
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్ కన్నుమూత..
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. జాతీయ విద్యా విధానం (NEP) సంస్కరణల్లో ప్రముఖ వ్యక్తి కూడా.
ఇస్రో (Indian Space Research Organisation) మాజీ చీఫ్ కె కస్తూరిరంగన్ (K Kasturirangan) కన్నుమూశారు. ఈ రోజు (ఏప్రిల్ 25వ తేదీ) ఉదయం బెంగళూరు(Bengaluru)లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా వృధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన కుమారులు చెప్పారు. నివాళులర్పించేందుకు ఆయన భౌతికకాయాన్ని 27వ తేదీన రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI)లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
పద్మ విభూషణడు కూడా..
కస్తూరిరంగన్ కేరళలోని ఎర్నాకుళంలో సీఎం కృష్ణస్వామి అయ్యర్ విశాలాక్షి దంపతులకు 1940 అక్టోబర్ 24న జన్మించారు. తమిళనాడుకు చెందిన ఆయన కుటుంబం త్రిస్సూర్ జిల్లాలోని చలకుడిలో స్థిరపడింది. తల్లి పాలక్కాడ్ అయ్యర్ కుటుంబానికి చెందిన వారు. తొలుత ఏప్రిల్ 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ ఉన్నారు. తొమ్మిది సంవత్సరాలు ఇస్రో చైర్‌పర్సన్‌గా పనిచేసిన కస్తూరిరంగన్.. 2003 ఆగస్టులో పదవి నుంచి వైదొలిగారు. ఆయన సేవలకు 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది.
వీసీగా, ఎంపీగా..
గతంలో కస్తూరి రంగన్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. జాతీయ విద్యా విధానం (NEP) సంస్కరణల్లో ప్రముఖ వ్యక్తి కూడా. రాజ్యసభ సభ్యుడిగా (2003–09), భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు.