
‘తమిళనాడు దశ, దిశను మార్చిన ఘనత MGRదే’
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి..
తమిళనాడు(Tamil Nadu) దశ, దిశను మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్(MGR)కే దక్కుతుందని అన్నారు అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(EPS). సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆయన పేరు సుస్థిరం అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) వర్ధంతిని సందర్భంగా AIADMK నేతలు మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అరాచన డీఎంకే పాలనను అంతమొందిస్తామన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ 1987 డిసెంబర్ 24న 71 సంవత్సరాల వయసులో ఎంజీఆర్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఎంజీఆర్ గురించి క్లుప్తంగా..
తొలుత సిఎన్ అన్నదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో సభ్యుడయ్యాడు. అప్పటికే ఆయన మంచినటుడిగా గుర్తింపు ఉండడంతో రాజకీయాల్లో చాలా తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. అన్నాదురై మరణం తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలను కరుణానిధి చేపట్టారు. దీంతో కరుణానిధికి, ఆయనకు మధ్య రాజకీయ విరోధాలు తలెత్తాయి. అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డీఎంకేను విడిచిపెట్టి సొంత పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం (ఎఐఎడిఎంకె)ను స్థాపించారు. ఐదు సంవత్సరాల తరువాత 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఏఐఎడిఎంకె కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయన నేతృత్వంలో ఏఐఏడిఎంకె 1980లోనూ, 1984లోనూ విజయం సాధించింది.
1977లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంజీఆర్, పేదల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశేష ఆదరణ పొందారు.

