కర్నాటకలో రైతుల ఆందోళన, విధ్వంసం
x

కర్నాటకలో రైతుల ఆందోళన, విధ్వంసం

మిర్చి ధర పతనంతో ఆగ్రహించిన రైతులు.. వ్యవసాయ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి, తరవాత కార్యాలయంలోకి దూరి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మూడు వాహనాలకు నిప్పు పెట్టారు


కష్టపడి సాగు చేసిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు విధ్వంసానికి దిగారు. కర్నాటకలోని హవేరి జిల్లా, బైడ్గిలో ఈ ఆందోళన జరిగింది. తాము తీసుకొచ్చిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు గుమిగూడి విధ్వంసానికి పాల్పడ్డారు.

రైతులు ఫైర్ ఇంజన్‌తో సహా మూడు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు హూటాహూటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులు భారీగా గుమిగూడడంతో వారందరిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
హోంమంత్రి జి.పరమేశ్వర విలేకరులతో మాట్లాడుతూ ఒక్కరోజులోనే మిర్చి ధర క్వింటాల్‌కు రూ.20 వేల నుంచి రూ.8 వేలకు పడిపోయిందని, దీంతో హావేరి ఏపీఎంసీ మార్కెట్‌లో ఆందోళన చెలరేగిందని అన్నారు. అయితే ఈ ధరల పతనం ఏపీఎంసీ మార్కెట్లలోనే జరిగిందా రాష్ట్రమొత్తం జరిగిందా అని తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
ఇదే విషయంపై సీఎం సిద్ద రామయ్య కూడా స్పందించారు. ధరల పతనానికి గల కారణాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కూడా మిర్చి ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. గతంలో వరంగల్‌ ప్రాంతానికి చెందిన చపాట మిర్చి ధర ఈ ఏడాది సగానికి సగం తగ్గిపోవడంతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది మిర్చి ధర క్వింటాల్‌కు రూ.90 వేలు దాటగా, ఈ ఏడాది రైతులకు క్వింటాల్‌కు రూ.37 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది.
తెలంగాణలో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం 36 శాతం పెరిగింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగైంది.


Read More
Next Story