ఏపీలో తొలి స్కిన్ బ్యాంక్ ఎక్కడంటే?
x

ఏపీలో తొలి స్కిన్ బ్యాంక్ ఎక్కడంటే?

‘‘రాష్ట్రంలో మొట్ట మొదటి స్కిన్ బ్యాంకును రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాం,’’- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్..


Click the Play button to hear this message in audio format

ఇప్పటివరకు మనం బ్లడ్ బ్యాంక్స్ చూశాం. ఐ బ్యాంక్స్‌ చూశాం. స్కిన్ బ్యాంక్ కూడా ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అసలు చర్మాన్ని ఎవరు దానం చేయవచ్చు. ఎవరు చేయకూడదు. చనిపోయిన వారి నుంచి ఏఏ భాగాల నుంచి చర్మాన్ని సేకరిస్తారు. ఎన్ని రోజుల లోపు తిరిగి వినియోగించాలి? తదితర వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం..


ఏపీలో మొట్టమొదటి స్కిన్ బ్యాంకును రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు(Kurnool)లో ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ (TG Bharat) ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్ 7) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు.


ప్రసంగిస్తున్న టీజీ భరత్..


స్కిన్ బ్యాంకు (Skin Bank) అంటే..

దాతల నుంచి చర్మాన్ని సేకరించి, శుద్ధి చేసి, అవసరమైన రోగులకు అందించేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాలను స్కిన్ బ్యాంకులుగా పిలుస్తారు.

కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతుంది. రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్‌ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే.. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే ఇబ్బందిని అధిగమించే ఉద్దేశంతో స్కిన్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు.

తొలి స్కిన్ బ్యాంకు ముంబైలో..

తీవ్రంగా గాయపడ్డ కాలిన రోగులకు గతంలో ఆటోగ్రాఫ్ట్ (తన శరీర చర్మం) అందుబాటులో లేకపోవడం వల్ల.. జీవించి ఉన్న దాతల నుంచి చర్మాన్ని తీసి చికిత్సలో ఉపయోగించేవారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డా. మనోహర్ హెచ్. కేశ్వానీ స్కిన్ బ్యాంకు ఏర్పాటుకు పూనుకున్నారు.


1972లో ఆయన ముంబైలోని వాడియా పిల్లల ఆసుపత్రిలో మొదటి చర్మ బ్యాంక్‌ను స్థాపించారు. అనంతరం 2009 నవంబర్ 21న EURO TISSUE BANK సహకారంతో ముంబైలోని నేషనల్ బర్న్స్ సెంటరులో ఆధునిక RCBN SKIN BANK ఏర్పాటయ్యింది. ఈ SKIN BANK‌లో మృతిచెందిన వారి నుంచి చర్మాన్ని సేకరించి, ప్రాసెస్ చేసి, భద్రపరుస్తారు. ఈ బ్యాంకు NBCకి మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా సేవలందిస్తోంది.

ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో..

భారత సైన్యం కూడా ఈ స్కిన్‌ బ్యాంకును ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ (పరిశోధన, రెఫరల్‌)లో ఏర్పాటు చేసింది. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్‌ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుంది. ప్లాస్టిక్‌ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం స్కిన్ బ్యాంకులో అందుబాటులో ఉంటూ.. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తారు.

ఏఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని?

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్కిన్ బ్యాంకులున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 7 బ్యాంకులు ఉన్నాయి. తమిళనాడులో 4, కర్ణాటకలో 3 ఉండగా..మధ్యప్రదేశ్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో ఒకటి చొప్పున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కూడా స్కిన్ బ్యాంకు లేదు.

మహారాష్ట్రలో ఎక్కడెక్కడ..

1. LT Medical College and Hospital SKIN BANK, Sion, Mumbai (2000)

2. RCBN SKIN BANK, Navi Mumbai

3. Rotary Surya hospital SKIN BANK, Pune

4. Rotary OCHRI SKIN BANK, Nagpur

5. Rotary Vedant Skin Collection Centre, Nasik

6. Masina Hospital, Byculla, Mumbai

7. Rotary Sushrut Hospital SKIN BANK, Sangli


తమిళనాడులో(4)..

1.Ganga hospital SKIN BANK, Coimbatore

2. SKIN BANK, Right Hospital

3. SKIN BANK, Kilpauk Medical College

4. SKIN BANK, Stanley Medical College


కర్ణాటకలో(3)..

1. Rotary Ashirvad Bangalore Medical College and Research Institute SKIN BANK, Victoria Hospital, Bangalore

2. KLES SKIN BANK, Belgaum (2018)

3. Rotary Kasturba Hospital, Manipal SKIN BANK


ఒడిశాలో..

1. Sum Hospital SKIN BANK, Bhubaneswar.


మధ్యప్రదేశ్‌లో..

Choithram Hospital SKIN BANK, Indore.


తెలంగాణలో..

Osmania Medical college, Hyderabad

డోనర్లు రకాలు..

1. లివింగ్ డోనర్ :

జీవించి ఉన్న వ్యక్తికి అనస్తీషియా ఇచ్చి కొంత చర్మాన్ని సేకరిస్తారు. అయితే దాత కనీసం 2–3 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. చర్మం తీసిన ప్రాంతం సుమారు 10 రోజుల్లో మానిపోతుంది. శస్త్రం తర్వాత కొన్ని రోజుల పాటు నొప్పి ఉంటుంది. ఒకేసారి గరిష్ఠంగా 15% నుంచి 20% చర్మాన్ని మాత్రమే సేకరిస్తారు.

2. క్యడావర్..

చనిపోయిన వారి నుంచి సేకరించిన చర్మాన్ని భద్రపరిచి అవసరమైన వారికి వాడతారు. మృతుడు లేదా మృతురాలి కుటుంబసభ్యల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. మరణానంతర చర్మాన్ని దానం చేయడం కొత్తదేం కాదు. 1950లోనే అమెరికాలో మొట్టమొదటి చర్మ బ్యాంక్ ఏర్పాటయ్యింది.


ఎవరు అనర్హులు..

16 సంవత్సరాలు పూర్తయి, ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా చర్మాన్ని దానం చేయవచ్చు. అయితే హెపటైటిస్ B లేదా C, HIV, స్కిన్ క్యాన్సర్, Systemic Sepsisతో బాధపడుతున్న వారు అనర్హులు.


చర్మాన్ని ఎక్కడెక్కడ సేకరిస్తారు?

చనిపోయిన వెంటనే సాధ్యమయినంత త్వరగా చర్మాన్ని సేకరించాలి. ఆరుగంటల లోపు చర్మాన్ని సేకరించాలి. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లయితే గరిష్టంగా 24 గంటల లోపే సేకరించాలి. ఆలస్యమైతే దాత చర్మంపై బాక్టీరియా, ఫంగస్ చేరుతుంది. అప్పుడు ఆ చర్మాన్ని సేకరించినా ఉపయోగించడానికి వీలుండదు. సాధారణంగా ఆపరేషన్ ధియేటర్‌లో చర్మాన్ని సేకరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి బెడ్‌ మీద, మృతుని ఇంటి వద్ద కూడా సేకరించవచ్చు. ఈ ప్రక్రియకు దాదాపు గంట సమయం పడుతుంది. రెండు తొడలు, వెనుక భాగం నుంచి ఎపిడెర్మిస్ పొరల్ని తీసుకుంటారు. ఒక్కో దేహం నుంచి 1000 నుంచి 2500 చదరపు సెంటీమీటర్ల చర్మాన్ని సేకరించవచ్చు. మనిషి మరణించి ఉంటాడు కాబట్టి రక్తస్రావం జరగదు. తర్వాత తొడలను డ్రెస్‌తో కప్పి మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు.


అనంతరం చర్మాన్ని Phosphate buffered saline ఉన్న గాజు సీసాలో ఉంచి, ఐస్ బాక్స్‌లో పెట్టి మృతుడి రక్త నమూనాతో పాటు స్కిన్ బ్యాంక్‌కు తరలిస్తారు. అక్కడ మైక్రోబయాలజిస్టుకు సమాచారం ఇచ్చి ప్రాసెసింగ్ ప్రారంభిస్తారు. సీరాలజీ, మైక్రోబయాలజీ రిపోర్టు సంతృప్తికరంగా ఉంటే.. నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన చర్మాన్ని గరిష్ఠంగా 6 నెలల పాటు భద్రపరచవచ్చు. కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఐదేళ్ల వరకు నిల్వ ఉంచవచ్చు.


తెలంగాణలో ఒక్క ఉస్మానియాలోనే..

వివిధ రాష్ట్రాల్లో సుమారు 17 స్కిన్ బ్యాంకులున్నా.. తెలంగాణ(Telangana)లో ఒక్కటే ఉంది. అది కూడా ఉస్మానియా ఆసుపత్రి(Osminia hospital)లోనే. 2021 జూన్‌లో అప్పటి హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ దీన్ని ప్రారంభించారు.


దాతల నుంచి కిడ్నీ, లివర్ అవయవాలను పొందే ‘జీవన్‌దాన్’ స్కీంలో స్కిన్ బ్యాంకునూ చేర్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అగ్ని ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం కాలిన గాయాలతో వచ్చిన వారికి ఉస్మానియా ఆసుపత్రి పునర్జన్మను ప్రసాదిస్తుంది.

Read More
Next Story