నారు. వీరి మధ్య సుదీర్ఘ శత్రుత్వం మరింత ముదిరింది.


కర్ణాటకలో సీఎం, హెచ్‌డీకే కత్తులు దూస్తున్నారు. వీరి మధ్య సుదీర్ఘ శత్రుత్వం మరింత ముదిరింది.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, జనతాదళ్‌ (సెక్యులర్‌) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

సిద్ధరామయ్య ఒకప్పుడు జెడి(ఎస్‌) నాయకుడు. కుమారస్వామి కారణంగానే తాను ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన భావిస్తున్నారు. సీఎం రేసులో సిద్ధరామయ్య ఉండడాన్ని మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తనయుడు కుమారస్వామి జీర్ణించుకోలేకపోయారన్న టాక్‌ జనాల్లో ఉంది.

సహజంగానే అసెంబ్లీ లోపల, వెలుపల ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకుంటారు. కుమారస్వామి సిద్ధరామయ్యను మోసగాడని అభివర్ణించగా.. హెచ్‌డీకేను ‘దొంగ, శాడిస్ట్‌’ అని సిద్ధరామయ్య పేరుపెట్టారు.

శత్రుత్వం - సుదీర్ఘ చరిత్ర

ఇద్దరి మధ్య దూరం నేటిది కాదు. 2016లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుమారస్వామి ఆయనపై తరచూ విరుచుకుపడేవారు. ‘సోషలిస్టు’ అని చెప్పుకునే సిద్ధరామయ్య లక్షల రూపాయల ఖరీదు చేసే చేతి గడియారాన్ని ఎలా కొనగలిగారని హెచ్‌డీకే గట్టిగా ప్రశ్నించారు.

చేతిగడియారం వ్యవహారం సిద్ధరామయ్యను ఇరుకున పెట్టింది. పనిలో పనిగా దీనిపై విచారణ జరపాలని, సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. చివరకు నోరు విప్పిన సిద్ధరామయ్య .. రిస్ట్‌వాచ్‌ను దుబాయ్‌కు చెందిన కార్డియాక్‌ సర్జన్‌ బహుమతిగా ఇచ్చారని, దాన్ని సచివాలయంలో డిపాజిట్‌ చేస్తానని చెప్పారు.

మాటల యుద్ధం అంతటితో ముగిసిపోలేదు. బీజేపీ హయాంలో సిద్ధరామయ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అది కంటిన్యూ అయ్యింది. గతంలో హెచ్‌డీకే సీఎంగా ఉన్నపుడు మరింత రెచ్చిపోయారు.

ఆధిపత్య పోరు..

సిద్ధరామయ్య ఒకప్పుడు జేడీ(ఎస్‌) కర్ణాటక అధ్యక్షుడు. రాష్ట్రంలో పార్టీ ప్రాభవాన్ని విస్తరించడంలో దేవెగౌడతో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారు. మేలో సిద్ధరామయ్య సీఎం అయ్యారు. కాగా కాంగ్రెస్‌ లేదా బీజేపీ మద్దతుతో అత్యున్నత పదవిని ఆశించిన హెచ్‌డీకేకు నిరాశే మిగిలింది.

2004 ఎన్నికల తర్వాత, జేడీఎస్‌ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ధరమ్‌ సింగ్‌ (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రి కాగా, సిద్ధరామయ్య (అప్పటి జేడీఎస్‌) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 2006లో కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలు సంకీర్ణం నుంచి వైదొలగడంతో ప్రభుత్వం కూలిపోయింది. హై డ్రామా తర్వాత, కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా యడియూరప్ప కొనసాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరారు.

తాజా వివాదం..

నవంబర్‌ 13న సిద్ధరామయ్య అధికారిక బంగ్లాకు ఓ మంత్రి రూ. 1.90 కోట్ల విలువైన మంచం, రెండు సెట్ల సోఫాలను బహుమతిగా ఇచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ‘‘మీరు పేదల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు సాధారణ మనిషినని చెప్పుకుంటున్నావు. కాని విలాసవంతమైన జీవనం గడుపుతున్నావంటూ’’ హెచ్‌డీకే విమర్శించారు. సోఫా సెట్‌కు ఇంత ఖర్చు అవుతుందా? అని సిద్ధరామయ్య పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు.

ఆ మరుసటి రోజు దీపావళి పండుగ సందర్భంగా.. బెంగళూరు జెపి నగర్‌లోని హెచ్‌డీకే ఇంటికి ఓ విద్యుత్‌ స్థంభం నుంచి కరెంటును దొంగచాటుగా వాడుకున్న వీడియోను కాంగ్రెస్‌ విడుదల చేసింది. దీంతో బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కో (బెస్కామ్‌) వెంటనే కేసు నమోదు చేసింది. ఆరు నెలల జైలు శిక్ష పడే సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. విద్యుత్‌ చౌర్యం వీడియో కాస్త్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కుమారస్వామి తప్పును అంగీకరించవలసి వచ్చింది. కాని ఆయన దాన్ని ప్రైవేట్‌ డెకరేటర్‌పై తోయడంతో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు హెచ్‌డీకేను హేళన చేశారు. విద్యుత్తును అక్రమంగా వాడుకున్నందుకు ఏకంగా రూ. 68,526 చెల్లించిన హెచ్‌డీకే ఇది ‘‘అన్యాయం’’ అంటూ కాంగ్రెస్‌ నేతలపై తన కోపాన్ని ప్రదర్శించారు.

చెలరేగిపోయిన కుమారస్వామి

ఆగ్రహంతో ఊగిపోయిన హెచ్‌డీకే ‘‘నేను రాష్ట్ర ఆస్తులను కాజేయలేదు. నేను ఎవరి భూములను కొల్లగొట్టలేదని’’ ఎత్తిపొడుస్తూ.. పేర్ల జాబితాలో మార్పులు చేయాలని సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర కోరుతున్న వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. యతీంద్ర ‘సూపర్‌ ముఖ్యమంత్రి’లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

యతీంద్ర చొరవతో బదిలీలు పొందిన ప్రభుత్వ అధికారులు ఆయనకు పన్ను చెల్లించుకోవాలని ఘాటు విమర్శలు చేశారు హెచ్‌డీకే. అయితే ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ కుమారస్వామిని ‘‘హిట్‌ అండ్‌ రన్‌ పర్సన్‌’’గా ముద్ర వేసింది.

వివరణ ఇచ్చుకున్న సీఎం

కాగా యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పాఠశాలలకు నిధుల కేటాయింపులపై తాను, తన కుమారుడు చర్చిస్తున్నామని సిద్ధరామయ్య తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. వీడియోలో కనిపించిన కొన్ని పత్రాలను కూడా బయటపట్టారు.

ఇదే సమయంలో..‘‘హెచ్‌డీకే ఓ శాడిస్టు, దొంగ’’ అని సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ‘‘అబద్ధాలు, తప్పుడు ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. అమాయకులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదనే ఉద్దేశ్యంతో వివరాలు ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వాగ్దానాలను తుంగలో తొక్కారని, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని సీఎం ధ్వజమెత్తారు. సీఎంగా సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యింది. అయితే హెచ్‌డీకేతో ఇప్పట్లో యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Read More
Next Story