కాసర్‌గోడ్‌ ఆలయంలో అగ్ని ప్రమాదం.. వంద మందికి పైగా గాయాలు
x

కాసర్‌గోడ్‌ ఆలయంలో అగ్ని ప్రమాదం.. వంద మందికి పైగా గాయాలు

కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని ఓ ప్రముఖ ఆలయంలో అర్థరాత్రి ఉత్సవం నిర్వహిస్తు ఉండగా ఒక్కసారిగా బాణాసంచా గోడౌన్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు..


కేరళలోని ఓ ఆలయ సమీపంలో నిర్వహిస్తున్న ఉత్సవం సందర్భంగా బాణాసంచా పేలి 150 మంది భక్తులు గాయపడ్డారు. కాసర్‌గోడ్‌లోని నీలేశ్వరం ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కాసర్‌గోడ్, కన్నూర్, మంగళూరులోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వారు తెలిపారు. ఉత్సవ నిర్వాహక కమిటీలో భాగమైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

నీలేశ్వరం సమీపంలోని వీరర్కావు ఆలయం వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. 24,000 విలువైన చైనా తయారు చేసిన బాణాసంచా కొనుగోలు చేసినట్లు కమిటీ పోలీసులకు సమాచారం అందించింది. దానికి సంబంధించిన బిల్లును కూడా నిర్వాహకులు సమర్పించారు.
షాకింగ్ విజువల్స్
ఉత్తరాది జిల్లాలోని వీరర్కావు ఆలయంలో అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన పేలుడు ప్రశాంతమైన వాతావరణాన్ని చిధ్రం చేసింది. ఆ సమయంలో చాలామంది ప్రజలు తెయ్యం ఆచారం చూస్తూ ఆలయంలోనే ఉన్నారు. టెలివిజన్ ఛానెల్‌లు ప్రసారం చేసిన షాకింగ్ మొబైల్ ఫోన్ ఫుటేజీ, ప్రమాదం తీవ్రతను, నీలేశ్వరం సమీపంలోని గ్రామ దేవాలయం వద్ద గుమిగూడిన నిస్సహాయ ప్రజల బాధను వెల్లడించింది.
సీసీ ఫుటేజీలో, ఆలయానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉండగా, ఒక తెయ్యం కళాకారుడు, ఆచారబద్ధమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి, వారి మధ్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఒక దిగ్భ్రాంతికరమైన పేలుడు వినిపించింది. గుడి అవతలి వైపు మంటలు, పొగలు కనిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. మహిళలు, పిల్లలతో సహా ప్రజలు చెల్లాచెదురుగా పరుగులు తీయడం, ఇతరులను దూరంగా వెళ్లమని కోరడం కనిపించింది.
ప్రమాదాన్ని వివరించిన..
ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మంది షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని, అర్ధరాత్రి ఏం జరిగిందన్న దానిపై తమకు ఇంకా క్లారిటీ లేదని చెప్పారు. "మేము తెయ్యం చూస్తున్నాం.. అకస్మాత్తుగా కొంత దూరంలో పేలుడు శబ్ధం, తరువాత మంటలు కనిపించాయి. అదృష్టవశాత్తూ, మేము సురక్షితమైన ప్రదేశానికి వెళ్లగలిగాం " అని ఒక యువకుడు మంగళవారం టీవీ ఛానెల్‌లతో చెప్పాడు. క్షణాల్లో అంతా అయిపోయింది. విషాదం తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
క్రాకర్లు నిల్వ ఉంచిన షెడ్డు దగ్గర భారీ జనసమూహం ఉన్నట్లు మరో వ్యక్తి వివరించాడు. "షెడ్ సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. పేలుడు సంభవించినప్పుడు వారు సురక్షితంగా పారిపోవటం చాలా కష్టమైంది" అని అతను చెప్పాడు. క్రాకర్ పేలిన నిప్పురవ్వ షెడ్‌లో పడి ఉండవచ్చని, అక్కడ నిల్వ ఉంచిన క్రాకర్స్ కుప్పలకు మంటలు అంటుకున్నాయని ఓ వృద్ధుడు తెలిపారు.
'80 శాతం కాలిన గాయాలు'
తీవ్రంగా గాయపడిన వారికి 80 శాతం కాలిన గాయాలైనట్లు జిల్లా కలెక్టర్ మంగళవారం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని, ఘటనా స్థలం నుంచి నమూనాలు సేకరించామని, కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం బాణాసంచా నిల్వ కేంద్రం, క్రాకర్లు పేల్చే స్థలం సమీపంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
"భద్రతా జాగ్రత్తలు తీసుకోలేదు. రెండింటి మధ్య కనీసం 100 మీటర్ల దూరం నిర్వహించాలనే నిబంధనను పాటించలేదు. బాణసంచా నిల్వకు కూడా అనుమతి తీసుకోలేదు" అన్నారాయన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరర్కావు దేవాలయం సమీపంలోని బాణసంచా నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Read More
Next Story